logo

విస్తరణ ఊసే లేదాయె

దిల్లీ పర్యటన సందర్భంగా అధినాయకులతో ఏ విషయాలూ చర్చించలేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం పేరిట శుక్రవారం రాత్రి దిల్లీకి తరలిన విషయం తెలిసిందే

Published : 22 May 2022 01:55 IST

ఇక ఎన్నికలపైనే దృష్టి : బొమ్మై

బసవరాజ బొమ్మై

ఈనాడు, బెంగళూరు : దిల్లీ పర్యటన సందర్భంగా అధినాయకులతో ఏ విషయాలూ చర్చించలేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం పేరిట శుక్రవారం రాత్రి దిల్లీకి తరలిన విషయం తెలిసిందే. అక్కడ షా అందుబాటులో లేకపోవటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌తో మాత్రమే చర్చలు జరిపారు. అమిత్‌ షా సూచన మేరకు ఇటీవలి కోర్‌ కమిటీలో చర్చించిన విషయాలను అరుణ్‌సింగ్‌ ఫోన్లో విశ్లేషించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ ఊసు లేనట్లే

గడచిన పది రోజుల్లో రెండో సారి దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ఎంతో ప్రయత్నించారు. గతవారం దిల్లీకి వెళ్లిన సమయంలో.. రెండు రోజుల్లో విస్తరణ ప్రక్రియపై స్పష్టత వస్తుందని కూడా చెప్పారు. ఆలోగా బీబీఎంపీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఏడు విధాన పరిషత్తు నియోజకవర్గాలకు- నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఈ ఎన్నికలపై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనివార్యంగా మారింది. గతవారం బెంగళూరులో నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలోనూ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో తీర్మానించిన పేర్లను ముఖ్యమంత్రి దిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఎన్నికలపై అరుణ్‌సింగ్‌తో చర్చించిన అంశాలను త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చింనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మే 24, రాజ్యసభ ఎన్నికలకు మే 31న నామినేషన్లకు తుది గడువు. ఈలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించనున్నట్లు బొమ్మై శనివారం వెల్లడించారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై చర్చించబోమని స్పష్టం చేశారు. విస్తరణ ప్రక్రియ పార్టీ అంతర్గత వ్యవహారం.. రాజకీయ పరిణామాలు కీలకమైన దశలో వీటిని వాయిదా వేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

 

వేగంగా పరిహారం

దిల్లీలో అరుణ్‌సింగ్‌తో ఫోన్లో మాట్లాడాక ముఖ్యమంత్రి బెంగళూరుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా బొమ్మై మాట్లాడుతూ బెంగళూరుతో పాటు వివిధ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ నేతృత్వంలో పరిహారం గురించి డేటా రూపొందించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం తాను బెంగళూరులో పర్యటించి వర్ష ప్రభావంపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించినట్లు చెప్పారు. సాయంత్రానికి బెంగళూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం కృష్ణాలో జిల్లాధికారులు, జిల్లా పంచాయతీ సీఈఓలతో సమావేశమై వర్షాలపై చర్చించారు.

దావోస్‌కు ప్రయాణం

దావోస్‌లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్ల్యుఈఎఫ్‌) సమావేశానికి ముఖ్యమంత్రి బొమ్మై హాజరుకానున్నారు. ఆయన ఆదివారం ఉదయం దావోస్‌కు బయలుదేరుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈనెల 22 నుంచి 26 వరకు కొనసాగే సమావేశానికి ముఖ్యమంత్రి 23, 24 తేదీల్లో మాత్రమే హాజరవుతారు. 25న స్విట్జర్లాండ్‌ నుంచి బయలుదేరి.. దుబాయి మీదుగా ఈనెల 26న బెంగళూరుకు చేరుకుంటారు. బీబీఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల కారణంగా ముఖ్యమంత్రి దావోస్‌ ప్రయాణంపై సందిగ్ధత నెలకొన్నా.. నవంబరులో కర్ణాటకలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం(జిమ్‌) కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కావాల్సి ఉండటంతో దావోస్‌కు వెళ్లేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి దావోస్‌ ఆహ్వానం అందుకున్న ఇద్దరు ముఖ్యమంత్రుల్లో బసవరాజ బొమ్మై కూడా ఒకరు కావటంతో ఈ పర్యటనను కొనసాగించేందుకే ఆయన ఆసక్తి చూపారు.

అరుణ్‌సింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని