logo
Published : 29 Jun 2022 04:07 IST

చినుకు జాడ లేక..ఖరీఫ్‌ సాగు వెనక..!

4.79 శాతం మాత్రమే నమోదు


దుక్కి దున్నుతున్న రైతు

బళ్లారి, న్యూస్‌టుడే: రుతు పవనాలు ముందుగానే ప్రారంభమైనా..బళ్లారి జిల్లాలో 15 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్‌ సాగు అనుకున్న స్థాయిలో విత్తనాలు వేయలేదు. సాగు చేసిన పంటలు కూడా వాడిపోతున్నాయి. బళ్లారి జిల్లాలో 2022-23 ఏడాదికి 1,74,202 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు చేస్తారని వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రుతుపవనాలు కూడా ముందుగానే ప్రారంభమవుతున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తుంగభద్ర జలాశయానికి ఆశించిన స్థాయిలో వరదనీరు చేరింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ అనుకూలంగా ఉంటుందని రైతులు భావించారు. గతేడాది జులై మూడో వారానికి 35 శాతం విత్తనం వేసినట్లు వ్యవసాయశాఖాధికారులు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌ 25 వరకు కేవలం 4.79 శాతం ఖరీఫ్‌ సాగు చేసినట్లు వ్యవసాయ శాఖాధికారులు తెలియజేస్తున్నా..మంగళవారానికి 10 శాతం ఖరీఫ్‌ అయి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

సాగు ఆలస్యం

జిల్లాలో ఆయకట్టు కింద 1,10,436 హెక్టార్లు ఉండగా, వర్షధారం కింద 63,765 హెక్టార్లలో పంట సాగు అవుతుందని అంచనా వేశారు. 15 రోజులు ముందు జిల్లాలో వర్షం కురవడంతో వర్షధారం కింద ఆయకట్టు భూముల్లో కొంత మంది రైతులు మిరప, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేశారు. మెట్ట పొలాల్లో కూడా సూర్యకాంతి, జొన్న, సజ్జ, తదితర పంటలను సాగు చేశారు. వర్షాలు మొహం చాటేయడంతో తుంగభద్ర జలాశయం కాలువలకు నీటిని విడుదల చేసిన తర్వాత ఖరీఫ్‌ సాగు చేస్తారని వ్యవసాయశాఖాధికారులు భావిస్తున్నారు.


ఆయకట్టు భూమిలో మిరప నాట్లు వేస్తున్న కూలీలు

సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే

బళ్లారి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే..ఎక్కువగా నమోదైనా సరైన సమయంలో కురవకపోవడంతో ఖరీఫ్‌ సాగు అనుకున్న స్థాయిలో జరగలేదు. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 138.3 మి.మీ వర్షపాతం (జనవరి నుంచి జూన్‌ 27 వరకు) నమోదు కావాల్సి ఉండగా, 180 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 30 శాతం ఎక్కువ నమోదైంది. జిల్లాలో సండూరు తాలూకా మినహా మిగిలిన తాలూకాలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైంది.

ఇప్పటికీ అంతంతమాత్రమే..

బళ్లారి జిల్లాలో నీటిపారుదల కింద 3,520 హెక్టార్లు, మెట్ట భూముల్లో 4,829 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ప్రధానంగా గతేడాది మిరప సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు పత్తి సాగుపై దృష్టి పెట్టారు. పత్తి మొత్తం 34,850 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటికే 5,107 హెక్టార్లలో సాగైంది. సూర్యకాంతి 1,414 హెక్టార్లు, జొన్న, సజ్జ, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి సాగు తక్కువగా ఉంది.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని