logo

జిల్లా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

జిల్లా ఆసుపత్రి ఎన్‌.ఐ.సి. పిల్లల వార్డులో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన హోంగార్డులు, విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది, వైద్యులు చొరవతో నవజాత శిశువులను సురక్షితంగా రక్షించారు. దీంతో బయట ఉన్న బాలింతలు, వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Published : 29 Jun 2022 04:07 IST

14 మంది నవజాత శిశువులు సురక్షితం


మంటలను ఆర్పుతున్న హోంగార్డులు

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రి ఎన్‌.ఐ.సి. పిల్లల వార్డులో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన హోంగార్డులు, విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది, వైద్యులు చొరవతో నవజాత శిశువులను సురక్షితంగా రక్షించారు. దీంతో బయట ఉన్న బాలింతలు, వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువులు, న్యుమోనియా, శ్వాసకోశ, నెలలు నిండకుండా జన్మించిన వారు, బరువు తక్కువున్న వారికి చికిత్స అందజేయడానికి ఎన్‌.ఐ.సి వార్డును ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో 14 మందికిపైగా శిశువులు చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో వార్డులో విద్యుత్తు బోర్డు వేడెక్కి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, వైద్య విద్యార్థులు గుర్తించి పిల్లలను రక్షించి మంటలను అదుపుచేశారు. ఒక్కసారిగా వార్డులో పొగలు కమ్ముకున్నాయి. జిల్లా ఆసుపత్రి బాధ్యుడు డా.బసరెడ్డి, తదితర వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హోంగార్డుల సాయంతో పెద్ద ప్రమాదం తప్పడంతో వైద్యులు, అధికారులు, పిల్లలు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై జిల్లా ఆసుపత్రి బాధ్యుడు డా.బసరెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ అగ్నిప్రమాదాన్ని తక్షణమే గుర్తించి మంటలను ఆర్పివేశారు. ఎన్‌.ఐ.సి వార్డులో చికిత్స పొందుతున్న 14 మంది చిన్నారుల్లో 13 మందికి పక్కనే మరో వార్డును సిద్ధం చేసి అక్కడే చికిత్స ప్రారంభించార. మరో శిశువుకు వెంటిలేటర్‌ అవసరం కాగా, విమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. వారంలోపు మరమ్మతులు చేయించి యథాప్రకారం చికిత్స ప్రారంభిస్తామన్నారు.


మంటలకు పడిపోయిన పైకప్పు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని