logo

అంతుచిక్కని హస్తిన నాడి

కేవలం వారం వ్యవధిలో దిల్లీకి రెండుసార్లు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. పర్యటనల రహస్యం గుట్టు విప్పలేదు.

Published : 25 Jun 2022 00:55 IST

బెంగళూరు విమానాశ్రయ సమీపాన నిర్మాణంలోని కెంపేగౌడ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం పరిశీలిస్తున్న

ముఖ్యమంత్రి బొమ్మై, మంత్రి అశ్వత్థనారాయణ

ఈనాడు, బెంగళూరు : కేవలం వారం వ్యవధిలో దిల్లీకి రెండుసార్లు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. పర్యటనల రహస్యం గుట్టు విప్పలేదు. శుక్రవారం.. అధికారికంగా ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ ప్రక్రియకు సాక్షి సంతకం చేసిన ముఖ్యమంత్రి వెనువెంటనే బెంగళూరుకు పయనమయ్యారు. రెండు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి పాల్గొన్న ఏకైక అధికారిక కార్యక్రమం ఇదే కావటం గమనార్హం.
* ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారిక పర్యటన పట్టిక ప్రకారం బసవరాజ బొమ్మై గురు, శుక్రవారాల్లో పలువురు మంత్రులతో సమావేశం కావాలి. అధికారికంగా ఏ మంత్రితోనూ భేటీ అయినట్లు సీఎంఓ వెల్లడించలేదు. గురువారం రాత్రి కర్ణాటక భవన్‌లో బస చేసిన ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి భగవంత ఖూబా, ఎంపీ శివకుమార్‌ ఉదాసిలతో పాటు మంత్రి బి.శ్రీరాములు, ఎమ్మెల్యే రాజుగౌడ మాత్రమే ఉన్నారు. ఎన్‌డీఏ కూటమిలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో సందడిగా కనిపించిన ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్తావనలు లేవని సంకేతాలిచ్చారు.
పెరిగిన భరోసా
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ బసవరాజ బొమ్మై కుర్చీ ఊగిసలాడుతూనే ఉంది. నాలుగు నెలలుగా ఆయన నాయకత్వంపై విమర్శలు గుప్పించే నేతలు క్రమంగా కనుమరుగవుతున్నారు. గతేడాది డిసెంబరు నాటి ఎమ్మెల్యే ఎన్నికలు, తాజా ఎమ్మెల్సీ బరిలో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేకపోవటంతో ముఖ్యమంత్రి స్థానంపై విమర్శలు గుప్పుమన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో అధిష్ఠానం అంచనాను కూడా తలకిందులు చేస్తూ మూడో అభ్యర్థిని గెలిపించుకోవటంతో బొమ్మై పట్ల విశ్వాసం రెట్టింపైంది.
* ఇటీవలి ప్రధాని రాష్ట్ర పర్యటనలో ముఖ్యమంత్రి మరిన్ని మార్కులు కొట్టేసినట్లే. కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయటంలో రాష్ట్రం భేషుగ్గా పని చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇచ్చిన కితాబు బొమ్మైకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. పైగా ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలల సమయమే ఉండటంతో మరింత వేగంగా అభివృద్ధి సాధించాలన్న ప్రధాని సూచన బొమ్మై నాయకత్వంపై విశ్వాసాన్ని పెంచినట్లే. గత వారం రాష్ట్రానికి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బొమ్మై నాయకత్వాన్ని ప్రశంసించటం కూడా బొమ్మైకు కలిసొచ్చే అంశమే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యహారాలను అధిష్ఠానానికి చేరవేస్తూ తన పట్టు బిగిస్తున్న ముఖ్యమంత్రి నాయకత్వంపై అడపాదడపా మాట్లాడే బసవనగౌడ యత్నాళ్‌, రేణుకాచార్య దాదాపు శాంతించారు. మంత్రివర్గ విస్తరణను పదే పదే వాయిదా వేస్తున్నా నోరు మెదపని ఆశావహులను చూస్తుంటే.. బొమ్మై నాయకత్వానికి సమీప భవిష్యత్తులో ఢోకా లేనట్లేనని రాజకీయ పండితుల మదింపు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని