logo

చింతన శిబిరాలతో ప్రజలకు చేరువ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని కాంగ్రెస్‌ పెద్దలు కార్యకర్తలకు హితవు పలికారు.

Published : 24 Jun 2022 01:56 IST

మైసూరులో నవ సంకల్ప చింతన శిబిరాన్ని ప్రారంభిస్తున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు

మైసూరు, న్యూస్‌టుడే : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని కాంగ్రెస్‌ పెద్దలు కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా గురువారం మైసూరులో నవ సంకల్ప శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో మైసూరు ప్రాంతానికి చెందిన అనేకమంది నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ గిరిజన మహిళను ఎంపిక చేశామని భాజపా గొప్పలు చెప్పుకొంటోందని ఎద్దేవా చేశారు. ఆమె ఎప్పుడో గవర్నరుగా విధులను నిర్వర్తించి ప్రతిభను చాటుకున్న విషయాన్ని విస్మరించినట్లున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి స్థానంలో కీలుబొమ్మగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆమెను ఎంపిక చేశారన్నారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతగా మహిళను నియమించాలని సవాల్‌ విసిరారు. ఈ తరహా శిబిరాల్ని అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ కార్యాధ్యక్షుడు ధృవనారాయణ, మాజీ మంత్రి హెచ్‌.సి.మహదేవప్ప తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన
బెంగళూరు (యశ్వంతపుర): కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలులోకి తేనున్న అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ఎలాంటి ముందస్తు అంచనాలూ లేకుండా అగ్నిపథ్‌ అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని విధానసభ నియోజకవర్గాల్లో ఆ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తారని ఆయన హామీనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని