logo

ఎలక్ట్రానిక్స్‌ పరిశోధనలకు అగ్రాసనం

రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో పెంచాల్సిన అవసరంపై కేంద్ర ఐటీ- బీటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ బెంగళూరులో గుర్తు చేస్తూ.. ఆ దిశగా కన్నడనాట ప్రారంభమైన చర్యలను అభినందించారు. ఇస్రో నిర్వహించిన ‘దేశీ’ సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొని.. 2025 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికతకు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో స్వావలంబన

Published : 26 Jun 2022 04:46 IST

ఇంటెల్‌ కేంద్రం ముందు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, నివృతి రావు

ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో పెంచాల్సిన అవసరంపై కేంద్ర ఐటీ- బీటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ బెంగళూరులో గుర్తు చేస్తూ.. ఆ దిశగా కన్నడనాట ప్రారంభమైన చర్యలను అభినందించారు. ఇస్రో నిర్వహించిన ‘దేశీ’ సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొని.. 2025 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికతకు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో స్వావలంబన ఎంతో కీలకమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ స్థాయి ఆర్థికతను మరింత వేగంగా చేరుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఇంటెల్‌ సంస్థ తన వంతుగా సహకరాన్ని అందించేందుకు సిద్ధమైంది. బెంగళూరులో ప్రారంభించిన ఇంటెల్‌ ఆర్‌అండ్‌ డీ కేంద్రం రాష్ట్ర ఐటీ కీర్తిని మరింత పెంచుతుందని ఈ రంగంలో నిపుణులు లెక్కగడుతున్నారు.

దేశంలో రెండోది..

అమెరికా బయట ఇంటెల్‌ ఏర్పాటు చేసిన రెండు ఫెసిలిటీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటి. ఇప్పటికే హైదరాబాద్‌లోనూ ఇంటెల్‌ కేంద్రం ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు విస్తరించిన ఆర్‌అండ్‌డీ, నవ్యాలోచనల కేంద్రాల కోసం ఇంటెల్‌ సంస్థ ఎనిమిది బిలియన్‌ డాలర్లను వ్యయం చేసింది. అందులో 50 శాతం నిధులు బెంగళూరు కేంద్రానికి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెమీకండక్టర్‌ విధానం అమలు కోసం చేసే రూ.72 వేల కోట్ల నిధుల్లోనూ ఇంటెల్‌ కీలక లబ్ధిదారు కానుంది. సెమీకండక్టర్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇన్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో దేశీయ నవ్యాలోచనలకు ఈ సంస్థ వేదిక కల్పించనుంది. ఇక్కడి ఆర్‌అండ్‌డీ ప్రయోగశాలలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ విపణి అత్యంత సులువుగా ద్వారాలు తెరుస్తుంది. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ఇంటెల్‌ వినియోగదారులకు ఈ ఫెసిలిటీ కేంద్రం కస్టమైజ్డ్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు త్వరితగతిన ఇవ్వగలదు. 2021 వరకు ఇంటెల్‌ డిజైన్‌ చిప్‌ల కోసం నెలల తరబడి వేచి ఉండే సమయం ప్రస్తుతం వారాలకు పరిమితం కానుంది.

సాంకేతిక రంగ నాయకత్వం

ఇంటెల్‌ కొత్త కేంద్రంతో బెంగళూరు సాంకేతిక రంగ నాయకత్వం మరింత బలపడనుంది. కేంద్ర, రాష్ట్రాలు అందించే పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇంటెల్‌ వంటి మరిన్ని ప్రపంచశ్రేణి సంస్థలకు భరోసా కల్పిస్తున్నాయి. సెమీకండక్టర్‌ ఉత్పాదన కొరతను ఇంటెల్‌ ఫెసిలిటీ కేంద్రం తీర్చటమే కాదు.. ఎగుమతి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ రంగంలో అంకురాలకు కూడా ఇంటెల్‌ సంస్థలు స్ఫూర్తి నింపుతాయి.
- రాజీవ్‌ చంద్రశేఖర్‌, కేంద్ర మంత్రి


ఉత్పాదన వాతావరణం

బెంగళూరులో ఇంటెల్‌ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచుకునే వాతావరణం ఉంది. ఇక్కడి సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు, ప్రపంచ స్థాయి మార్కెట్‌ సదుపాయం, సమర్థమంతమైన డేటా సెంటర్‌ వ్యవస్థలు ఉత్పాదకతను వేగవంతం చేస్తాయి. దేశీయ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆవిష్కరణలో ఇంటెల్‌ భాగస్వామ్యం సుదీర్ఘకాలం పాటు కొనసాగనుంది.
- నివృతి రాయ్‌, ఇంటెల్‌ ఇండియా

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని