logo

మాయా(వి)వలలో విలవిల

డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన అపరిచితురాలి మాటల్ని నమ్మి హరిశంకర్‌ అనే వ్యక్తి రూ.5.81 కోట్లు పోగొట్టుకున్నాడు.

Updated : 25 Jun 2022 05:30 IST

రూ.5.81 కోట్లు హుష్‌కాకి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన అపరిచితురాలి మాటల్ని నమ్మి హరిశంకర్‌ అనే వ్యక్తి రూ.5.81 కోట్లు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు హనుమంతనగరలోని ఇండియన్‌ బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్న హరిశంకర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. నాలుగు నెలల కిందట ఓ డేటింగ్‌ యాప్‌ను తన నాజూకు చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకుని, పేరు నమోదు చేసుకున్నాడు. ఈ యాప్‌లో పరిచయమైన యువతితో స్నేహాన్ని పెంచుకున్నాడు. ఇద్దరూ వీడియో కాల్స్‌ చేసుకొంటూ ప్రేమ సందేశాలు పంపుకొన్నారు. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని ఆమె ఇచ్చిన ఆఫర్‌తో మొదట తన వద్ద ఉన్న రూ.12 లక్షలు బదిలీ చేశాడు. మరింత ఎక్కువ నగదు కావాలని చెప్పడంతో తమ బ్యాంకులో పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసిన అనిత అనే సీనియరు సిటిజన్‌ ఖాతాపై రూ.6 కోట్లు రుణాన్ని తన పేరిట తీసుకుని, తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు.
అందులో నుంచి రూ.5.69 కోట్లను తన ప్రియురాలికి దశలవారీగా బదిలీ చేశాడు. రుణానికి సంబంధించి అనిత చరవాణికి సందేశాలు వెళ్లడంతో ఆమె బ్యాంకుకు వచ్చి విచారించారు. అసలు విషయం అక్కడే బయటపడింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో హరిశంకర్‌ను అరెస్టు చేశారు. డేటింగ్‌ యాప్‌లో పరిచయం అయిన యువతి కూడా ఇప్పుడు ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసుకుంది. బ్యాంకులో రుణం తీసుకునేందుకు అక్కడే పని చేస్తున్న మునిరాజు అనే క్లర్క్‌ సహకరించాడని గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని