logo

అడ్డగోలు తనిఖీల ఆటకట్టు

సిల్క్‌బోర్డ్‌ రహదారి నుంచి విధులకు వెళ్తున్న ఓ ఐటీ ఉద్యోగిని నిలిపిన ట్రాఫిక్‌ పోలీసులు వాహన పత్రాలను చూపించాలని అడిగారు. అంతటితో ఆగకుండా ఆ వాహన తాళాలను కూడా తీసుకుని పత్రాల పరిశీలనకు సిద్ధమయ్యారు. తన వద్ద ఉన్న అన్ని పత్రాలు పరిశీలించిన

Published : 28 Jun 2022 01:02 IST

వాహనదారులకు ఉపశమనం

ఈనాడు, బెంగళూరు

ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపే వీలులేదు

* సిల్క్‌బోర్డ్‌ రహదారి నుంచి విధులకు వెళ్తున్న ఓ ఐటీ ఉద్యోగిని నిలిపిన ట్రాఫిక్‌ పోలీసులు వాహన పత్రాలను చూపించాలని అడిగారు. అంతటితో ఆగకుండా ఆ వాహన తాళాలను కూడా తీసుకుని పత్రాల పరిశీలనకు సిద్ధమయ్యారు. తన వద్ద ఉన్న అన్ని పత్రాలు పరిశీలించిన పోలీసులు అన్ని సరిగా ఉన్నాయని చెప్పి వెళ్లమన్నారు. ఈ తతంగానికి 30 నిమిషాలు పట్టింది. తనవద్ద సరైన దాఖలాలుండీ అనవసరంగా సమయం వృథా చేసుకున్న ఆ ఉద్యోగి సంబంధిత ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

* బాణసవాడికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వాహనాన్ని నెలలో ఆరుసార్లు నిలిపిన పోలీసులు పత్రాలను ప్రతిసారీ పరిశీలించారు. పరిశీలించిన ప్రతిసారీ ఏ ఒక్క ట్రాఫిక్‌ ఉల్లంఘనా నమోదు కాలేదు. ఆ బాధితుతు స్థానిక ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణలో పోలీసుల కర్తవ్య లోపం గుర్తించి విధుల నుంచి తొలగించారు.

* ఏడాది కిందట జాలహళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వాహనం మాటున నక్కి ఉన్న పోలీసులు ఉన్నఫళంగా హెల్మెట్‌ లేని వాహనదారుడిపై దాడి చేశారు. ఆ వాహనదారు పట్టుతప్పి పడిపోవటంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ దురాగతానికి పాల్పడిన పోలీసుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

* ఈ సంఘటనల్లో వాహనదారుల తప్పులకంటే సేవల్లో ఉన్న పోలీసుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం కనిపిస్తోంది. నిత్యం వాహనదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిగణించిన డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ తాజాగా వెల్లడించిన ఆదేశం వాహనదారులకు కచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది.

ఇక వాటి ఆటకట్టు

ఇకపై రాష్ట్రవ్యాప్తంగా దాఖలాలను పరిశీలించే నిమిత్తం పోలీసులు వాహనాలను నిలిపే వీలులేదు. వాస్తవానికి ఈ ఆదేశం 2020 డిసెంబరులోనే ప్రకటించినా ఆచరణ సాధ్యం కాలేదు. ఓ వాహనదారుడు నేరుగా డీజీపీకి ట్వీట్‌ చేస్తూ ‘వాహనాలను అడ్డుకునే ప్రక్రియకు అడ్డుకట్టవేయాలని శ్రీవాత్సవ వాజపేయి అనే వాహదారుడు మనవి చేశారు. పోలీసుల చర్యలతో విలువైన సమయం వృథా అవుతుంది’ అని వివరించారు. ఇందుకు బదులిచ్చిన డీపీజీ.. ‘వాహనదారుడు నిబంధనలు ఉల్లంఘించినట్లు కెమెరాలో గుర్తించినా, స్వయంగా పోలీసులు పసిగడితే తప్ప వాహనాన్ని నిలపటం సరికాదు. మద్యం సేవించి వాహనాన్ని నడిపిన సందర్భంలో అన్ని పత్రాలను పరిశీలించాలి. ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాల్సిందిగా ఆదేశిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

చెల్లింపులు అంతంతే

డీజీపీ తాజాగా వెల్లడించిన ఆదేశం వెనుక ఓ సౌలభ్యం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాహనానికి సంబంధించిన బకాయిలు (ప్రీమియం, ఉల్లంఘన జరిమానా) పేటీఎం ద్వారా చెల్లించే వెసులుబాటు ఉంది. వాహదారునికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా చలానా చెల్లింపు సమాచారం అందుతుంది. వీటిని సక్రమంగా చెల్లిస్తే పోలీసుల తనిఖీల నుంచి దూరంగా ఉండొచ్చు. 2021-22 ఏడాదిలో రూ.450 కోట్లకుపైగా జరిమానాలు, ప్రీమియం చెల్లింపులు బకాయి పడినట్లు బెంగళూరు ట్రాఫిక్‌ నివేదిక వెల్లడించింది.

లోపాలూ దండి

వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించటం కొత్తేమీ కాదు. బెంగళూరు వంటి మహానగరంలో 13,500 కిలోమీటర్ల పొడవైన రహదారులుండగా, 44 వేల రహదారి కూడళ్లున్నాయి. వీటిల్లో 1,200 కూడళ్లు అత్యంత రద్దీతో కిటకిటలాడుతుంటాయి. 450కుపైగా సిగ్నల్స్‌ ఉన్నా ప్రస్తుతం స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పుణ్యమా అంటూ రహదారుల మళ్లింపులు పెరిగాయి. ఈ కారణంగా నగర పోలీసులు ఇష్టానుసారం వాహనాలను నిలుపుతూ దాఖలాలను తనిఖీ చేస్తున్నారు. వాహనాలను నిలిపివేయటం వల్ల పోలీసులు, వాహనదారుల విలువైన సమయం హరించుకుపోతోంది. ఈ కారణంగా 2020లోనే స్మార్ట్‌ ట్రాఫిక్‌ సర్వీస్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలైంది. బెంగళూరు నగరంలో 3,600 మంది పోలీసులకు కెమెరా ధరించిన యూనిఫార్మ్‌ (బాడీ వోర్‌ కెమేరా)లిచ్చారు. ఈ దస్తులను వేయ్యి మంది సక్రమంగా ధరించలేదని ఇటీవల హైకోర్టు వెల్లడించిన ఓ ఫిర్యాదుదారుని కేసులో తేలింది. బాణసవాడి పోలీసు స్టేషన్‌ నమోదైన సంఘటనలోనూ కెమెరా ధరించని పోలీసులపైనే చర్యలు తీసుకోవటం గమనార్హం. ఈ కెమెరాల్లో బంధించే చిత్రాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారిని నేరుగా తనిఖీ చేయాలన్న నిబంధనను పాటించే పోలీసులు తక్కువగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది.

ప్రీమియంలకు అనుసంధానం..

వాహనదారులు బకాయిపడ్డ జరిమానాలను ప్రీమియంలు, రెన్యువల్‌, ఇతర రిజిస్ట్రేషన్‌ సమయంలో చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరాం. వీటితో ఈ-చెల్లింపులు వేగవంతం అవుతాయి. కరోనా తర్వాత సొంత వాహనాల వాడకం పెరిగిన కారణంగా ఉల్లంఘనలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ నాజూకు విధానాలను పరిచయం చేసినా వినియోగదారుల నుంచి స్పందన అంతంతే.          

- బి.ఆర్‌.రవికాంతేగౌడ, జేసీపీ, ట్రాఫిక్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని