logo
Published : 29 Jun 2022 04:07 IST

అభయారణ్యంలో నిఘాకళ్లు

అక్రమాల అడ్డుకట్టకు కెమేరాలు


నాగరహొళె కీకారణ్యంలోకి ప్రవేశ మార్గమిదే..

మైసూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో బండీపుర అభయారణ్యం తరువాతి స్థానంలో ఉన్న నాగరహొళె వనసీమలో అక్రమాల అడ్డుకట్టకు అధికారులు నడుం బిగించారు. వన్యప్రాణుల సంచారం, అడవి దొంగల చొరబాటు.. వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన రీతిలో చర్యలు తీసుకునేందుకు వీలుగా నిఘా కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రైవేట్‌ సంస్థలు ముందుకొచ్చాయి. అభయారణ్యంలో 500 కెమేరాల్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులతో ఇందుకు సంబంధించి ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఓ రిసార్ట్‌ నిర్వాహకుడుగా గుర్తింపు పొందిన టైగర్‌ రమేశ్‌ నాయకత్వంలో ఈ వినూత్న పథకానికి చేయూతనివ్వాలని తీర్మానించారు. ప్రతీ మూడు రోజులకొకసారి అటవీ సిబ్బంది కెమేరాలలోని చిప్‌లలో నిక్షిప్తమైన వివరాల్ని తమ ల్యాప్‌టాప్‌ల్లోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారుల నుంచి సూచనలు పొందడానికి వీలుంటుంది. ఇప్పటికే ఈ సంస్థలు బండీపుర అభయారణ్యానికి 300, దాండేలిలో వంద కెమేరాలను అమర్చడం తెలిసిందే. నాగరహొళె అభయారణ్యంలో ఇప్పటికే నాలుగు వందల కెమేరాల్ని కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ అడవిలో ప్రస్తుతం 135 పులులు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల నిర్వహించిన తాజా పులి గణన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మరో 10- 15 వరకు పులుల సంఖ్య అధికమవుతుందని భావిస్తున్నారు. కెమెరాల ఏర్పాటుతో అడవిదొంగల్ని ఆటకట్టించవచ్చని అధికారులు తెలిపారు. అడవిలో విలువైన కలపను దొంగిలించడంతో పాటు వన్యప్రాణుల్ని వేటాడుతుంటారని సమాచారం ఉన్నప్పటికీ ఆ దొంగల గురించిన వివరాలు తెలియడం లేదు. అడవి అంచుల్లోని గ్రామాల్లో సందేహంతో కొందరిని అదుపులోనికి తీసుకుని విచారిస్తుంటారు. అనేక సందర్భాల్లో తగిన సాక్ష్యాలు లేనందున అసలైన నిందితులే తప్పించుకుంటున్నారు. తాజా నిఘాతో ఆ దుండగుల చిత్రాలు రికార్డు కానున్నందున ఇకముందు అక్రమాలకు కళ్లెం వేయవచ్చని సంబంధిత అధికారి ఒకరు వివరించారు.


వన్యజీవుల కదలికను గుర్తించే నిఘా కెమెరా


అభయారణ్యానికే ఆకర్షణగా నిలిచే నల్లని చిరుత

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని