logo

ఉత్కంఠభరితంగా పరిషత్‌ పోరు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ విధాన పరిషత్‌ నియోజకవర్గాల ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ పర్వం మంగళవారంతో ముగిసినా.. అసలైన రాజకీయానికి ఇక్కడే తెరలేచింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే సభ్యులకు సంబంధించి- భాజపా తరఫున నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, జేడీఎస్‌ అభ్యర్థిగా ఒక్కరు నామినేసన్‌ వేశారు.

Published : 25 May 2022 05:07 IST

పరిషత్‌ పోరులో ఏకైక మహిళా అభ్యర్థి హేమలతా నాయక్‌ (భాజపా) నామినేషన్‌ దాఖలు

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రవ్యాప్తంగా వివిధ విధాన పరిషత్‌ నియోజకవర్గాల ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ పర్వం మంగళవారంతో ముగిసినా.. అసలైన రాజకీయానికి ఇక్కడే తెరలేచింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే సభ్యులకు సంబంధించి- భాజపా తరఫున నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, జేడీఎస్‌ అభ్యర్థిగా ఒక్కరు నామినేసన్‌ వేశారు. ప్రతి అభ్యర్థికీ 29 విధానసభ సభ్యుల ఓట్లు అవసరం. ప్రస్తుతం పార్టీలకున్న సంఖ్యాబలంతో వారంతా నెగ్గవచ్ఛు నామినేషన్‌ వేసిన ప్రతి ఒక్కరూ పరిషత్‌లో ప్రవేశించినట్లే. మరోవైపు పశ్చిమ ఉపాధ్యాయ క్షేత్రానికి అభ్యర్థిగా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ బసవరాజ హొరట్టి నామినేషన్‌ వేశారు.

అభ్యర్థుల జాబితా ఖరారు చేసే క్రమంలో అధికార పక్షం ఉత్కంఠను చివరి వరకు కొనసాగించింది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోశ్‌, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మధ్య ఆధిపత్యం పోరు తారస్థాయిలో కొనసాగింది. తుది జాబితా ఖరారులో బీఎల్‌ సంతోశ్‌ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. యడియూరప్ప శిబిరం కంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా ప్రస్థానమే అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించింది. ఎ.నారాయణస్వామి, ఎస్‌.కేశవ ప్రసాద్‌, హేమలతా నాయక్‌ ఇక్కడ సంతోశ్‌ సిపార్సు చేసిన అభ్యర్థులు. లక్ష్మణ సవది పేరును ఏకంగా అధిష్ఠానం సూచించింది. యడియూరప్ప సిఫార్సు చేసిన బి.వై.విజయేంద్ర, లింగరాజ పాటిల్‌, మంజుళకు అవకాశం దక్కలేదు.

కాంగ్రెస్‌ ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో డీకే శివకుమార్‌ పంతం నెగ్గుంచుకున్నారు. సిద్ధరామయ్య సిఫార్సు చేసిన ఎస్‌.ఆర్‌.పాటిల్‌ను కాదని నాగరాజు యాదవ్‌కు అవకాశం దక్కింది. అబ్దుల్‌ జబ్బార్‌ను నేరుగా డీకే శివకుమార్‌ ప్రతిపాదించారు. గతంలో పీసీసీ అల్ప సంఖ్యాక విభాగానికి జబ్బార్‌ను అధ్యక్షులుగా చేయటంలోనూ డీకే పాత్ర కీలకమే.

గౌడ మెచ్చిన శరవణ : ఒకే ఒక స్థానాన్ని దక్కించుకునే జేడీఎస్‌లోనూ ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ కనిపించింది. పార్టీ పెద్ద దేవేగౌడకు ప్రీతిపాత్రుడుగా గుర్తింపు పొందిన టీఏ శరవణకు మళ్లీ అవకాశం దక్కింది. వాస్తవానికి సీఎం ఇబ్రహీం మరోమారు పరిషత్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపినా ఆయన పార్టీ అధ్యక్ష పదవితో సరిపెట్టుకోక తప్పలేదు. బసవరాజ హొరట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లటంతో ఆయన శిష్యుడు శ్రీశైల నింగప్పను బరిలో దించి గురువును దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది.

వాయువ్య, దక్షిణ పట్టభద్ర, వాయువ్య, పశ్చిమ ఉపాధ్యాయ విధానసభ నియోజకవర్గాలకు మొత్తం 23 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 16 మంది పురుషులు.. ఇద్దరు మహిళలు ఉన్నారు. పార్టీల వారీగా భాజపా 9, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల నుంచి ఒక్కో అభ్యర్థి నామినేషన్‌ వేశారు. 10 మంది స్వతంత్రులు బరిలోకి దిగారు. అత్యధికంగా దక్షిణ పట్టభద్ర క్షేత్రానికి పది మంది నామినేషన్లు వేశారు.

అభ్యర్థుల నామినేషన్‌కు మంగళవారం చివరి రోజు.. ఏకకాలంలో మూడు పార్టీల

నేతలూ కదలిరావడంతో రిటర్నింగ్‌ అధికారిణి కార్యాలయం ముంగిట కిటకిట

విధానపరిషత్‌ ఎన్నికల ప్రచారానికి మంగళవారం రాత్రి మైసూరు చేరుకున్న కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్యకు పార్టీ శ్రేణుల స్వాగతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని