logo

హోం స్పందనతో గుత్తేదారుల్లో కదలిక

గుత్తేదారుల నుంచి చట్టసభ ప్రతినిధులు, అధికారులు 40 శాతం కమీషన్‌ గుంజుతున్నారన్న ఆరోపణలకు సంబంధించి దాఖాలాలు ఇవ్వాలని గుత్తేదారుల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణకు కేంద్ర హోం శాఖ సూచించింది.

Published : 29 Jun 2022 04:07 IST


కెంపణ్ణ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : గుత్తేదారుల నుంచి చట్టసభ ప్రతినిధులు, అధికారులు 40 శాతం కమీషన్‌ గుంజుతున్నారన్న ఆరోపణలకు సంబంధించి దాఖాలాలు ఇవ్వాలని గుత్తేదారుల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణకు కేంద్ర హోం శాఖ సూచించింది. దర్యాప్తు చేస్తానని హామీ ఇస్తేనే, దానికి సంబంధించిన వివరాలు వారికి అందిస్తానని కెంపణ్ణ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ నుంచి తనకు గత శుక్రవారమే ఫోన్‌ కాల్‌ వచ్చిందని- బెంగళూరులోని తమ కార్యాలయంలో దాఖలాలు ఇవ్వాలని అధికారులు సూచించారని చెప్పారు. ప్రజాపనులు, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు ప్రముఖ శాఖల్లో అన్ని పనులకూ 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని కెంపణ్ణ గతంలో ఆరోపించారు. సంఘం తరఫున ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా రాశారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ సంచలనాలకు కారణమైంది. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కేంద్ర ప్రభుత్వమూ ఈ విషయంలో నోరు మెదపలేకపోయింది. తాను కమీషన్‌ ఇవ్వకపోవడంతో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయలేదని ఆరోపిస్తూ సంతోశ్‌ అనే గుత్తేదారు ఉడుపిలో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆ ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్న కె.ఎస్‌.ఈశ్వరప్ప తన పదవిని కోల్పోవలసి వచ్చింది. తాజాగా కెంపణ్ణకు కేంద్ర హోంశాఖ నుంచి సూచనలు రాగా, దర్యాప్తునకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తేనే తాను వాటి ఆధారాలు, పత్రాలు అందిస్తానని చెప్పడం విశేషం. ప్రధానమంత్రి కార్యాలయ సూచనలతోనే కేంద్ర హోంశాఖ స్పందించి విచారణకు సిద్ధమైనట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని