logo
Published : 05 Jul 2022 02:59 IST

విస్తరించిన రాబందుల రాజ్యం

ఆధునిక సాంకేతికతతో పక్షిజాతికి మనుగడ


దీర్ఘాలోచన.. ఆహారం కోసం ఎటువైపు వెళ్లాలి?

చామరాజనగర, న్యూస్‌టుడే : రాబందుల రెక్కల చప్పుళ్లు వినిపించడమే అత్యంత అరుదుగా మారిన నేపథ్యంలో.. వాటి సంతతిని పెంచేందుకు ఆధునిక సాంకేతికత సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల రాబందుల జాతి క్రమేపీ అంతరించి పోతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 1980లో దేశ వ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా రాబందులు ఉండేవని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య మరీ తగ్గిపోయింది. ఇందుకు సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లడం, ఆహారం కొరత ప్రధాన కారణాలని భావిస్తున్నారు. ఒక్కో రాబందు తన కడుపు నింపుకోవాలంటే వంద కిలోమీటర్ల దూరానికి పైగా సంచరిస్తుందట. నగరీకరణ, కళేబరాల్ని గుర్తించిన వెంటనే వాటిని ఖననం చేయడం, చెట్లను విచ్చలవిడిగా తొలగించడం వల్ల ఇవి కొండ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మన దేశంలో ఒకప్పుడు పదికిపైగా రాబందు జాతులుండేవని భావించగా.. ప్రస్తుతం ఈ సంఖ్య మూడుకు చేరుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబందుల సంతతిని సంరక్షించేందుకు మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన జనటిక్స్‌, జెనోమిక్స్‌ విభాగంతో రాష్ట్ర అటవీశాఖ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అంశాలు ప్రస్తుతం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ రాబందుల జీవనక్రమం, ఆహారం, దాని వైఖరి తదితర అంశాలపై అధ్యయనం చేసి అందుకు తగిన వాతావరణాన్ని కల్పించే దిశగా అధ్యయనం కొనసాగుతుందని విశ్వవిద్యాలయం సభ్యులు తెలిపారు. అడవుల్లో లభించే కళేబరాల్ని మొన్నటి వరకు ఖననం, లేదా దహనం చేసేవారు. ఈ పరిణామాలు వాటికి ఆహార సమస్యను తీవ్రతరం చేసేవి. ఒక అధ్యయనం ప్రకారం అవి 95 శాతం ఆహార కొరతను ఎదుర్కొనేవని వెల్లడైంది. దీనిని గుర్తించే కర్ణాటక అటవీశాఖ ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చింది. అడవుల్లో వివిధ కారణాల వల్ల మరణించే వన్యప్రాణుల కళేబరాల్ని ఖననం చేయకుండా అదే విధంగా అక్కడే వదిలిపెట్టాలని నిర్ణయించారు. ఇందువల్ల వాటిపైనే ఆధారపడి జీవనం సాగించే రాబందులు, నక్కలు, అడవి కుక్కలు, కాకులు, ఇతర పక్షులు, జంతువులకు ఆహార కొరతను గణనీయంగా తగ్గించవచ్చని భావించారు. ప్రస్తుతం ఈ నిర్ణయాన్నే అమలు చేస్తున్నారు. రాబందుల జీవన విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే ఎలాంటి చర్యల్ని తీసుకుంటే వాటి జాతి మనుగడ సాధ్యమనే విషయం వెల్లడవుతుందని అధికారులు పేర్కొన్నారు. నాగరహొళె అభయారణ్యంలో ఇటీవలి కాలంలో రాబందుల సంఖ్య అధికమైందని ఇదే పరిస్థితి మాదప్ప కొండల్లో, బండీపుర అభయారణ్యంలో కూడా ఎదురవుతోందని తెలిపారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాబందుల సంరక్షణా కేంద్రమైన రామనగర జిల్లాల్లోని రామదేవర కొండల్లో కూడా వీటి సంఖ్య అధికమవడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. మైసూరు విశ్వవిద్యాలయం జనటిక్స్‌ విభాగం సహకారంతో చేపట్టనున్న అధ్యయనం అనంతరం ఈ సంఖ్య గణనీయంగా ఎక్కువయ్యేందుకు దోహదపడుతుందని తెలిపారు.

రామదేవర కొండలో ఎరుపు మెడ రాబందు

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని