logo

శక్తిధామం.. వర్ణశోభితం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లాల్‌బాగ్‌లో నిర్వహిస్తున్న 212వ ఫలపుష్ప ప్రదర్శనకు సందర్శకులు ఆదివారం పోటెత్తారు. ఒకే రోజు ఈ స్థాయిలో సందర్శకులు రావడంతో ఒక కొత్త రికార్డని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

Published : 08 Aug 2022 01:45 IST

పోటెత్తిన సందర్శకులు


శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో రాజ్‌కుమార్‌ విగ్రహం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లాల్‌బాగ్‌లో నిర్వహిస్తున్న 212వ ఫలపుష్ప ప్రదర్శనకు సందర్శకులు ఆదివారం పోటెత్తారు. ఒకే రోజు ఈ స్థాయిలో సందర్శకులు రావడంతో ఒక కొత్త రికార్డని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. టిక్కెట్ల వద్ద, గ్లాస్‌ హౌస్‌లోకి వెళ్లే వరుసలో రద్దీ తీవ్రంగా ఉండడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు. రాజ్‌కుమార్‌, పునీత్‌ విగ్రహాల వద్ద స్వీయ చిత్రాలు, ఫొటోలు తీసుకునేందుకు యువత, పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు పోటీ పడ్డారు. బేడర కణ్ణప్ప, శ్రీకృష్ణ దేవరాయల, రణధీర కంఠీరవ ప్రతిమ, రాఘవేంద్ర స్వామి వేషధారణలోని రాజ్‌కుమార్‌ విగ్రహాల వద్ద ఎక్కువ మంది ఫొటోలు తీసుకున్నారు. మైసూరులోని శక్తిధామ, గాజనూరులోని రాజ్‌కుమార్‌ నివాసాల నమూనాలను చూసి పునీత్‌ను గుర్తు చేసుకుని అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. బోన్సాయి, కూరగాయల ఉద్యానం, ఫలప్రదర్శనలు, ఉద్యానంలోని చెరువు, బెట్ట, తినుబండారాలు, వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే స్టాళ్ల వద్ద కూడా సందర్శకుల సంఖ్య ఎక్కువగానే కనిపించింది. ఈ వారం మూడు సెలవులు ఉన్న నేపథ్యంలో శనివారానికి కనీసం నాలుగు లక్షల మందికి పైగా సందర్శకులు, పర్యాటకులు వచ్చి వెళ్తారని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది.

మైసూరులో పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రారంభించిన శక్తిధామ కేంద్రం నమూనా

సందర్శకులకు నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్న రాజ్‌కుమార్‌ విగ్రహం

ప్రవేశమార్గం వద్ద సందర్శకుల రద్దీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని