logo
Published : 28 Jun 2022 01:02 IST

పుత్తడిబొమ్మపై రాక్షసత్వం

చిత్రదుర్గం: ముక్కుపచ్చలారని వయస్సు. పుత్తడిబొమ్మను తలపించే ఆమె (17)ను ఓ యువకుడి (25)కిచ్చి పెళ్లిచేస్తే.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై వికృత లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆమెపై ఆ నలుగురూ ప్రదర్శించిన రాక్షసత్వం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. కట్టుకున్నోడు చేసిన మానని గాయానికి కుమిలిపోతూ ఆమె ప్రస్తుతం చిత్రదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ మహిళా పోలీస్‌ ఠాణా అధికారులు సోమవారం అందించిన సమాచారం ప్రకారం.. ఆ యువకుడు- బాలికకు ఇటీవలే పెద్దలు వివాహం చేశారు. ఆ బాల్య వివాహాన్ని ఎవరూ అడ్డుకోలేని నేపథ్యంలో ఆమె మెట్టినింట అడుగు పెట్టింది. దుష్టబుద్ధితో కదులుతున్న భర్త తీరును ఆమె గుర్తించలేక పోయింది. ఈనెల ఏడోతేదీన ఆమెను పథకం ప్రకారం.. పట్టణ శివార్లలోని మాళప్పనహట్టి రహదారి వద్దకు రప్పించాడు. అక్కడ ఏదో మాట్లాడాలంటూ సమీపంలోనే నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద భవంతి వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో ముగ్గురు వ్యక్తులున్నారు. కీడు గుర్తించేలోగా.. భర్తతో పాటు ఆ ముగ్గురూ ఆమెపై ఒక్కసారిగా దాడిచేశారు. అత్యంత పాశవికంగా సిగరెట్లతో కాల్చి.. ఒకరితరువాత ఒకరు లైంగిక దాడికి ఒడిగట్టారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ నిర్జన ప్రదేశంలో ఆమె అరుపులు అరణ్యరోదనలయ్యాయి. ప్రతిఘటించిన ఆమె తలపై బండరాయి వేసి గాయపరిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను రక్షించేవారే లేకపోయారు. ఆమెను కనీసం ఇంటికైనా చేర్చకుండా దుండుగులు తలోదిక్కు వెళ్లిపోయారు. చివరికి కొందరు ఆమె దైన్యస్థితి గుర్తించి బంధువులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రికి తరలించారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆమె ఆదివారం కొంత కుదుటపడింది. బంధువులు అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసు అధికారులు రంగంలోకి దిగి ఆమె నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు కేశారు. ఆ నలుగురిపైనా లైంగిక దాడి, హత్యాయత్నం, బాల్యవివాహ ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts