logo

తుపాకీతో బెదిరించి లైంగిక దాడి

తన ఇంట్లో బాడుగకు ఉంటున్న యువతి (20)ని తుపాకీతో బెదిరించి, లైంగికదాడికి పాల్పడిన అనిల్‌ రవిశంకర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తిని అశోకనగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచి.. విచారణ నిమిత్తం మూడు రోజులు తమ అదుపులోకి తీసుకున్నారు.

Published : 24 May 2022 02:28 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : తన ఇంట్లో బాడుగకు ఉంటున్న యువతి (20)ని తుపాకీతో బెదిరించి, లైంగికదాడికి పాల్పడిన అనిల్‌ రవిశంకర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తిని అశోకనగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచి.. విచారణ నిమిత్తం మూడు రోజులు తమ అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌కు చెందిన నిందితుడు నగరంలో బండల (టైల్స్‌) వ్యాపారం చేసేవాడు. తన ఇంట్లో ఒక వాటాను పశ్చిమ్‌ బంగాకు చెందిన యువతికి గత మార్చిలో బాడుగకు ఇచ్చాడు. ఆమె ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమె స్నేహితులు ప్రతిసారీ ఇంటికి వచ్చి వెళ్లడంపై అనిల్‌ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గత ఏప్రిల్‌లో ఆమె స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు, వారి తలుపునకు బయట నుంచి తాళం వేశాడు. మీరిద్దరూ ఒకే గదిలో ఉండడాన్ని పోలీసులు గుర్తించారని- తాళం వేసి వెళ్లారని బెదిరించాడు. పోలీసులు వస్తే ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకు వెళతారని చెప్పాడు. తాను పోలీసులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని నమ్మించాడు. తానే తలుపు తీసి, మళ్లీ ఎప్పుడూ ఈ ఇంటి ఛాయలకు రావద్దని ఆ యువకుడిని పంపించాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థినిపై కన్నేసిన నిందితుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నీతో మాట్లాడాలంటూ ఆమె గదిలోకి ప్రవేశించిన అనిల్‌.. దురుసుగా ప్రవర్తించాడని, తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది. ఈ ఘటన ఏప్రిల్‌ 11న జరిగిందని వివరించింది. భయంతో తాను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయానని వెల్లడించింది. తల్లికి చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింంది. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని