logo
Published : 28 Jun 2022 01:02 IST

మలిసంధ్యలో.. అదిరేటి సాగు

రైతు ఇస్మాయిల్‌ విజయప్రస్థానం

మేకలు, పక్షుల పోషణతో అదనపు ఆదాయం

మామిడి పండ్లను చూపుతున్న రైతు ఇస్మాయిల్‌

బళ్లారి, న్యూస్‌టుడే: ఇతని పేరు ఇస్మాయిల్‌..చిన్న నీటిపారుదల శాఖలో జేఈగా పనిచేసి విరమణ పొందారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితం కాకుండా తనకున్న 12.80 ఎకరాల పొలంలో సమగ్ర పండ్ల్ల్ల తోటల సాగుతో పాటు మేకలు, పక్షులు, కోళ్లను పెంచుతూ ఆదాయం పొందుతూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో కూడ్లిగి తాలూకా అత్యంత వెనుకబడిన ప్రాంతం..ఈ ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. ఇస్మాయిల్‌ నీటిపారుదల శాఖలో వేర్వేరు ప్రాంతాల్లో జేఈగా విధులు నిర్వహించి, పదేళ్ల క్రితం విశ్రాంతి పొందారు. కూడ్లిగి తాలూకా గుండా గ్రామంలో తనకున్న పొలంలో ఒకే పంటను సాగు చేయకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సమగ్ర పండ్ల్ల తోటలు సాగు చేస్తున్నారు.

పండ్ల తోటల సాగు

ఇస్మాయిల్‌ విశ్రాంతి పొందిన తర్వాత తోటకే పరిమితమయ్యారు. సమగ్ర పండ్ల్ల తోటల సాగుతో దిగుబడి, ఒకే పంటకు మద్దతు ధర లభించకపోయినా వేర్వేరు పంటలకు మద్దతు ధర లభిస్తుందని పలు పండ్ల్ల మొక్కలను సాగు చేశారు. ఎనిమిది రకాలకు చెందిన 200 మామిడి చెట్లు, రెండు రకాల 100 సపోటా, 500 మునగ, 10 చింత, 150 కొబ్బరి, నిమ్మ, నేరేడు, తదితర పండ్ల చెట్లను సాగు చేశారు. పండ్ల చెట్ల మధ్యలో ఇంటికి సరిపడా కొర్రలు, జొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. రెండు ఎకరాల్లో మేకల కోసం మేతను సాగు చేశారు. ప్రత్యేకంగా సాగు చేసిన మేతను మేకలకు వేయడం వల్ల ఫైబర్స్‌, ప్రొటీన్లు ఉండటంతో ఎదుగదలతో పాటు ఆరోగ్యంగా ఉంటున్నట్లు ఇస్మాయిల్‌ తెలియజేస్తున్నారు. ఏడాది ముందు 25 సెంట్లలో మునగ సాగుచేయడంతో ఎనిమిది నెలలకు దిగుబడి ప్రారంభమైంది. మొదటి సాగులో 10 క్వింటాళ్లు వరకు దిగుబడి వచ్చింది.

కొత్త రకాల మేకలు పెంపకం

ఇస్మాయిల్‌ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి బరాబరి రకం 20 మేకలు, 12 శిరోయి, 2 స్వజాత, 10 బీటల్‌ తదితర మేకలను పెంచుతున్నారు. ఏడాది వరకు పెరుగుదల ఉంటుంది. 20 నెలలకు సుమారు 60 నుంచి 80 కిలోల వరకు బరువు వస్తున్నాయి. కిలో రూ.350ల చొప్పున విక్రయిస్తున్నారు. ఎక్కువ శాతం రైతులు పెంచడానికి మేకలను తీసుకొని వెళ్తున్నారు. 100 గిరిరాజ కోళ్లతో పాటు 70 లవ్‌బర్డ్స్‌, 100 ఆఫ్రికన్‌ బర్డ్స్‌, ఫించస్‌, బట్లూస్‌, తదితర రకాల పక్షులను కూడా పెంచుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పక్షలను విక్రయిస్తూ అదనంగా ఆదాయం పొందుతున్నారు. నేటి వరకు మొత్తం 18వేలకుపైగా మేకలను విక్రయించారు. ఆఫ్రికన్‌ బర్డ్స్‌ జోడీలను 2,500, ఫించన్‌ 400, బట్లూస్‌ 500 పక్షులను కూడా విక్రయించారు. ఇస్మాయిల్‌ కుమారుడు రెహమాన్‌ జిందాల్‌లో కెమికల్స్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా సెలవు రోజుల్లో తోటలలో తండ్రికి సహాయ పడుతున్నారు.


సాగుతో ప్రశాంత జీవనం

విశ్రాంత  ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత జీవనం సాగిస్తున్నాను. ఆరోగ్యకరమైన పండ్ల తోటసాగు దానికి తోడు మేకలు, తదితర పక్షులు సాగు చేయడంతో వాటికి మేత, దాణా వేయడంతో సమయం గడిచి పోతుంది. పలు రకాల పండ్ల తోటల సాగు  తో మంచి ఆదాయం పొందుతున్నాను. మేకలను ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి తీసుకొని రావడంతో తక్కువ సమయంలో మంచి ఆదాయం పొందుతున్నాం. ఈ మేకలను ఈ ప్రాంతవాసులకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది.

- ఇస్మాయిల్‌, రైతు
 

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని