logo

పారిశ్రామిక పెట్టుబడుల వెల్లువ

ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సాంకేతిక ఆవిష్కారాలను అందిపుచ్చుకోవటంలో కర్ణాటక రాష్ట్రం చూపుతున్న చొరవ, వాటి ప్రగతిపై పారిశ్రామిక దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

Published : 25 May 2022 05:07 IST

రాజకీయ, పాలన వ్యవహారాలపై ఆరా

పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో చర్చిస్తున్న ముఖ్యమంత్రి

ఈనాడు, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సాంకేతిక ఆవిష్కారాలను అందిపుచ్చుకోవటంలో కర్ణాటక రాష్ట్రం చూపుతున్న చొరవ, వాటి ప్రగతిపై పారిశ్రామిక దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కేవలం పెట్టుబడులను పెట్టి సరిపెట్టుకోకుండా, వాటికి రాష్ట్రం అందించే సహకారం, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలపై సమగ్రంగా విశ్లేషించారు. మంగళవారం దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి పరిశ్రమలు, ఐటీ- బీటీ శాఖ మంత్రులతో కలిసి రాష్ట్రం అందించే ప్రోత్సాహకాలను సవివరంగా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ‘ప్రపంచ నిర్మాణం కోసం రాష్ట్రం’ పేరిట ఇన్వెస్ట్‌ కర్ణాటక పెవిలియన్‌లో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఎంతో ఆసక్తిగా కనిపించారు. చేతికి అందిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకునే దిశగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

రాజకీయాలపై మిట్టల్‌ ఆసక్తి

ప్రపంచ ఉక్కు తయారీ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌ అధినేత లక్ష్మీ మిట్టల్‌ రాష్ట్ర పెవిలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడులకంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్ర విధానసభలో భాజపా సంఖ్యాబలం ఎంతంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుత అధికార పక్షం సంఖ్యాబలం తెలుసుకున్నారు. బయట నుంచి వచ్చిన 15మంది సభ్యుల వివరాలను బొమ్మై వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు స్థిరమైన రాజకీయ వాతావరణం ఎంతో కీలకం. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఎప్పుడూ నిలకడైన ప్రభుత్వాలను కోరుకుంటాయని లక్ష్మీ మిట్టల్‌ అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వం రానుందన్న భరోసాను ముఖ్యమంత్రి కల్పించారు.

సందేశం ఘనం

పెట్టుబడిదారులను ఆకట్టుకునే దిశగా రాష్ట్ర పెవిలియన్‌ నుంచి స్పష్టమైన పారిశ్రామిక సందేశాలను ఏలికలు ప్రకటించారు. కర్ణాటక ప్రస్తావన లేకుండా దేశ ఐటీ రంగం నివేదిక రూపొందించలేరు. ఐటీతో పాటు హెచ్‌ఏఎల్‌, డీఆర్‌డీఓ, ఎన్‌ఏఎల్‌, ఇస్రో వంటి సంస్థలున్న రాష్ట్రం అంతర్జాతీయ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగలదు. ప్రతి బడ్జెట్‌లోనూ పారిశ్రామిక రంగానికి ఇచ్చే ప్రాధాన్యం, ఐటీ- బీటీ, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, అంకుర సంస్థల సమస్యలకు స్థానికంగానే పరిష్కారాలు, భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50శాతం రాష్ట్రానికి వస్తున్నాయన్న సందేశాన్ని ముఖ్యమంత్రి బొమ్మై, భారీ పరిశ్రమల మంత్రి మురుగేశ్‌ నిరాణి, ఐటీ- బీటీ మంత్రి అశ్వత్థనారాయణ బృందం స్పష్టం ప్రచారం చేస్తోంది.

అదాని వేదిక..

దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఇటీవల భారీ లక్ష్యాలను ప్రకటించిన అదానీ గ్రూప్‌ అధ్యక్షుడు గౌతమ్‌ అదానీ మంగళవారం కర్ణాటక పెవిలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం అందించే రాయితీలను రంగాల వారీగా సేకరించారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకాల ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి, బియాండ్‌ ద బెంగళూరు పథకాల వివరాలను సేకరించారు. ఈ రెండు పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు.

జార్జ్‌ ఒలివర్‌కు జ్ఞాపిక అందిస్తున్న ముఖ్యమంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని