logo

సమాజాన్ని బతికిస్తున్న శ్మశాన కార్మికులు

చేస్తున్న పనిని దైవంగా భావించే శ్మశాన కార్మికులు నేడు సమాజాన్ని బతికిస్తున్నారని అఖిల భారత దళిత శోషణ్‌ ముక్తిమంచ్‌ ఉపాధ్యక్షుడు (దిల్లీ), సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పేర్కొన్నారు.

Published : 25 Jun 2022 00:55 IST

కార్యక్రమంలో మాట్లాడుతున్న బి.వి.రాఘవులు పాల్గొన్న కార్మికులు

హొసపేటె, న్యూస్‌టుడే: చేస్తున్న పనిని దైవంగా భావించే శ్మశాన కార్మికులు నేడు సమాజాన్ని బతికిస్తున్నారని అఖిల భారత దళిత శోషణ్‌ ముక్తిమంచ్‌ ఉపాధ్యక్షుడు (దిల్లీ), సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర శ్మశాన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హొసపేటె పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన శ్మశాన కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులు, కార్మికులనగానే సమాజం, ప్రభుత్వాలు కూడా చిన్నచూపు చూస్తున్నాయి.  ఇప్పటి వరకు శ్మశాన కార్మికులను ప్రభుత్వాలు మనుషులుగా కూడా పరిగణనలోకి తీసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఏ కులంవారు వచ్చినా వెనకాముందు చూడకుండా అంతిమ సంస్కారాలు చేస్తున్నవారిపై ప్రభుత్వాలెందుకు వివక్ష ధోరణి ప్రదర్శిస్తున్నాయని నిలదీశారు. స్థానిక సంస్థల్లోని పౌర కార్మికులకు కూడా నెలకు రూ.13,500 జీతం ఇస్తున్నారు. శ్మశాన కార్మికులకు దహన సంస్కార అనంతరం వచ్చిన ఇనాముతోనే జీవితం సాగిస్తున్నారు. ఈ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓ చట్టాన్ని తీసుకురావాలి. వారి పిల్లల చదువులు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆ వర్గం విద్యార్థులకు ప్రత్యేక వసతి నిలయాలు, వసతి పాఠశాలలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. మీకు న్యాయం చేకూరే వరకు పోరాటం నుంచి విశ్రమించకండని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి యు.బసవరాజ్‌, సంఘం రాష్ట్ర సహసంచాలకురాలు బి.మాళమ్మ, దళిత హక్కుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు గోపాలకృష్ణ హరళహళ్లి, ప్రముఖులు ఆర్‌.ఎస్‌.బసవరాజ్‌, భాస్కర్‌ రెడ్డి, జంబయ్య నాయక, కె.నాగరత్నమ్మ, వి.స్వామి పాల్గొన్నారు.
అగ్నిపథ్‌పై పునరాలోచించండి
హొసపేటె: సైన్యంలో సేవలను కుదించే అగ్నిపథ్‌ పథకం అమలుపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హొసపేటెలో విలేకరులతో మాట్లాడారు. నిపుణులు, మాజీ సైనికాధికారులు, విపక్షాల అభిప్రాయాలను కూడా అడగకుండా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని అమలులోకి తీసుకురావడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ముమ్మాటికీ ఇది కార్పొరేట్‌ కంపెనీలకు సహాయం చేయడమేనని తేల్చిచెప్పారు. 17 ఏళ్ల తమ సేవలో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి దేశభద్రత కోసం పోరాటాలు చేస్తారు. వారి సేవా వ్యవధిని నాలుగేళ్లకు కుదిస్తే సేవలు చేయడం సాధ్యమేనా? అని నిలదీశారు. ఇది సైనికులను అవమానించే ప్రయత్నమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను 60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తారు, కాని సైనికులకు నాలుగేళ్లు మాత్రమేనా అని ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వ్యాపార కేంద్రంగా మారింది. కొనుగోలు, అమ్మకాల్లో మునిగిపోయి, ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని రాఘవులు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని