logo
Published : 29 Jun 2022 03:49 IST

పాఠ్య పుస్తకం.. వివాదాలే సమస్తం


బెంగళూరు జయనగరలో రక్షా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న
రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌, ఎంపీ తేజస్వీసూర్య, సంఘ సేవకురాలు తేజస్వినీ అనంతకుమార్‌, తదితరులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలను వివాదాలు చుట్టుముట్టాయి. ఒకటో తరగతి నుంచి పది వరకు పుస్తకాల్లో పాఠ్యాంశాల మార్పునకు సంబంధించి ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. రోహిత్‌ చక్రతీర్థ నేతృత్వంలోని సమితి రూపొందించిన పాఠాలపై సాహితీవేత్తలు, విద్యావేత్తలు విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా చేసిన మార్పులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరగతులు ప్రారంభమై నెల అవుతున్నా.. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ వైఫల్యంతోనే పాఠ్యాంశాల రూపకల్పన, పుస్తకాల ముద్రణ జాప్యమైందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శించారు. కొత్త పాఠ్యాంశాలకు ఆమోదం లభించినా, వాటి ముద్రణకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని ప్రచురణకర్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అభ్యంతరాలు వ్యక్తమైన ఎనిమిది అంశాలను సవరించడంతో పాటు, బాలలకు వారి వయసుకు తగిన పాఠాలను మాత్రమే పుస్తకాల్లో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

‘కనకదాస’ భాగ్యం..

● తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో కనకదాస జీవిత చరిత్ర పాఠాన్ని కొనసాగించాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి బొమ్మై సూచనలు చేశారు. ఇప్పటి వరకు విద్యార్థులకు బోధిస్తూ వచ్చిన పాఠాన్ని ఈ విద్యాసంవత్సరమూ కొనసాగించాలని తన సూచనల్లో పేర్కొన్నారు. తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకం నుంచి కనకదాసుని జీవిత చరిత్ర పాఠాన్ని తొలగించారని కాగినెల కనకపీఠం ప్రతినిధి నిరంజనానందపురి స్వామి తప్పుపట్టడం ప్రస్తావనార్హం. ఆ పాఠాన్ని తొలగించకూడదని ముఖ్యమంత్రి బొమ్మైను గత శనివారం కలుసుకుని వినతి పత్రాన్ని అందించారు. కనకదాస చరిత్రను పూర్తిగా తొలగించి, ఏకవాక్యానికి దాన్ని పరిమితం చేయడం పై మఠాధిపతి ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. కనకదాస ఆదర్శాలు, దార్శనికతను విద్యార్థులకు తెలియజేకుండా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, పూర్తి పాఠాన్ని కొనసాగించాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి లిఖిత సూచనలు చేశారు.


ఫిర్యాదుల పెట్టె..

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా శాఖకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు అడిగే ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి బి.సి.నాగేశ్‌, ఇతర ఉన్నతాధికారులు బదులివ్వనున్నారు. తమ శాఖను మరింత పారదర్శకంగా తీర్చి దిద్దేందుకు, విద్యార్థులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఈ కొత్త పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని నాగేశ్‌ తెలిపారు. పోర్టల్‌కు అనుబంధంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లోనూ తమ శాఖకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని