logo

ఎవరిని మొప్పించడానికో డంబాచారం?

‘రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అప్పుడప్పుడు వచ్చి వెళ్లాలా?’ అని నగరాభివృద్ధి (బీడీఏ) అధికారులను హైకోర్టు ధర్మాసనం గట్టిగానే ప్రశ్నించింది.

Published : 25 Jun 2022 00:55 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ‘రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అప్పుడప్పుడు వచ్చి వెళ్లాలా?’ అని నగరాభివృద్ధి (బీడీఏ) అధికారులను హైకోర్టు ధర్మాసనం గట్టిగానే ప్రశ్నించింది. సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య లేఅవుట్లో ఇప్పటికీ కొన్ని ఇళ్లకు తాగునీరు, రహదారి, భూగర్భ మురుగునీటి వ్యవస్థ సదుపాయాలను కల్పించడంలో విఫలమైన అధికారుల తీరును న్యాయస్థానం తూర్పారబట్టింది. కోర్టు గతంలో ఆదేశాలిచ్చినా ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలను కల్పించలేదని ఆరోపిస్తూ మంజుళ, శారదమ్మ అనే మహిళలు ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ బి.వీరప్ప కోర్టు ధిక్కరణ చర్యగా భావిస్తున్నామని చెప్పారు. ‘ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వం రూ.23 కోట్లు ఖర్చు చేసింది. సదుపాయాలు లేని చోటుకు వారిని ప్రతిసారీ రప్పించాలా? అలా చేస్తేనే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతారా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో వారికి సదుపాయాలు కల్పించి, నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీడీఏ అధికారులను జస్టిస్‌ వీరప్ప హెచ్చరించారు.

డాక్టర్‌ అంబేడ్కర్‌ కళాశాల వద్ద దెబ్బతిన్న రహదారి ప్రాంతాన్ని  ఆగమేఘాలపై బాగుచేసే పనులు షురూ

యంత్రాంగం పరుగులు..
బెంగళూరు (యశ్వంతపుర): నరేంద్రమోదీ బెంగళూరు నగర పర్యటన సందర్భంగా విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అభివృద్ధి చేసిన రహదారిపై నివేదిక కోసం పీఎంఓ ఆదేశించడంతో బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. జ్ఞానభారతి ఆవరణలో డాక్టర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకానమిక్స్‌ సంస్థను ప్రధాన మంత్రి ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు న్యాయ కళాశాల రహదారిని రూ.ఆరు కోట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆయన పర్యటన ముగించుకుని వెళ్లిన మూడో రోజులకే అక్కడ తారు లేచి.. గోతులు తేలాయి. గుంత పడిన ప్రాంతంలో ఇంకెప్పటికీ ఇబ్బంది ఎదురుకాకూడదన్నట్లు.. అక్కడ పూర్తిగా గోతిలా తవ్వి.. గట్టి మిశ్రమాన్ని వేసి.. సరిచేసే పనులు మొదలుపెట్టారు. ఆ ప్రదేశాన్ని తవ్వి..దిగువన గొట్టపు మార్గం కారణంగా సమస్య ఎదురుకాకుండా పూర్తిగా సరిచేశారు. నిజానికి అక్కడ ఇదివరకే ఉన్న గుంతను సరిగా పూడ్చకుండా.. మట్టి పోసి.. తారు పూసి మమ అనిపించడంతో దాని బండారం బద్దలై.. జనం నోళ్లలో నానింది. అది చివరికి పీఎంఓ చెవిన పడింది. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు.
* గోతుల వ్యవహారానికి బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు పాలికె ఇంజినీర్లకు చిక్కులు తప్పలేదు. రాజరాజేశ్వరీనగర కార్యనిర్వాహక ఇంజినీరు ఎం.టి.బాలాజి, సహాయక కార్యనిర్వాహక ఇంజినీరు హెచ్‌.జె.రవి, సహాయక ఇంజినీరు ఐ.కె.విశ్వాస్‌లకు చీఫ్‌ ఇంజినీరు తాఖీదులు ఇచ్చారని పాలికె చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌గిరినాథ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని పర్యటన సందర్భంగా రహదారుల మరమ్మతులకు రూ.23 కోట్లు వ్యయం చేశామని అంగీకరించారు. జ్ఞానభారతి ప్రాంగణంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకానమిక్స్‌(బేస్‌)కు వెళ్లే రహదారిపై ప్రస్తుతం గుంతలు పడినట్లు ఒప్పుకొంటూ.. ఈ మొత్తం వ్యవహారాలపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

స్తంభాలు నాటిన రెండు రోజుల్లోనే వాలుతున్నాయి

చీకటి దారులు
మైసూరు, న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా చీకటి ఉండరాదనే ఉద్దేశంతో చాముండి కొండల మార్గంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లకు గ్రహణం పట్టింది. ప్రధాని పర్యటన పూర్తయిన వారం రోజుల్లోపే ఇవి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. కొండ దిగువన ఉన్న తావరకట్టె నుంచి ఆలయం వరకు దాదాపు 150 విద్యుత్తు స్తంభాల్ని ఏర్పాటు చేసి ఆగమేఘాలపై విద్యుత్తు లైన్లు లాగారు. వాటికి ఎల్‌ఈడీ బల్బుల్ని అమర్చారు. విద్యుత్తు స్తంభాల్ని అమర్చేందుకు గోతుల్ని తవ్వకుండా కేవలం ఆగర్‌తో రంధ్రం చేసి వాటిల్లో నిలిపారు. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోవడంతో అప్పుడే అవి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర పనులు తాత్కాలికంగా మారాయంటూ విమర్శలు వెల్లువెత్తడంతో వీటికే మరమ్మతులు చేసేందుకు అధికారులు నడుం బిగించారు. కొండలకు చేరుకునే భక్తులకు చీకటిగా ఉండరాదనే ఉద్దేశంతోనే వీధి లైట్లను ఏర్పాటు చేశామని వివరణ ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని