logo

వానలతో ఎడతెగని బాధలు

భారీ వర్షాలకు బాగలకోట జిల్లాలోని పలు తాలాకాల్లో పంటలు నీట మునిగాయి. దిగంబేశ్వర మఠం వద్ద బసవరాజ జంబగి అనే వ్యక్తికి చెందిన పొలంలోని పొద్దుతిరుగుడు పంట పూర్తిగా నీట మునిగింది.

Published : 09 Aug 2022 02:10 IST


బెళగావి భరతనగరలో కూలిన ఓ ఇంటిని పరిశీలిస్తున్న జిల్లా అధికారి నితీశ్‌పాటిల్‌

బెళగావి, బాగలకోట, న్యూస్‌టుడే : భారీ వర్షాలకు బాగలకోట జిల్లాలోని పలు తాలాకాల్లో పంటలు నీట మునిగాయి. దిగంబేశ్వర మఠం వద్ద బసవరాజ జంబగి అనే వ్యక్తికి చెందిన పొలంలోని పొద్దుతిరుగుడు పంట పూర్తిగా నీట మునిగింది. బెళగావి నగరం, బెళగావి తాలూకా, ఖానాపూర తాలూకాల్లోని అన్ని విద్యాసంస్థలకు జిల్లాధికారి నితేశ్‌ పాటిల్‌ సోమవారం సెలవు ప్రకటించారు. బళ్లారి నాలా నీటితో నిండుగా ప్రవహిస్తోంది. దీనితో యళ్లూరు, దామణె, వడగాంవి, ఆనగోళ, జునే బెళగావి ప్రాంతాల్లో కాలువ పక్క ఉన్న పొలాలు దెబ్బతిన్నాయి. ముంగారులో తాము రెండోసారి వేసుకున్న పంట కూడా వర్షార్పణమైనట్లు రైతులు ఆక్రోశించారు. బెళగావి నగరం వడగావి భారతనగర రెండో అడ్డరోడ్డులో ఆనంద కల్లప్ప బిర్జె అనే వ్యక్తికి చెందిన ఇల్లు సోమవారం ఉదయం కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో ఆదివారం సాయంత్రమే ఈ ఇంటి నుంచి ఏడుగురు ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లారు. పొరుగింటిపైకి గోడ కూలడంతో శాంత అనే గృహిణి స్వల్పంగా గాయపడింది. నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వసమయ్యాయి. బెళగావిలోని ఓం నగర, హిండలగ, శివాజీనగర, వీరభద్ర, కేశవనగరల్లోని రహదారులపై నీరు నిలిచింది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని స్థితి నెలకొంది. కేశవనగరలోని 20కు పైగా ఇళ్లలోకి వర్షం నీరు వచ్చింది. శ్రీనగర గార్డెన్‌లోని బాలల ఆసుపత్రిలో అర అడుగు మేర నీరు చేరుకుంది. పాలికె కమిషనర్‌ రుద్రేశ్‌ గాలి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొందరు బాధితులకు నిత్యావసరాలను అందజేశారు.


మండ్య జిల్లాలో క్యాన్సర్‌తో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని వాననీటిలోనే తరలిస్తున్న బంధువులు

ఇతర జిల్లాల్లో...
చిక్కమగళూరు జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. కళస తాలూకా నెల్లిబీడు గ్రామంలో మనోజ్‌ అనే రైతు పొలంలో పది అడుగుల వైశాల్యంలో 60 అడుగుల లోతుకు భూమి కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తుంగ, భద్ర, హేమావతి నదుల్లో నీటి ప్రవాహ స్థాయి పెరిగింది. వక్క, మిరియాలు, కాఫీ తోటలకు తెగుళ్ల భీతి మొదలైంది. తోటల్లో పనులన్నీ నిలిచిపోయాయి. తిరుగుణ గ్రామంలో రెండు నెలల కిందట వేసిన తారు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయింది. ఈ పనులు చేసిన గుత్తేదారు పరారీలో ఉన్నాడని అధికారులు గుర్తించారు. దక్షిణ కన్నడ జిల్లా సుళ్య సమీపంలో కేరళ సరిహద్దు వోకార్డి సమీపంలోని సుంకదకట్టలో భారీ భవంతి ఒకటి కూలిపోయింది. గోడలు బీటలు వారడం, పునాదుల్లోకి నీరు చేరడంతో రెండు రోజుల క్రితమే దీనిలో ఉంటున్న ప్రజలు, దుకాణదారులు, భాజపా కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ మూడంతస్తుల భవంతిలోకి నిరంతరం నీరు చేరడంతోనే ఈ పరిస్థితి నెలకొందని దాని యజమాని సురేంద్ర పూజారి ఆక్రోశించారు. కలబురగి సమీపంలో వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. అఫ్జలపుర తాలూకా హావనూరు గ్రామాన్ని అనుసంధానం చేసే వంతెన కొట్టుకుపోయింది. యాదగిరి జిల్లాలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యుత్తు లేకపోవడం, విష పురుగులు ఎక్కువ కావడంతో పలు ప్రాంతాల్లో గ్రామస్థులు ఇబ్బందికి గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని