logo

విషానికి కొత్త విరుగుడు

కన్నడనాడు జీవ వైవిధ్య ప్రాంతాలు, అంతే వైవిధ్య జీవరాశులకు నెలవు. పశ్చిమ కనుమల వంటి ప్రకృతి విశిష్టతల అటవీ ప్రాంతాలతో ఈ ప్రత్యేకతలు ఇట్టే ఆకట్టుకుంటాయి. విషపూరిత జీవరాశుల కాటుతో సంభవించే మరణాలు కూడా అధికమే.

Published : 05 Jul 2022 02:59 IST

ఐఐఎస్‌సీ, ఐబీఏబీ ఆధ్వర్యంలో ముందడుగు


ఏవీఆర్‌డీసీ వద్ద మంత్రి అశ్వత్థనారాయణతో శాస్త్రవేత్తలు, అధ్యయన విద్యార్థులు

ఈనాడు, బెంగళూరు : కన్నడనాడు జీవ వైవిధ్య ప్రాంతాలు, అంతే వైవిధ్య జీవరాశులకు నెలవు. పశ్చిమ కనుమల వంటి ప్రకృతి విశిష్టతల అటవీ ప్రాంతాలతో ఈ ప్రత్యేకతలు ఇట్టే ఆకట్టుకుంటాయి. విషపూరిత జీవరాశుల కాటుతో సంభవించే మరణాలు కూడా అధికమే. పాములు, తేళ్లు, విషపూరిత సాలెపురుగులతో మరణించే వారు ఏటేటా పెరుగుతున్నారు. ఈ తరహా మరణాలను నియంత్రించే ఔషధాలు మాత్రం దేశంలో కనుగొనలేదని ప్రకృతి అధ్యయనకారులు, శాస్త్రవేత్తలు తమ నివేదికల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. విష నిరోధక అధ్యయనాలు వందేళ్ల భారతీయ వైద్య శాస్త్రంలో అనుకున్న స్థాయిలో చేపట్టలేదన్న వాదనలకు సమాధానంగా బెంగళూరులో అరుదైన అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. సోమవారం ఈ అరుదైన అధ్యయన కేంద్రాన్ని భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్‌సీ), కర్ణాటక నవ్యాలోచనలు, సాంకేతిక సంఘం (కిట్స్‌), ఐటీ-బీటీ, జీవసమాచార, జీవ సాంకేతిక సంస్థ (ఐబీఏబీ)లు సంయుక్తగా ఏర్పాటు చేశాయి.

సంప్రదాయ విష సేకరణ పద్ధతులకు ఇక సెలవు

కల నెరవేరెనే

కర్ణాటకలో ఏటా 7,400 మంది పాము కాట్ల వల్ల మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మరణాలు నియంత్రించలేకపోయేందుకు ప్రధాన కారణం.. మేలైన విష నిరోధక ఔషధాలు లేకపోవటమే. రాష్ట్రంలో వందకు పైగా వైవిధ్య జాతులకు చెందిన పాములున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ అధ్యయనంలో వెల్లడైంది. వీటిల్లో వంద రకాల జీవరాశుల విషానికి మాత్రమే ఔషధంగా మార్చే గుణముంది. దేశవ్యాప్తంగా కేవలం నాలుగు రకాల విషాన్ని మాత్రమే ఔషధంగా తయారు చేసే వ్యవస్థలున్నాయి. ప్రస్తుతం తమిళనాడు, ముంబయిలో ఈ తరహా అంశాలపై అధ్యయనాలు పాక్షికంగా చేపడుతున్నారు. ఈ సమస్యలన్నీంటికి పరిష్కారంగా ఐబీఏబీలో యాంటీ వెనోమ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఏవీఆర్‌డీసీ) ప్రారంభించారు.

మరణాలకు అడ్డుకట్ట

రాష్ట్రవ్యాప్తంగా ఏటా సంభవించే పాము కాట్ల మరణాలను 30 శాతం నియంత్రించే లక్ష్యంతో ఏవీఆర్‌డీసీని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్స్‌ సిటీలోని ఐబీఏబీలో ప్రారంభించిన ఈ కేంద్రంలో వెనోమ్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ అబ్జర్వేటరీ, రీసెర్చ్‌ ల్యాబ్‌, డిజిటల్‌ లైబ్రరీలో విభిన్న రకాల పాముల విషాన్ని వెలికితీసి ఔషధంగా తయారు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఔత్సాహిక పరిశోధకులకు ఉద్దీపన కేంద్రంగా కూడా ఏవీఆర్‌డీసీసీ ఉపయోగపడనుంది. యాంటి వెనోమ్‌ పరిశోధనల్లో వికేంద్రీకరణ చేపట్టాలన్న లక్ష్యంతో రూ.7 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఐటీబీటీ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ తెలిపారు. ఇందులో 23 రకాల విష జీవరాశుల విషంపై అధ్యయనాలు చేపడతారు. కొత్త తరం యాంటీ వెనోమ్‌ థెరపీలు, పరీక్షలు, విష నిరోధక ఉత్పత్తులను ఈ కేంద్రం తయారు చేస్తుందని ఐఐఎస్‌సీ పర్యావరణ విజ్ఞాన కేంద్రం సహాయ ఆచార్యులు కార్తీక్‌ సున్‌సాగర్‌ తెలిపారు. జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రంలో అధ్యయనాలు చేపడతారు. ఏటా 500 మంది అటవీశాఖ అధికారులు, రేంజర్లు, గార్డులకు పాము కాటు చికిత్సలపై శిక్షణ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే 50 రకాల ఏవీఆర్‌డీసీసీ అనుబంధ చికిత్స కేంద్రాల్లో సిబ్బందికి ఇక్కడ ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ముంబైకి చెందిన హాఫ్‌కైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ సంస్థ ఇప్పటి వరకు ఈ విభాగంలో అధ్యయనాలు చేపట్టగా, కర్ణాటకలో మరింత విస్తృతమైన అధ్యయనాలకు ఏవీఆర్‌డీసీసీ కేంద్రం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు