logo

‘కాషాయదండు లూటీ పర్వం’

కరోనా పేరుతో భాజపా పాలకులు దాదాపు రూ.2000 కోట్లు లూటీ చేశారని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. బెంగళూరు జయనగరలో సోమవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. యడియూరప్ప పాలనావధిలో మంత్రి రమేష్‌ జార్ఖిహొళి ఎందుకు రాజీనామా చేశారో ప్రజలందరికీ తెలుసున్నారు

Published : 24 May 2022 02:28 IST

సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్‌, రామలింగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జయనగర ప్రాంత నేతలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కరోనా పేరుతో భాజపా పాలకులు దాదాపు రూ.2000 కోట్లు లూటీ చేశారని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. బెంగళూరు జయనగరలో సోమవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. యడియూరప్ప పాలనావధిలో మంత్రి రమేష్‌ జార్ఖిహొళి ఎందుకు రాజీనామా చేశారో ప్రజలందరికీ తెలుసున్నారు. మొన్నటికి మొన్న కె.ఎస్‌.ఈశ్వరప్ప ‘40 శాతం కమీషన్‌’ కోసం డిమాండు చేయడంతోనే ఓ గుత్తేదారు ఆత్మహత్య చేసుకున్నాక.. పదవి వదులుకోక తప్పలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ నేతలు రూ.500 కోట్లు వ్యయం చేసి 17 మంది శాసనసభ్యులను ‘ఆపరేషన్‌ కమల’ పేరిట కొనుగోలు చేసి దొడ్డిదారి గుండా అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. పీఎస్‌ఐ నియామకాలకు అభ్యర్థుల నుంచి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. బెంగళూరు నగరంలో కురిసిన వర్షాలకు పలు ప్రదేశాలు ముంపుపాలైనా.. ఏలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తప్పుపట్టారు. రానున్న బెంగళూరు పాలికె ఎన్నికల్లో భాజపాను ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎగువ సభలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌, పీసీసీ కార్యాధ్యక్షులు సలీం అహ్మద్‌, రామలింగారెడ్డి, శాసనసభ్యురాలు సౌమ్యరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జయనగర ప్రాంతానికి చెందిన పలువురు భాజపా, జేడీఎస్‌ కార్యకర్తలు సిద్ధరామయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని