logo

పాలనాసౌధంలో మహిళా సాధికారత!

కన్నడిగుల పాలనా కేంద్రం.. విధానసౌధలో అత్యంత కీలకమైన పదవులను మహిళలే అలంకరించటం రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టం. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వందితా శర్మ.. ఆ బాధ్యతలు చేపట్టిన నాలుగో మహిళగా గుర్తింపు పొందారు.

Published : 29 May 2022 03:27 IST

మూడు కీలక హోదాల్లోనూ వారే

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : కన్నడిగుల పాలనా కేంద్రం.. విధానసౌధలో అత్యంత కీలకమైన పదవులను మహిళలే అలంకరించటం రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టం. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వందితా శర్మ.. ఆ బాధ్యతలు చేపట్టిన నాలుగో మహిళగా గుర్తింపు పొందారు. ఇదే సౌధలో విధానసభ, పరిషత్‌లకు కార్యదర్శులుగా పని చేస్తున్న వారూ మహిళలే కావటం గమనార్హం. విధానసభ కార్యదర్శిగా ఎం.కె.విశాలాక్షి, పరిషత్‌ కార్యదర్శిగా కె.ఆర్‌.మహాలక్ష్మి ఇప్పటికే బాధ్యతల్లో మమేకమయ్యారు.

గతంలో ఇద్దరు..

గతంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రత్నప్రభ పని చేస్తున్న సమయంలో పోలీసు శాఖ ఉన్నతాధికారి (డీజీపీ)గా నీలమణి రాజు పని చేశారు. ఒకే సేవా కాలంలో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నత పదవులు అలంకరించగా.. తాజాగా ముగ్గురు మహిళలు ఉన్నత పదవుల్లో ఉండటం విశేషం.

సవాళ్లమయం..

విధానసభ కార్యదర్శిగా ఎం.కె.విశాలాక్షి నియమితులైన క్షణంలో- కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్న ఎస్‌.మూర్తి అవినీతి ఆరోపణలతో పదవి నుంచి బహిష్కృతులయ్యారు. ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఎం.కె.విశాలాక్షి.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల మారథాన్‌ రాజీనామాలు, పార్టీ ఫిరాయింపులు, భాజపా సర్కారు ఏర్పాటు వంటి ఉత్కంఠ పరిణామాలను చాకచక్యంగా నిర్వర్తించారు. మరోవైపు పరిషత్‌లోనూ కార్యదర్శిగా ఉన్న కె.ఆర్‌.మహాలక్ష్మికి కూడా ఆ సభ కార్యకలాపాలు సవాళ్లను విసిరాయి. 2021 డిసెంబరులో సమావేశమైన విధానసభ కార్యకలాపాల్లో పరిషత్‌ ఉపసభాపతి ఎస్‌ఎల్‌.ధర్మేగౌడను ఆసనం నుంచి తొలగించిన సంఘటన జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. ఆ సందర్భంగా ఉత్తర్వులు, సభా వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను కార్యదర్శి కె.ఆర్‌.మహాలక్ష్మి చక్కగా నిర్వహించారు.

ఎన్నికలకు సారథులు

2023 ఎన్నికలకు ఈ ముగ్గురు మహిళా అధికారులే సారథులు కానున్నారు. మరో ఏడాదిలో నిర్వహించే ఎన్నికల కోసం మంత్రివర్గమంతా రాజకీయాల వైపు దృష్టి సారిస్తుంది. చివరకు ముఖ్యమంత్రి కూడా పార్టీ, ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి యావత్తు పాలన భారాన్ని నిభాయించాలి. ఎన్నికల తర్వాతి కార్యకలాపాల్లో ఉభయ సభల కార్యదర్శులు పాత్ర కీలకంగా మారనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని