logo

విద్యుత్తు కాంతి కిరణాలు

దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు దారిపడుతున్నాయి. ముఖ్యమంత్రి బొమ్మై పాల్గొన్న తొలిరోజున లులు, హీరో మోటార్స్‌, హిటాచీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. మంగళవారం ఇంధన రంగంలో విఖ్యాత సంస్థ రెన్యూ పవర్‌

Published : 25 May 2022 05:07 IST

గౌతమ్‌ అదానీకి రాష్ట్ర పథకాలను వివరిస్తున్న సీఎం

ఈనాడు, బెంగళూరు : దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు దారిపడుతున్నాయి. ముఖ్యమంత్రి బొమ్మై పాల్గొన్న తొలిరోజున లులు, హీరో మోటార్స్‌, హిటాచీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. మంగళవారం ఇంధన రంగంలో విఖ్యాత సంస్థ రెన్యూ పవర్‌ రాష్ట్రంలో దాదాపు రూ.అర్ధ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏడేళ్ల కాలంలో సంప్రదాయేతర ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ యూనిట్‌లను రెండు దశల్లో స్థాపించేందుకు ఆసక్తి చూపింది. తొలి దశలో ఇప్పటికే అమలులో ఉన్న పథకాల్లో రూ.11,900 కోట్లను రానున్న రెండేళ్లలో, రెండో దశలో రూ.37,500 కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ యూనిట్‌లను స్థాపించనుంది. ఈ రెండు దశల ప్రాజెక్టుల్లో కనీసం 30 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో 120కంటే అధిక పవన, సౌర, హైడ్రో ఇంధన ప్రాజెక్టులను స్థాపించిన రెన్యూ పవర్‌ సంస్థ రాష్ట్రంలోనూ 12 గిగా వ్యాట్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇదే అంశంపై సంస్థ అధ్యక్షులు సుమంత్‌ సిన్హా రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

మెగా డేటా సెంటర్‌

డేటా సెంటర్‌లో ఐదేళ్ల భారీ కార్యాచరణను రూపొందించిన రాష్ట్రానికి భార్తి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ రూపంలో మరో మెగా సెంటర్‌ రూపుదిద్దుకోనుంది. ఈ సంస్థ అధ్యక్షులు సునీల్‌ భార్తి మిట్టల్‌ ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి బొమ్మైతో చర్చించారు.

భవనాల భద్రతా పరికరాలను ఆటోమేషన్‌ నియంత్రణ వ్యవస్థలతో రూపొందించే జాన్సన్‌ కంట్రోల్స్‌ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఈ సంస్థ సీఈఓ జార్జ్‌ ఒలియర్‌తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

అంతరిక్ష, భవన నిర్మాణ, ఆటోమేషన్‌ సాంకేతిక ఉత్పత్తుల తయారీ సంస్థ హనీవెల్‌ రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ సంస్థ ఉపాధ్యక్షుడు అమి చియాంగ్‌తో ముఖ్యమంత్రి బొమ్మై, పరిశ్రమల మంత్రి మురుగేశ్‌ నిరాణి భేటీ అయ్యారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను ‘బియాండ్‌ ద బెంగళూరు’ పథకంలో భాగంగా ప్రారంభిస్తారు.

అమెరికాకు చెందిన కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, మిడిల్‌ వేర్‌, సాఫ్ట్‌వేర్‌, కన్సల్టెన్సీ సంస్థ ఐబీఎం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. భారత క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థలకు బెంగళూరు కేంద్రంగా ప్రాజెక్టులను స్థాపించటం ఈ సంస్థ లక్ష్యమని ఈ సంస్థ ఛైర్మన్‌ అరవింద్‌ కృష్ణ ఈ సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని