logo

రాష్ట్రంలో నిఘా తీవ్రం

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కన్నయ్యలాల్‌ను తల నరికి హత్య చేయడం అమానుష కృత్యమని హోం మంత్రి అరగజ్ఞానేంద్ర తీవ్రంగా ఖండించారు. ఇటువంటి పని అమానవీయమని, అనాగరికమని వ్యాఖ్యానించారు.

Published : 30 Jun 2022 00:46 IST

అగ్నిమాపక ఠాణా ప్రారంభం సందర్భంగా జ్యోతి వెలిగిస్తున్న అరగ జ్ఞానేంద్ర

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కన్నయ్యలాల్‌ను తల నరికి హత్య చేయడం అమానుష కృత్యమని హోం మంత్రి అరగజ్ఞానేంద్ర తీవ్రంగా ఖండించారు. ఇటువంటి పని అమానవీయమని, అనాగరికమని వ్యాఖ్యానించారు. హంతకుల వెనుక దేశ, విదేశీ శక్తులు ఉంటాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని అన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిఘాను పెంచాలని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌కు సూచించానని చెప్పారు. హంతకులకు కఠిన శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలో కొత్త అగ్నిమాపకఠాణాల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేసి, అనంతరం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు.

* ప్రశాంతంగా ఉన్న దేశంలో కొందరు హింసను ప్రేరేపిస్తున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సి.టి.ఆరోపించారు. దిల్లీలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. ఉదయపూర్‌ హత్యాకాండ వెనుక విదేశీ శక్తులు ఉన్నట్లు కనిపిస్తోందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి హృదయ విదారక ఘటన జరిగినా, కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించాలని, తప్పు చేసిన వ్యక్తులను కులం, మతం ఆధారంగా వెనకేసుకు రావడం సరికాదని అన్నారు.

రాష్ట్రపతి పాలనే మేలు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాజస్థాన్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండు చేశారు. తన ప్రాణాలకు హాని ఉందని కన్నయ్యలాల్‌ పోలీసుల వద్ద మొర పెట్టుకున్నా వారు రక్షణ కల్పించలేదని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 24 మంది హిందూ కార్యకర్తలు ఇలానే హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న విధానాలే ఇటువంటి ఘటనలకు కారణమని విమర్శించారు. దేశంలో జిహాదీ మానసికతను మొగ్గలోనే అణచివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది దారుణం : కుమార

రాజాస్థాన్‌లో దర్జీ కన్నయ్యలాల్‌ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షను విధించాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జనతాదళ్‌) డిమాండు చేశారు. సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని, వేగంగా దర్యాప్తు పూర్తి చేసే బాధ్యత అక్కడి పోలీసులదేనన్నారు. ‘హత్యలతో ఏ ధర్మాన్నీ ఎవరూ కాపాడుకోలేరు’ అని వ్యాఖ్యానించారు. హంతకులను ఉపేక్షిస్తూ వెళితే, ఇటువంటి ఘటనలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నారు. వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మానవీయత ఎక్కడ నిలిచిపోతుందో.. అక్కడి నుంచే హింస ప్రారంభమవుతుందని కుమారస్వామి తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

దుర్మార్గ చర్య

ఉదయపూర్‌ తరహా ఘటన నాలుగున్నర దశకాల్లో దేశంలో ఎక్కడా జరగలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి వి.సోమణ్ణ దిగ్భ్రాంతి చెందారు. ఇటువంటి హత్యను భారతీయులు ఎవరూ సమర్థించరని తేల్చిచెప్పారు. ఐసిస్‌ తరహాలో నిందితులు కన్నయ్యను హత్య చేశారని ఆక్రోశించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి, హంతకులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని