logo

ఖరీఫ్‌కు లక్ష్యం మెండు

నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం.. ముఖ్యంగా తొలి ముంగారు వానలు విస్తారంగా కురవడం తదితర పరిస్థితులు ఖరీఫ్‌ సాగుకు అనుకూల వాతావరణాన్ని మోసుకొచ్చాయి. ఫలితంగా ఖరీఫ్‌ సాగు లక్ష్యాన్ని 82.666 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇప్పటికే 16.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటల్ని సాగుచేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

Published : 27 Jun 2022 02:47 IST

82 లక్షల హెక్టార్లకు పైగా సాగు ప్రణాళిక

రాష్ట్ర వ్యాప్తంగా వడివడిగా సేద్యం పనుల జోరు

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం.. ముఖ్యంగా తొలి ముంగారు వానలు విస్తారంగా కురవడం తదితర పరిస్థితులు ఖరీఫ్‌ సాగుకు అనుకూల వాతావరణాన్ని మోసుకొచ్చాయి. ఫలితంగా ఖరీఫ్‌ సాగు లక్ష్యాన్ని 82.666 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇప్పటికే 16.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటల్ని సాగుచేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం అధికమవుతుందని చెప్పారు. విద్యుత్తు ప్రాజక్టులు మినహా ఇతర సాగునీటి ప్రాజక్టుల్లో చాలినంత నీటి నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ఈ కారణంగానే అనేక రిజర్వాయర్ల కింద వరి నారుమళ్ల తయారీలో రైతులు నిమగ్నమయ్యారు. కావేరి పరీవాహక ప్రాంతంలో ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు కృష్ణరాజసాగర జలాశయంలో క్రమేపీ నీటి నిల్వలు అధికమవుతున్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో నారాయణపుర జలాశయం పరిధిలో అనేక గ్రామాల్లో హెచ్చరికల్ని జారీ చేశారు. నది వద్దకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని చాటింపు వేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
ః ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంతో పొద్దుతిరుగుడు పంట విస్తీర్ణం పెరిగింది. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా దేశంలో వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకడంతో రైతులు ఆర్థికంగా ఆదుకుంటుందనే ఉద్దేశంతో సంప్రదాయ పంటలకు బదులుగా పొద్దుతిరుగుడు, సోయా తదితర పంటల సాగుకు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు తెలిపారు. బీదర్‌ జిల్లాలో గత ఏడాది 1.82 లక్షల హెక్టార్లలో సోయా సాగుకు చేయగా ఈ ఏడాది 2.6 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని సంకల్పించారు. కలబురగి జిల్లాలో గత ఏడాది 12 వేల హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది అది 30 వేల హెక్టార్లకు చేరుకోనుంది. మన దేశానికి అవసరమైన నూనెగింజల్లో 90 శాతం ఉక్రెయిన్‌, రష్యాల నుంచే దిగుమతి అవుతున్న నేపథ్యంలో యుద్ధం కారణంగా దిగుబడులు పూర్తిగా నిలిచిపోయాయి. కల్యాణ కర్ణాటకలో నూనెగింజల పంటల హవా కొనసాగుతోంది. రాయచూరు జిల్లాలో గతంలో పొద్దుతిరుగుడు పంట 3500 హెక్టార్లకు మించేదికాదు. ఈ ఏడాది 17 వేల హెక్టార్లకు పైగా సాగు నమోదయ్యే అవకాశాలున్నాయి. హుబ్బళ్లి, హావేరి, గదగ తదితర జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలో సాధారణంగా పొద్దుతిరుగుడు పంటలను 73,300 హెక్టార్లలో సాగు చేసేవారు. దీన్ని ఈ ఏడాది 96,953 హెక్టార్లకు పెంచారు. ఇతర నూనె గింజల పంటలు కూడా ఇదే దామాషాలో పెరిగాయి.

ఆదుకుంటున్న బొప్పాయి
ఇటీవలి కాలంలో రైతులను ఆదుకునే పంటగా బొప్పాయి పంట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే ఏడాదిలోపే అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటగా దీనికి గుర్తింపు లభించింది. మొన్నటి వరకు థైవాన్‌ రెడ్‌ రకాన్ని ఎక్కువగా సాగు చేసేవారు. ఇప్పుడనేక రకాలు తోడవడంతో కాస్తంత నీటి సదుపాయం ఉండే ప్రాంతాల్లో కూడా బిందు సేద్యం ఆధారంగా ఈ పంట సాగును చేపట్టారు. కొబ్బరి తోటతో ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పుడా తోటల్లో అంతర పంటగా వక్క మొక్కల్ని పెంచేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం నేపథ్యంలో  పొద్దుతిరుగుడు పంట  సాగుకు సానుకూల పరిస్థితులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని