logo

జన నాయకుడికి జేజేలు

దూరదృష్టితో ఐదు వందల సంవత్సరాలకంటే ముందే బెంగళూరు నగర నిర్మాణం- విస్తరణకు విశిష్ట పథకాన్ని అమలు చేసిన మహారాజు కెంపేగౌడ జయంత్యుత్సవాన్ని పాత మైసూరు ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, ప

Published : 28 Jun 2022 01:02 IST

మైసూరు: కోటె ఆంజనేయ ఆలయం ఎదుట సంబరాలు

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : దూరదృష్టితో ఐదు వందల సంవత్సరాలకంటే ముందే బెంగళూరు నగర నిర్మాణం- విస్తరణకు విశిష్ట పథకాన్ని అమలు చేసిన మహారాజు కెంపేగౌడ జయంత్యుత్సవాన్ని పాత మైసూరు ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వేడుకలు మిన్నంటాయి. పాత మైసూరు, మధ్య కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ఉత్సవాల్ని ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు నిర్వహించాయి. మైసూరు నగరంలో కోటె ఆంజనేయస్వామి ఆలయం ప్రాంగణం నుంచి ఊరేగింపు నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా కొనసాగే ఊరేగింపును తలపించేలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాబృందాలు సందడి చేశాయి. కెంపేగౌడ విగ్రహంతో అనేక శకటాల్ని కోలారులో ఊరేగించారు. మండ్య జిల్లాలో జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో జయంత్యుత్సవాల్ని నిర్వహించారు. దావణగెరెలో ఆ జిల్లా పాలనాధికారి మహంతేశ్‌ బీళగి, ఎస్పీ రిష్యంత్‌ తదితరులు పాల్గొన్నారు. సముద్ర మట్టం నుంచి దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న బెంగళూరుకు నదులు ప్రవహించే అవకాశం లేదని- ఫలితంగా నీటి సమస్య ఎదురవడం ఖాయమనే గుర్తించి 513 ఏళ్ల కిందటే ప్రతీ నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకునేలా గొలుసుకట్టు చెరువుల్ని నిర్మించారని వక్తలు కెంపేగౌడ సేవల్ని కొనియాడారు. ఈ గొలుసుకట్టు చెరువుల కారణంగా నగరం, పరిసర ప్రాంతాల్లో కురిసే ప్రతీ నీటి చుక్కా ఏమాత్రం వృథా కాకుండా ఉండడం ఇప్పటి ఇంజినీర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్కో కులవృత్తుల వారికి ఒక్కో ప్రాంతాన్ని ప్రత్యేకించిన ఘనత ఆయనకే దక్కింది. కెంపేగౌడ సమాధి ప్రాంతమైన రామనగర జిల్లా మాగడి తాలూకా కెంపాపుర గ్రామంలో ఆదివారం నుంచే జయంత్యుత్సవాల సన్నాహాలు కొనసాగాయి. సమాధి ప్రాంతాన్ని పూలతో సింగారించారు. సోమవారం ఉదయాన్నే జనతాదళ్‌ నాయకులు అక్కడ ఘనంగా నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని