logo

మట్టి మనిషిపై వరుణార్భాటం

ముంగార్లు మురిపించాయని సంబరపడాలో.. అపార నష్టాన్ని కల్గించాయని కుమిలిపోవాలో తెలియని అయోమయ స్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు.

Published : 20 May 2022 02:13 IST

కోలుకోని నగరం : వాననీరు బెంగళూరును చుట్టుముట్టింది. హరమావు,
శ్రీసాయి లేఔట్‌ కాలనీల్లోని ఈ చిత్రాలే ప్రస్తుత పరిస్థితికి దర్పణం 

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : ముంగార్లు మురిపించాయని సంబరపడాలో.. అపార నష్టాన్ని కల్గించాయని కుమిలిపోవాలో తెలియని అయోమయ స్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తొలి ముంగార్లు పలుకరించగా నేనున్నానంటూ దానికి అసని తుపాను తోడైంది.. మీవెంటే నేనంటూ నైరుతి రుతుపవనాలు దూసుకొచ్చాయి. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాలి. ఈ ఏడాది పక్షం రోజుల ముందుగానే దూసుకొచ్చాయి. ముప్పేట దాడి అన్నట్లుగా రాష్ట్రాన్ని ఈ మూడు పరిణామాలు అతలాకుతలం చేశాయి. కోలారు జిల్లాలో పది వేల ఎకరాలకు పైగా పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. ప్రస్తుతం మామిడి కాయ దశ నుంచి పండు దశకు మారే సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాలకు బలమైన ఈదురు గాలులు తోడవడంతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తోటల్లోకి అడుగుపెడితే చాలు.. పరిచినట్లుగా కాయలన్నీ నేలపై పడిపోతున్నాయి. కాయదశలోనే ఉన్నందున అవి పండుగా మారడం అసాధ్యమని- ఈ ఏడాది పూర్తిగా నష్టపోయినట్లేనని రైతులు వాపోయారు. ఆలస్యంగా పూత వచ్చినా మంచి దిగుబడులు సాధ్యమని భావిస్తే అకాల వర్షాలు తమను నిలువునా ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా రూపొందించిన అంచనా ప్రకారమే కోలారు జిల్లాలోనే రూ.31 కోట్ల నష్టం వాటిల్లింది. అదే విధంగా దావణగెరె జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తే నాలుగైదు కోట్లలోనే ఉంటుందని భావిస్తున్నారు. ఇతర అనేక జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.

 

పంట నష్టాన్ని పరిశీలించి నివేదికలు పంపాలని జిల్లా పాలనాధికారులకు వ్యవసాయ మంత్రి బి.సి.పాటిల్‌ సూచించారు. భారీ వర్షాల వల్ల ఏమేరకు నష్టం వాటిల్లిందో పరిశీలించి నివేదికల్ని పంపాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి బి.సి.పాటిల్‌ ఆయా జిల్లాల జిల్లా పాలనాధికారులకు సూచించారు. నివేదికల ఆధారంగా బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ సూచనల్ని నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత రైతులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగరాదని అన్నారు.

వాగులు, వంకల్లో గలగలలు : పంటల నష్టం, ఆస్తి నష్టం సంగతి అటుంచితే వాగులు, వంకలు, నదులు, సెలయేళ్లలో నీటి గలగలల్ని ఈ అకాల వర్షాలు మోసుకొచ్చాయి. తుంగభద్ర జలాశయానికి 3126 క్యూసెక్కుల నీరు చేరుతోంది. నాగరహొళె అభయారణ్యం నుంచి వరద నీరు చేరుతుండడంతో కబిని జలాశయానికి 3424 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. కావేరి పరీవాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదవడంతో మడికెరి సమీపంలో కావేరి నదిలో నీటి ప్రవాహం ఓమోస్తరుగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మండ్య జిల్లాలోని కృష్ణ రాజసాగర జలాశయం నీటి మట్టం క్రమేపీ అధికమవుతోంది. మొన్నటి వరకు వంద అడుగుల నీరుండగా గురువారం సమయానికి ఇది 101.72 అడుగులకు చేరింది. జలాశయానికి 15,885 క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు వెల్లడించారు.

హాసన జిల్లా హిరిసావొె దొడ్డకెరె అలుగు పారడంతో జనం కేరింతలు

నాగరహొళె : హెబ్బళ్ల జలాశయం భర్తీ కావడంతో ఉరకలెత్తుతున్న నీరు

నాగమంగల : మాచనాయకనహళ్లి చెరువు నుంచి గంగ పరుగులు

తుంగా గేట్లు ఎత్తివేత

తుంగా జలాశయం నుంచి నీటి విడుదలతో దిగువ ప్రాంతం ముంపు పాలు

శివమొగ్గ, న్యూస్‌టుడే : అసలైన వానాకాలానికి ముందే పడమటి కనుమల్లో భారీ వర్షాల కారణంగా తుంగా నది పరవళ్లు తొక్కుతోంది. శివమొగ్గ నగరానికి సమీపంలోని గాజనూరు వద్ద తుంగా జలాశయం నుంచి ఐదు వరద గేట్ల ద్వారా ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జలాశయం భర్తీ అయినందున వరద నీటిని అంతే పరిమాణంలో విడుదల చేస్తున్నామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. నదికి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నది వద్దకు వెళ్లవద్దని దిగువన ఉన్న గ్రామస్థులకు సూచించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిసినట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. హావేరి జిల్లా కలవరకొప్పలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుక్కెలో 16, నిడిగె, ఉచ్చంగిదుర్గలో 12, సుంటికొప్ప, మండ్య 11, బెవూరు, యల్బుర్గ, మునీరాబాద్‌ 10, తావరగెరె, మస్కీ, చిత్రదుర్గ, శనివారసంతె, సోమవారపేటె, తొండేబావి, దావణగెరె, భద్రావతి, కొప్పళ, మధుగిరి, కురుగోడు 9, జయపుర, భాగమండల 8, కార్కళ, మంగళూరు, సకలేశపుర, బాళెహొన్నూరులో ఏడు సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. గదగ్‌, మండ్య, తుమకూరు, బెంగళూరు, దార్వాడ, బళ్లారి, చిక్కబళ్లాపుర, యాదగిరి జిల్లాల్లో విస్తారంగా ఓమోస్తరు నుంచి భారీ వర్షం కురిసినట్లు సమాచారం అందింది. బెంగళూరు నగరంలో గురువారం ఉదయం నుంచే వర్షం ఆరంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కురిసింది. రాబోయే రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని