logo

ఆత్మగౌరవ శిఖరం.. నందమూరి

అమ్మ భాషను గౌరవిస్తూ అన్ని భాషాలూ నేర్చుకోవాలని ప్రముఖ సినీనటి పద్మశ్రీ షావుకారు జానకి పిలుపునిచ్చారు. భాషా విద్వేషాలు పనికి రావని హితవు పలికారు. జాతీయ భాష అంటూ హిందీని బలవంతంగా రుద్దడం మంచిది కాదన్నారు.

Published : 29 May 2022 03:27 IST

జ్ఞాపకాల దొంతర కదిలించిన షావుకారు జానకి

షావుకారు జానకికి ఎన్టీఆర్‌ పురస్కారం అందజేసి

సత్కరిస్తున్న మంత్రి మునిరత్న, డాక్టర్‌ రాధాకృష్ణరాజు, ఆర్‌వీ హరీష్‌,

ఉమాపతి నాయుడు, ల్లక్ష్మీరెడ్డి, నరసింహమూర్తి తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అమ్మ భాషను గౌరవిస్తూ అన్ని భాషాలూ నేర్చుకోవాలని ప్రముఖ సినీనటి పద్మశ్రీ షావుకారు జానకి పిలుపునిచ్చారు. భాషా విద్వేషాలు పనికి రావని హితవు పలికారు. జాతీయ భాష అంటూ హిందీని బలవంతంగా రుద్దడం మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా శనివారం బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి శ్రీకృష్ణదేవరాయలు కళామందిరంలో కర్ణాటక తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటక తెలుగు అకాడమీ ప్రముఖులు ఆమెకు ఎన్టీఆర్‌ పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. జానకీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు దర్పణం నందమూరి వారేనని శ్లాఘించారు. తన మొదటి సినిమా ‘షావుకారు’లో ఆయనతో కలిసి కథానాయికగా నటించానని గుర్తు చేసుకున్నారు. అభినయం, క్రమశిక్షణ, పట్టుదల ఆయనలో మెండుగా ఉండడమే విజయానికి కారణంగా వివరించారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాకనే ఆంధ్రప్రదేశ్‌ స్థితి, గతులు మారిపోయాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చారని కీర్తించారు. సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి సంచలనం సృష్టించినట్లే.. రాజకీయాల్లోనూ ప్రభంజనం సృష్టించారని ప్రస్తుతించారు. కర్ణాటక ఉద్యానవనాల శాఖ మంత్రి మునిరత్న మాట్లాడుతూ నందమూరికి ఏనాడో భారతరత్న పురస్కారం దక్కాల్సిందని, భవిష్యత్తులో ఆ కీర్తి దక్కుతుందనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఇప్పటి నుంచి ఈ-మెయిళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజలు విన్నపాలు పంపించాలని పిలుపునిచ్చారు. ఏడాది పాటు నందమూరి శత జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మీరెడ్డి, కర్ణాటక తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.నరసింహమూర్తి, అధ్యక్షుడు ఆర్‌వీ హరీష్‌, కార్యాధ్యక్షుడు ఉమాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని