logo

కొడగు.. కన్నీటి మడుగు

ఆగకుండా కురుస్తున్న వర్షాలతో కొడగు జిల్లా కన్నీరుమున్నీరవుతోంది. జీవనది కావేరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ, నిద్రాహారాలకు దూరమై కాలం వెళ్లదీస్తున్నారు.

Published : 09 Aug 2022 02:10 IST


మడికేరి సమీపంలో వర్షపీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌

మైసూరు, న్యూస్‌టుడే : ఆగకుండా కురుస్తున్న వర్షాలతో కొడగు జిల్లా కన్నీరుమున్నీరవుతోంది. జీవనది కావేరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ, నిద్రాహారాలకు దూరమై కాలం వెళ్లదీస్తున్నారు. మడికేరి తాలూకాలోని వివిధ గ్రామాల్లోని రహదారులు జలావృతమయ్యాయి. ప్రవాహ తీవ్రత మరికొంత పెరిగితే నాపోక్లు పట్టణంలోకి వెళ్లే అన్ని మార్గాలూ మూసుకు పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నాపోక్లు నుంచి మార్నాడుకు వెళ్లే రహదారిపై బోళిబాణె వద్ద ఐదు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. కొట్టముడి కూడలి వద్ద కాఫీ తోటల్లోకి కావేరి నీరు ప్రవేశించింది. కొన్నిచోట్ల నాలుగు అడుగుల ఎత్తులో నీరు నిలిచి కాఫీ వేర్లు కుళ్లిపోతాయని ప్లాంటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. చెరియపరంబు- కల్లుమొట్టెకు వెళ్లే మార్గంలోనూ వాహన సంచారాన్ని నిలిపి వేశారు. ఈ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోనూ రహదారులపై ఆరు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మడికేరిలో జనరల్‌ తిమ్మయ్య మైదానంలో నీటి మడుగు ఏర్పడింది. నాల్కునాడు పరిధిలోని కక్కబ్బె గ్రామంలో ఫైనరీ దర్గాకు వెళ్లే రహదారులు, ఎమ్మెమాడు-కూరుళి గ్రామానికి వెళ్లే మార్గం, కైకాడు, పారాణె, ఎత్తుకడు, ఎడపాల కడంగ, సిద్ధపుర సమీపంలోని గుహ్య, కరిడిగోడు, విరాజపేట సమీపంలోని అరపట్టు గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రాంతాల్లో కావేరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నాలుగేళ్ల నుంచి కొడగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు విసుగెత్తి పోయారు. కొండచరియలు విరిగిపడడం, రహదారులపై కోత, ఇళ్లపై మట్టి పెళ్లలు జారిపడడం, ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు కొండల్ని తవ్వి రిసార్టుల నిర్మాణం, హోం స్టేల ఏర్పాటుతోనే ఈ పరిస్థితి నెలకొందని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోంది. దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాఫీ తోటలు పాడవుతున్నా పరిహారం అందడం లేదని తోటల యజమానులు ఆరోపించారు. కొడగులో 2018లో సంభవించిన జల ప్రళయానికి ఇళ్లు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. రెండు వేల మంది నిర్వాసితులు కాగా, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కేవలం 800 ఇళ్లను మాత్రమే నిర్మించి ఇచ్చారు. విద్యుత్తును పునరుద్ధరించడం, వంతెనలు, రహదారుల నిర్మాణాలకు జిల్లా పాలన యంత్రాంగం, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక లోక్‌సభ సభ్యుడు స్పందించడం లేదని సామాజిక మాధ్యమాల్లో జిల్లా ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. ఖజానాలో నగదుకు కొరత లేదని ప్రకటిస్తున్న ప్రభుత్వం కొడగు జిల్లాపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని స్థానికులు ఆరోపించారు. మడికేరి సమీపంలోని బలెకండి అనే చోట 30 ఇళ్లకు చేరుకునేందుకు నిర్మించిన రహదారిపై కొండ చరియలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు వచ్చిన జేసీబీపై మన్ను పడడంతో దాని డ్రైవరు రవి, మరో ఇద్దరు స్థానికులు త్రుటిలో పక్కకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. జేసీబీ పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది.


ముర్నాడు- విరాజ్‌పేట మధ్య వంతెన పైభాగాన్ని తాకూతూ ప్రవహిస్తున్న కావేరి నది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని