logo
Published : 05 Jul 2022 02:59 IST

వరద నీటి గలగల!

వరద నీటితో తొణికిసలాడుతున్న కృష్ణరాజసాగర జలాశయం

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : రుతుపవనాల ప్రభావంతో జలాశయాలకు జల కళ ఆరంభమైంది. మొన్నటి వరకు ఒకటి రెండు జలాశయాలు మినహా మిగిలినవన్నీ అడుగంటిన నీటితో వెలవెలబోతూ కనిపించాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రవాహాలు జోరందుకున్నాయి. నేత్రావతి, కావేరి, తుంగ, భద్ర నదుల్లో ప్రవాహం అధికంగా ఉంది. కృష్ణాలో ఇప్పుడిప్పుడే నీటి కదలిక కనిపిస్తోంది. కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే హారంగి జలాశయం భర్తీ అయిన విషయం తెలిసిందే. ఆ జలాశయం నుంచి 12,720 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా మండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర జలాశయం చేరుతుంది. ఫలితంగా ఆ జలాశయానికి 22,466 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా మొన్నటి వరకు 40 శాతం మాత్రమే ఉన్న నీటి నిల్వలు ఒక్కసారిగా 65 శాతానికి చేరుకున్నాయి. వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే జలాశయం భర్తీ అయ్యేందుకు ఎక్కువకాలం పట్టదని అధికారులు వెల్లడించారు. ఇదే పరిస్థితి కబిని జలాశయానికి కూడా కొనసాగుతోంది. ఇక్కడికి 12,475 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు తెలిపారు. కబినిలో ప్రస్తుతం 59 శాతం నీటి నిల్వలున్నాయి. ఇక ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రమైన లింగనమక్కి జలాశయానికి 17,007 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదవుతోంది. సూప జలాశయానికి 7,285 క్యూసెక్కులు, వరాహి జలాశయానికి 4,866 క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. తుంగ, భద్ర నదులకు పెద్ద యెత్తున ప్రవాహాలున్నందున మరో రెండు రోజుల్లో తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో అధికంగా ఉండనుందని ఆశిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో అధిక వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడినట్లు సమాచారం అందిది. అడుగంటిన నీటితో కళావిహీనంగా ఉన్న కాళి నదిలో నీటి పరవళ్లు అధికమయ్యాయి.

నయన మనోహర దృశ్యాన్ని ఆవిష్కరించిన హారంగి జలాశయం

కృష్ణా పరిధిలో.. : ఘటప్రభ, మలప్రభ నదుల్లో నామమాత్రపు ప్రవాహాలే ఉన్నాయి. ఫలితంగా కృష్ణ నుంచి ఆలమట్టి జలాశయానికి 3,691 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతున్నట్లు అధికారులు తెలిపారు  ఆ డ్యాంలో 39 శాతం నీటి నిల్వలున్నాయి. అక్కడికి దిగువన ఉన్న నారాయణ పుర జలాశయం ఇప్పటికే 84 శాతం భర్తీ అయింది. జలాశయానికి 241 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

భారీ వర్షాలు : రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శివమొగ్గ జిల్లా తుమ్రిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొట్టిగెహార, శృంగేరి, భాగమండల, గేరుసొప్పలో 13, క్యాసిల్‌ రాక్‌ 11, పుత్తూరు, ధర్మస్థల, ఉడుపి, కొల్లూరు 10, కార్కళ, కద్ర, జయపుర 9, సుళ్య, మంగళూరు, బాళెహొన్నూరు 8,, హొన్నావర, బనవాసి, బెలికెరె,శిరాళహ, బ్రహ్మావర, కోట, బెళ్తంగడి, మాణి, ఔరాద్‌ 7, కుమటా, మంకీ, అంకోలా, పణంబూరు, నిట్టూరు, కొప్ప 6, గోకర్ణ, కార్వార, నాపోక్ల్‌ 5, బెళగావి, అనవట్టి, సకలేశపుర 4, హావేరి, హాసన, కలబురగి, జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షం కురిసిందని తెలిపారు.

మడికెరి సమీపంలోని త్రివేణీ సంగమం వద్ద పరవళ్లు తొక్కుతున్న కావేరి


ఉత్తుంగ తరంగాలు

పడమటి కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున నగర శివార్లలోని తుంగా జలాశయంలోకి పెద్దయెత్తున వరద నీరు చేరుతోంది. ఇప్పటికే భర్తీ అయినందున జలాశయం నుంచి 17,875 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా శివమొగ్గ నగరంలోని తుంగా నదిలో ఉన్న పాత మంటపం నీట మునిగింది. నది వద్దకు వెళ్లవద్దని హెచ్చరికల్ని జారీ చేశారు. ఎగువనుంచి వచ్చే వరద నీటి ఆధారంగా నీటి విడుదల పరిమాణాన్ని నిర్ణయిస్తామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు.

(న్యూస్‌టుడే, శివమొగ్గ)

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని