logo
Updated : 08 Aug 2022 04:58 IST

దళపతుల ముందస్తు వ్యూహం

ఎన్నికలకు సన్నాహాలు


కుమారస్వామి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: విధానసభ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటి నుంచే తెరవెనుక ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. దావణగెరెలో సిద్ధరామోత్సవాన్ని, ఇప్పటికే ఆయా జిల్లాల్లో పాదయాత్రల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన శక్తిని ప్రదర్శించింది. పార్టీ కార్యకర్త ప్రవీణ్‌ నెట్టారు హత్యతో భాజపా తన సాధన సమావేశాలను అనివార్యంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.  వచ్చే ఎన్నికల్లో లక్ష్యం 123 పేరిట జనతాదళ్‌ ఇతర పార్టీల కన్నా ప్రచార కార్యక్రమాల్లో ముందంజలో ఉంది. ఎనిమిది, తొమ్మిదో దశకం మధ్యలో జనతాదళ్‌కు స్వర్ణయుగమని చెప్పవచ్చు. ఆ పూర్వవైభవాన్ని దక్కించుకునేందుకు తాడో పేడో తేల్చుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. అరకొర మెజార్టీ కాకుండా పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెడితే ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేరుస్తామని దేవేగౌడ, కుమారస్వామి, సి.ఎం.ఇబ్రహీం ప్రతిసభలోనూ ఓటర్లకు చెబుతున్నారు. జాతీయ పార్టీల పనితీరుతో విసిగిపోయిన ప్రజలు ఈసారి తమకే అధికారాన్ని కట్టబెడతారన్న ధీమాతో దళపతులు ఉన్నారు. మేకెదాటు ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన పాదయాత్రకు పోటీగా తాగు నీటి మూలాలు, నదీ జలాల సంరక్షణ నినాదంతో జనతాదళ జలధార పేరిట ఇప్పటికే ఒక యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. త్వరలో పంచరత్న రథయాత్ర, నేతల గ్రామ వాస్తవ్య కార్యక్రమాలతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని దళపతులు వ్యూహ రచనల్లో తలమునకలై ఉన్నారు.

పాలికెలో పాగా కోసం..

పాలికె ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెల్చుకునేందుకు ఉద్యాననగరిలో జనతాదళ్‌ పదిహేను ఎల్‌ఈడీ తెరలున్న వాహనాలతో జనతామిత్ర పేరిట వినూత్న జాగృతిని నిర్వహిస్తోంది. ఆయా వార్డుల్లోని సమస్యలను స్థానికుల ద్వారా తెలుసుకుని, వాటినే వార్డు స్థాయి ప్రణాళికగా ప్రకటించాలని కుమారస్వామి యోచిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రజల వద్దకు వెళ్లేందుకు పంచరత్న రథ యాత్రను నిర్వహించనున్నారు. వ్యవసాయం, నీటి పారుదల, ఉద్యోగం, గృహ నిర్మాణాలు, ఉపాధి అవకాశాలను దళ్‌ పంచరత్నాలుగా ప్రకటించింది. వర్షాలు తగ్గితే ఈ నెలాఖరు నుంచి లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జనతామిత్ర బెంగళూరులోని 28 నియోజకవర్గాలకు పరిమితమైతే, పంచరత్న రథయాత్ర రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలను చుట్టి రానుంది.

కుమార సారధ్యంలో..

కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని గ్రామాల్లో రాత్రుళ్లు ఉండడం ద్వారా గ్రామ వాస్తవ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు రథయాత్ర చేస్తూ రాత్రికి చివరి మజిలీగా గ్రామాల్లో బస చేయాలని కుమారస్వామి నిర్ణయించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బహిరంగ సభలు లేకుండా ఆయా పట్టణాలు, తాలూకా కేంద్రాల్లోని వీధుల్లో ప్రచారాన్ని, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించాలని తీర్మానించారు. పూల దండలు, సత్కారాలు లేకుండా, ప్రజా సమస్యలను వినతిపత్రాల రూపంలో స్వీకరించేలా రథయాత్రను ఆయా జిల్లాల్లో నిర్వహించనున్నారు. పంచరత్న రథ యాత్రలో భాగంగా మైసూరు, దావణగెరె, కల్యాణ కర్ణాటకలోని ఒక నగరంలో మొత్తం మూడు చోట్ల బహిరంగ సభలను నిర్వహిస్తామని కుమారస్వామి ప్రకటించారు. ఈ యాత్రల్లో తనతో పాటు సి.ఎం.ఇబ్రహీం, దేవేగౌడ, బండెప్ప కాశంపూర్‌, హెచ్‌.కె.కుమారస్వామి తదితరులు విడిగా, కొన్నిసార్లు కలిసి పాల్గొంటారు. పాలికె ఎన్నికల నిర్వహణ, ప్రణాళికలకు ప్రత్యేక సమితులనూ దళ్‌ ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రణాళిక సమితికి కె.ఎ.తిప్పేస్వామి అధ్యక్షునిగా, కె.వి.నారాయణ స్వామి సంచాలకునిగా, సి.రాజణ్ణ, ఎస్‌.రమేశ్‌, హెచ్‌.ఎన్‌.దేవరాజు, సుమిత్రి, శైల సభ్యులుగా ఉంటారు. ఎన్నికల నిర్వహణ సమితికి ఎమ్మెల్యే ఆర్‌.మంజునాథ్‌ అధ్యక్షునిగా, సమితి సంచాలకులుగా బెంగళూరు నగర అధ్యక్షుడు ఆర్‌.ప్రకాశ్‌, సమితి సభ్యులుగా రాజ్యసభ మాజీ సభ్యుడు కుపేంద్ర రెడ్డి, సభ్యులుగా కె.ఎ.తిప్పేస్వామి, టి.ఎ.శరవణ, హెచ్‌.ఎం.రమేశ్‌గౌడ, సయ్యద్‌ మోహిద్‌ అల్తాఫ్‌, రూత్‌ మనోరమ, వి.నారాయణ స్వామి, ఇమాన్‌ పాషా, శంశుల్‌హక్‌ ఖాన్‌లను నియమిస్తూ సి.ఎం.ఇబ్రహీం ఆదేశాలు జారీ చేశారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని