logo

మాదకద్రవ్యాల ముఠాకు కటకటాలు

మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న కాలిఫా అబ్దులిహి, డేనియల్‌ అనే నైజీరియన్లను బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Published : 25 Jun 2022 00:55 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న కాలిఫా అబ్దులిహి, డేనియల్‌ అనే నైజీరియన్లను బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చదువుకునేందుకు ఐదేళ్ల కాలపరిమితి ఉండే వీసాతో వీరు బెంగళూరుకు వచ్చారు. వీసా కాలపరిమితి పూర్తయినా అక్రమంగా ఇక్కడే ఉంటూ, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. వీరి నుంచి ఎండీఎంఏ మాత్రలు, ఎల్‌ఎస్‌డీ చీటీలు స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువను రూ.8 లక్షలుగా అంచనా వేశారు. ఒక గ్రాము ఎండీఎంఏ మాత్రను వీరు రూ.5 వేలకు విక్రయించేవారు. కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను బాణసవాడి పోలీసులకు అప్పగించారు.

అదుపులో.. డీజే
బెంగళూరు (సదాశివనగర) : మాదక ద్రవ్యాలను తరలించి, విక్రయిస్తున్న జెపిన్‌ జడే హ్యారీ అనే డిస్కో జాకీ (డీజే)ని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. డార్క్‌వెబ్‌ ద్వారా నగరానికి మాదక ద్రవ్యాలు తెప్పించుకునేవాడు. నిందితుడి నుంచి 15.08 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు, 0.48 గ్రాముల ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్‌లు, ఒక కిలో గంజాయి, ఒక ల్యాప్‌టాప్‌, ఒక చరవాణి స్వాధీనపరుచుకున్నామని జాయింటు పోలీసు కమిషనర్‌ రమణగుప్త తెలిపారు. వీటి విలువను రూ.6.5 లక్షలుగా అంచనా వేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను వివేకనగర పోలీసులకు అప్పగించారు.
నాశనం చేస్తే పోలా..
బెంగళూరు (శివాజీనగర): అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.25.6 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను నాశనం చేసేందుకు న్యాయస్థానం నుంచి నగర పోలీసులు అనుమతి పొందారు. ఆదివారం 21 టన్నుల మాదక ద్రవ్యాలను నాశనం చేయనున్నారు. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిందితుల నుంచి స్వాధీనపరుచుకున్న గంజాయి, నల్లమందు, కొకైన్‌, సింథటిక్‌ డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్‌ 26న రూ.50.23 కోట్ల విలువైన 24 టన్నుల మాదక ద్రవ్యాలను పోలీసులు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు నెలల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి 8,5,05 కేసులు నమోదు చేసి 7,846 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 185 మంది విదేశీయులు ఉన్నారు. ఈ కేసుల్లో 5,363 కేసుల దర్యాప్తు పూర్తి చేసి, న్యాయస్థానాలకు అభియోగపత్రాలను దాఖలు చేశామని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని