logo

‘సామాజిక అసమానతల సృష్టి వారిపనే’..!

జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయవలసిన అవసరం ఉందని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య పేర్కొన్నారు. కేంద్రంలో 60 లక్షలు, కర్ణాటకలో 2.59 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కర్ణాటక జనాభాలో షెడ్యూల్డు కులాల ప్రజలు 17.1 శాతం, షెడ్యూల్డు తెగల ప్రజలు 7 శాతం ఉండగా, ఆ సామాజిక వర్గాలకు చెందిన వారికి 24.1 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు

Published : 27 Jun 2022 02:47 IST

ఉత్తర కన్నడ జిల్లా యల్లపుర ఆదివాసీ మహిళలు తమ సంప్రదాయ వేషాలను ధరించి  

ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, మాజీ న్యాయమూర్తి నాగమోహన్‌దాస్‌లకు స్వాగతం పలికారు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయవలసిన అవసరం ఉందని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య పేర్కొన్నారు. కేంద్రంలో 60 లక్షలు, కర్ణాటకలో 2.59 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కర్ణాటక జనాభాలో షెడ్యూల్డు కులాల ప్రజలు 17.1 శాతం, షెడ్యూల్డు తెగల ప్రజలు 7 శాతం ఉండగా, ఆ సామాజిక వర్గాలకు చెందిన వారికి 24.1 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నాగమోహనదాస్‌ రచించిన ‘రిజర్వేషన్లు- భ్రమలు, వాస్తవం’ పుస్తకాన్ని రవీంద్ర కళాక్షేత్రలో ఆదివారం విడుదల చేసి మాట్లాడారు. న్యాయమూర్తిగా రాజ్యాంగాన్ని అవగతం చేసుకుని, చక్కని పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న జస్టిస్‌ నాగమోహనదాస్‌ ఇటీవల రచించిన ‘రాజ్యాంగాన్ని చదువు’ పుస్తకాన్ని తాను చదివానని తెలిపారు. దాన్ని ఒక పుస్తకంలా కాకుండా, ఒక జాగృతిలా ప్రతి ఒక్కరూ చదివేలా విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ వెనుకబడిన వర్గాల్లో పలువురు తమను తాము బానిసలుగా భావించుకుంటూ, మనోవ్యధకు గురవుతున్నారని ఆక్రోశించారు. వంట చేసే ఒక బ్రాహ్మణునికి ఉన్న గౌరవం విద్యావంతుడైన దళితునికి ఎవరూ ఇవ్వడం లేదని ఆక్రోశించారు. ఒకరిని ‘నమస్కారం స్వామీ’ అని పిలుస్తూ, ఇతర వర్గాలకు చెందిన వారిని ఏకవచనంతో మాట్లాడిస్తారని ఆక్రోశించారు. రిజర్వేషన్లను అమలు చేసే అంశంలో ఇటీవలి కాలంలో పలు ప్రశ్నలు వస్తున్నాయని చెప్పారు. రిజర్వేషన్లు ఎలా మొదలయ్యాయి, దాని ఉద్దేశం, అనివార్యత తదితర అంశాలపై ప్రజా జాగృతి అత్యవసరమని అన్నారు. దీనికి సరైన సమాధానం ఇస్తున్నప్పటికీ, రిజర్వేషన్లను రద్దు చేయాలని పలువురు శ్రీమంతులు, అగ్రవర్ణాలకు చెందిన వారు వాదిస్తున్నారని ఆక్రోశించారు. కుల వ్యవస్థను కాపాడుకుంటూ వస్తూ, రాజకీయ, ఆర్థిక అసమానతలను సృష్టిస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. బహుసంఖ్యాతులు, ఉత్పత్తి కులాలను అణగదొక్కే ప్రయత్నాలను అడ్డుకోవాలని విద్యావేత్తలకు సూచించారు. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తున్న వారు లింగాయత, బౌద్ధం తదితరాలను అనుసరిస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో నాల్వడి కృష్ణరాజ ఒడెయరు 1918లో మిల్లర్‌ సమితిని ఏర్పాటు చేసి, నివేదిక వచ్చిన తర్వాత 1921లో రిజర్వేషన్లను జారీలోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు. కేవలం రాజకీయ స్వాతంత్య్రం ఉంటే చాలదని, సంపద, అధికారాన్ని పంచుకోవడంలోనూ సమానత్వం అవసరం అని అంబేడ్కర్‌ 1949 నవంబరు 26న తన ప్రసంగంలో పేర్కొన్నారని తెలిపారు. రిజర్వేషన్‌ వర్గీకరణకు సంబంధించి 2004లో ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన ఆదేశాలను, సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసిందని తెలిపారు. రిజర్వేషన్లు అనేవి భిక్ష కాదని, అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని