logo

వర్షాలకు రూ.2.39 కోట్ల నష్టం

జిల్లాలో వారం నుంచి కురిసిన వర్షాలకు రూ.2.39 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకు వివరించారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బొమ్మై జిల్లా పాలనాధికారి, ఇతర శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Published : 22 May 2022 01:55 IST

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీసీ పవన్‌కుమార్‌ మాలపాటి, ఇతర శాఖాధికారులు

బళ్లారి, న్యూస్‌టుడే : జిల్లాలో వారం నుంచి కురిసిన వర్షాలకు రూ.2.39 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకు వివరించారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బొమ్మై జిల్లా పాలనాధికారి, ఇతర శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీసీ మాట్లాడుతూ ఈ మధ్య కురిసిన వర్షాలకు ఇద్దరు మృతి చెందగా.. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల పరిహారం అందజేసినట్లు సీఎంకు తెలిపారు. 14 పశువులు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 161 ఇళ్లకు నష్టం జరిగింది. 244.1 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వివరించారు. 371 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 31 విద్యుత్తు ట్రాన్స్‌ఫ్మార్మర్‌లు కాలిపోయాయి. మొత్తం రూ.2.39 కోట్లు నష్టం జరిగినట్లు సీఎంకు వివరించారు. పరిహారం అందని వారికి మూడు రోజుల్లో పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి అడిగిన ఒక ప్రశ్నకు డీసీ సమాధానమిచ్చారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ సీఈవో జి.లింగమూర్తి, జిల్లా పోలీస్‌ అధికారి సైదులు అడావత్‌, ఏడీసీ పి.ఎస్‌.మంజునాథ, ఏసీ డా.ఆకాశ్‌ శంకర్‌, వ్యవసాయ జేడీ డా.మల్లికార్జున, ఉద్యాన శాఖ జేడీ శరణప్ప భోగి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉన్నాం.. అన్నింటినీ ఎదుర్కొంటాం..

హొసపేటె: వర్షాలు సృష్టిస్తున్న సమస్యలను ఎదుర్కొనేందుకు విజయనగర జిల్లాలో అధికారులతో కలిసి అప్రమత్తంగా ఉన్నామని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. వాన తెచ్చిన నష్టాలపై సంబంధించిన జిల్లాల మంత్రులు, పాలనాధికారులతో శనివారం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ పలు సూచనలిచ్చారు. జిల్లాలోని పశ్చిమ తాలూకాల్లో వాన ప్రభావం ఎక్కువగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఆ తాలూకాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించామని డీసీ సీఎంకు నివేదించారు. ప్రకృతి బీభత్సంతో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని డీసీ వివరించారు. జిల్లాలో నిధుల కొరత లేదని పేర్కొన్నారు. వర్ష ప్రభావం తగ్గేవరకూ తహసీల్దారు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు కేంద్ర స్థానాల్లోనూ ఉండాలని సూచనలిచ్చామని తెలిపారు. తుంగభద్రకు వరద పెరిగినందున హడగలి, హగరిబొమ్మనహళ్లి ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చామని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో భోయేర్‌ హర్షల్‌ నారాయణ రావు పాల్గొన్నారు.

పంట పరిశీలన

నష్టపోయిన వరి పంటను పరిశీలిస్తున్న అధికారులు

బళ్లారి, న్యూస్‌టుడే : బళ్లారి తాలూకాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన వరి పైర్లను బళ్లారి ఉపవిభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ డా.ఆకాశ్‌ శంకర్‌, వ్యవసాయశాఖ జేడీ డా.మల్లికార్జున, తహసీల్దారు విశ్వనాథ తదితరులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బళ్లారి తాలూకా బైరదేవనహళ్లి గ్రామంలో హొన్నారెడ్డికి చెందిన ఏడు ఎకరాలు, కృష్ణమూర్తి, బసవరాజకు చెందిన 23 ఎకరాల్లో వరి రెండు రోజుల్లో కోత కోయవల్సి ఉండగా, ఈ మధ్యలోనే కురిసిన వర్షాలకు పూర్తిగా వర్షపునీటిలో మునిగిపోయి మొలకలు వచ్చాయి. ఈ పంటను అధికారులు పరిశీలించి రైతులు నుంచి వివరాలు తెలుసుకున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని