logo

అవును.. వారు అడవిని పెంచారు!

ఆ గ్రామస్థులు.. ఇతర అనేక గ్రామాల ప్రజలకు ఆదర్శం. అక్కడి వారంతా అడవిని పెంచి, పోషిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా తాళగుప్ప ఫిర్కాలోని హుణసూరు ఓ కుగ్రామం. ఐదు దశాబ్దాల కిందటే ఈ కుగ్రామం ఏర్పడింది.

Published : 29 Jun 2022 03:49 IST


అడవిని పరిశీలిస్తున్న గ్రామస్థులు

శివమొగ్గ, న్యూస్‌టుడే : ఆ గ్రామస్థులు.. ఇతర అనేక గ్రామాల ప్రజలకు ఆదర్శం. అక్కడి వారంతా అడవిని పెంచి, పోషిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా తాళగుప్ప ఫిర్కాలోని హుణసూరు ఓ కుగ్రామం. ఐదు దశాబ్దాల కిందటే ఈ కుగ్రామం ఏర్పడింది. గ్రామస్థుల ప్రధాన వ్యాపకం వ్యవసాయం. వర్షాలు కురిసినప్పుడు మాత్రమే సేద్యం లాభదాయకంగా ఉండేది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. గొట్టపు బావులు తవ్వుకోవాలంటే గంగమ్మ పాతాళానికి చేరుకుంది. అలాంటి పరిస్థితుల్లో అడవుల పెంపకమే తమ సమస్యకు శాశ్వత పరిష్కారమని గుర్తించారు. గ్రామానికి సమీపంలోని 83 ఎకరాల్లో వివిధ రకాల మొక్కల్ని నాటారు. కలప మొక్కలే కాకుండా పండ్ల మొక్కల్ని నాటారు. నాటడడంతోనే చేతులు దులుపుకోకుండా కట్టుబాట్లను ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ ఆ ప్రాంతంలోకి వెళ్లరాదని కట్టడి చేశారు. అలా వెళ్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అలా రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రస్తుతం ఆనాడు నాటిన మొక్కలు ఓ అడవిలా తయారయ్యాయి. ఏపుగా పెరిగిన ఆ ప్రాంతాన్ని చూస్తే పడమటి కనుమల్లోని అడవులు గుర్తుకు వస్తాయి. అడవిలో ఏదేని చెట్టు కూలినా దాన్ని తొలగించడానికి వీలులేదు. ఈ కారణంగానే అడవిలోకి వెళ్లి చూస్తే విరిగిన కొమ్మలు అక్కడే పడి ఉంటాయి. అడవి అభివృద్ధితో గ్రామంలో భూగర్భ జలాల పరిస్థితి గణనీయంగా అభివృద్ధి చెందినట్లు గ్రామస్థుడు కన్నప్ప తెలిపారు. అడవిని సంరక్షించడమే తమ ధ్యేయమని చెప్పారు. హుణసూరు గ్రామస్థుల శ్రమకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని