logo

రాజధానికి సింగపూర్ సొబగులు!

విధానసౌధ ఆవరణలో నాడప్రభు కెంపేగౌడ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కెంపేగౌడ జయంతిని పురస్కరించుకుని విధానసౌధ బాంక్వెట్ హాల్‌లో ‘కెంపేగౌడ అంతర్జాతీయ పురస్కారాల’

Published : 28 Jun 2022 01:02 IST

సంబరం: ఎస్‌.ఎం.కృష్ణ, సుధానారాయణమూర్తి ప్రకాశ్‌ పదుకొణె విమల్‌కుమార్‌కు కెంపేగౌడ పురస్కారాల ప్రదానం

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : విధానసౌధ ఆవరణలో నాడప్రభు కెంపేగౌడ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కెంపేగౌడ జయంతిని పురస్కరించుకుని విధానసౌధ బాంక్వెట్ హాల్‌లో ‘కెంపేగౌడ అంతర్జాతీయ పురస్కారాల’ను సోమవారం ప్రదానం చేసి మాట్లాడారు. బెంగళూరు నగర నిర్మాత విగ్రహాన్ని ఇప్పటి వరకు విధానసౌధ ఆవరణలో ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు. వచ్చే జయంతి నాటికి ఆ పని పూర్తి చేస్తామని ప్రకటించారు. శతాబ్దాల కిందటే రాజులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లేవారని- కెంపేగౌడ మాత్రం బెంగళూరుకు కావలసిన సదుపాయాలన్నీ కల్పించడానికే శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. ఆయన పాలన సువర్ణయుగమని, ప్రజలే ఆయన్ను నాడప్రభు అని పిలుచుకునే వారని వివరించారు. పాలించడానికి, పాలనకు తేడా చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బెంగళూరుకు ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత పాలకులదేనని పేర్కొన్నారు. రానున్న 40 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని, మౌలిక సదుపాయాల వృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వివరించారు. ఇప్పటి ఉద్యాననగరిలో 400కు పైగా ప్రపంచ స్థాయి పరిశోధన కంపెనీలు, 400 ఫార్చ్యూన్‌ కంపెనీలు ఉండగా, దేశానికి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో 43 శాతం కర్ణాటకకే చెందినట్లు గుర్తు చేశారు. ఎస్‌.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలతోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా బెంగళూరు నిలిచిందని ప్రశంసించారు. బెంగళూరును సింగపూర్‌గా మార్చేందుకు ప్రజల సహకారమూ అవసరమన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎతైన కెంపేగౌడ విగ్రహాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

వక్కలిగర సంఘలో ప్రదర్శించిన కెంపేగౌడ విజయచరిత్రపై ఆకట్టుకున్న నృత్యరూపకం

అధ్యయన పీఠం..

బెంగళూరు విశ్వవిద్యాలయం ఆవరణలో కెంపేగౌడ అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ తెలిపారు. రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న పీఠానికి ఇప్పటికే రూ.50 కోట్లు విడుదల చేశామన్నారు. ఒక్కలిగ అభివృద్ధికి రూ.150 కోట్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కెంపేగౌడ స్వాతంత్య్ర యోధుడని మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మైసూరు, కలబురగి, ధార్వాడ, శివమొగ్గ తదితర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బగా కెంపేగౌడ పురస్కారం కింద తనకు ఇచ్చిన రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని రామకృష్ణ ఆశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి బదులుగా ఆయన భార్య సుధామూర్తి పురస్కారాన్ని అందుకున్నారు. నగరంలో వాహన రద్దీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. బ్యాడ్మింటన్‌ ఆటగాడు ప్రకాశ్‌ పదుకొణె తరపున విమల్‌కుమార్‌ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ మఠాల ప్రతినిధులు నిర్మలానందనాథ స్వామి, నంజావధూత స్వామి, చంద్రశేఖర స్వామి, మంత్రులు అశోక్‌, గోపాలయ్య, సునీల్‌ కుమార్‌, మునిరత్న, లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఒకేతాటిపైకి..

కెంపేగౌడ జయంతి సందర్భంగా అన్ని పార్టీల నేతలూ ఏకతాటిపైకి వచ్చారు. బెంగళూరులో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఆధ్యాత్మిక గురువులు నిర్మలానందనాథ స్వామి, నంజావధూత స్వామి, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సదానందగౌడ, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తదితరులు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని