logo

ప్రమాదపుటంచుల్లో సముద్ర తీరం

నైరుతి రుతుపవనాల తీవ్రరూపం దాల్చాయంటే.. సముద్రుడి ఉగ్రరూపం ఏస్థాయిలో ఉంటుందోనని తీర ప్రాంతంలోని జాలర్లు, ఇతర రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రుతుపవనాల తీవ్రతకు తుపానులు తోడయ్యాయంటే విధ్వంసం తప్పదు.

Published : 05 Jul 2022 02:59 IST

తీరంలోని కొబ్బరి చెట్లకు తీరని నష్టం

ఉడుపి, న్యూస్‌టుడే : నైరుతి రుతుపవనాల తీవ్రరూపం దాల్చాయంటే.. సముద్రుడి ఉగ్రరూపం ఏస్థాయిలో ఉంటుందోనని తీర ప్రాంతంలోని జాలర్లు, ఇతర రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రుతుపవనాల తీవ్రతకు తుపానులు తోడయ్యాయంటే విధ్వంసం తప్పదు. తీరం వెంబడి జాలర్ల నివాసాలు, గ్రామాల్లోని రహదారులు, కొబ్బరి తోటలు, తీరంలోని ఇతర నిర్మాణాలు సముద్రుడి ఆగ్రహానికి ఆజ్యం కావాల్సిందే. దశాబ్ద కాలంగా ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారాన్ని చూపనున్నట్లు ప్రభుత్వాలు హామీల్ని గుప్పిస్తూనే మరో ఏడాది గడుస్తోందేకానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని స్థానికులు వాపోయారు. అందుకే సముద్రంలో అలజడి కనిపించిందంటే చాలు... ఇంటిల్లిపాదీ ఒడ్డున గడపాల్సిందే. అలల తీవ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. ఈ దుస్థితి మంగళూరు సమీపంలోని ఉళ్లాల, ఉడుపి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సర్వసాధారణమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఆర్‌జెడ్‌ (తీర ప్రాంతాల నిబంధనలు) ఆంక్షల్ని ఉల్లంఘించడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర తీరం నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదనే ఆంక్షలున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సముద్రపు అంచుల్లోనే నిర్మాణాలున్నందున ఏమాత్రం అలల తీవ్రత ఎక్కువైనా తీరంలోని నివాసాలకు నష్టం వాటిల్లడం ఖాయమని తెలిపారు. సముద్ర తీరంలో కొన్ని ప్రాంతాల్లో బండరాళ్లు వేశారని-అలల తాకిడికి వాటిల్లో అనేకం కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారాన్ని చేపట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలని జాలర్లకు సూచించారు.

ఉడుపి సమీపాన అలల తీవ్రత చూస్తున్న స్థానికులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని