logo

అపూర్వం.. అనంత ప్రేరణ

కర్ణాటకకు సంబంధించిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు దివంగత కేంద్ర మంత్రి అనంతకుమార్‌ బతికున్న రోజుల్లో చట్టసభల్లో తన వాణిని వినిపించేవారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నివాళులర్పించారు. జయనగరలో అనంతకుమార్‌ వినియోగించుకున్న కార్యాలయాన్ని ‘అనంత ప్రేరణ కేంద్రం’గా కుటుంబ సభ్యులు తీర్చిదిద్దారు

Published : 07 May 2022 04:18 IST

అనంతకుమార్‌ చిత్రం వద్ద గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బొమ్మై తదితరులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటకకు సంబంధించిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు దివంగత కేంద్ర మంత్రి అనంతకుమార్‌ బతికున్న రోజుల్లో చట్టసభల్లో తన వాణిని వినిపించేవారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నివాళులర్పించారు. జయనగరలో అనంతకుమార్‌ వినియోగించుకున్న కార్యాలయాన్ని ‘అనంత ప్రేరణ కేంద్రం’గా కుటుంబ సభ్యులు తీర్చిదిద్దారు. ఆయన వినియోగించిన వస్తువులు, ప్రసంగ ప్రతులు, ఛాయాచిత్రాలను ఈ కేంద్రంలో ఆవిష్కరించారు. గరవ్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌తో కలిసి ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరు మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం, హుబ్బళ్లిలో నైరుతి రైల్వే జోన్‌, ఎగువ కృష్ణా ప్రాజెక్టులతో పాటు, కావేరి జల వివాదాన్ని తీవ్రం కాకుండా అనంతకుమార్‌ తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తనకు అత్యంత ఆత్మీయ స్నేహితునిగా ఉన్నారని, ఆయన ఏ ఉన్నత స్థానానికి ఎదిగినా స్నేహంలో మార్పు రాలేదని చెప్పారు. ప్రజా పోరాటాల్లో ముందుంటూ, ఇతరులనూ ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ, ఏబీవీపీ, భాజపాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా నిలిచారని కొనియాడారు. అనంతకుమార్‌తో కలిసి ఒకే కళాశాలలో చదువుకున్నానని, ఎవరు ముందుగా వెళితే వారు బెంచీని మరొకరి కోసం రిజర్వు చేసి ఉంచే వారిమని గుర్తు చేసుకున్నారు. అత్యవసర పరిస్థితిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేర్చడంలో జరిగిన లాఠీఛార్జ్‌లో ఆయన దెబ్బలు తిన్నారని తెలిపారు. అప్పుడు అరెస్టు కావడంతో ఒక ఏడాది కళాశాలకు దూరమయ్యారని గతాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో కొనసాగుతూనే హాస్య ప్రజ్ఞ కలిగి ఉన్న అనంతకుమార్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని వివరించారు. అనంతకుమార్‌ వినియోగించిన వస్తువులను ఈ కేంద్రంలో ఉంచారు. తనకు, అనంతకుమార్‌కు ఉన్న అనుబంధాన్ని గవర్నర్‌ గహ్లోత్‌, ఇతర నాయకులు ఇదే సందర్భంలో గుర్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని