logo

ప్రభుత్వ ఆదేశాలపై విమర్శలు

వారం కిందట విజయనగర, కొప్పళ జిల్లాల బాధ్య మంత్రులను మారుస్తూ చేసిన ఆదేశాలను 24 గంటలు తిరగకముందే రద్దు చేసి ఇరకాటంలో పడిన భాజపా ప్రభుత్వం తాజాగా అలాంటి మరో విచిత్ర ఆదేశాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.

Published : 09 Aug 2022 02:13 IST


మంత్రి ఆనంద్‌సింగ్‌               మంత్రి శశికళా జొల్లె

హొసపేటె, న్యూస్‌టుడే: వారం కిందట విజయనగర, కొప్పళ జిల్లాల బాధ్య మంత్రులను మారుస్తూ చేసిన ఆదేశాలను 24 గంటలు తిరగకముందే రద్దు చేసి ఇరకాటంలో పడిన భాజపా ప్రభుత్వం తాజాగా అలాంటి మరో విచిత్ర ఆదేశాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. విజయనగర జిల్లా బాధ్యమంత్రి శశికళా జొల్లె కొప్పళలో, కొప్పళ జిల్లా బాధ్యమంత్రి ఆనంద్‌సింగ్‌ విజయనగరలో పంద్రాగస్టున జెండా ఎగుర వేయాలన్న కొత్త ఆదేశాలు సోమవారం వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సంబంధించిన జిల్లాల బాధ్య మంత్రులే పంద్రాగస్టున బహిరంగ కార్యక్రమంలో జెండా ఎగుర వేయాలి. ఒకవేళ ఆ జిల్లాకు బాధ్య మంత్రిలేకపోతే సంబంధించిన జిల్లా పాలనాధికారి జెండా ఎగుర వేయాలి. కానీ ఇక్కడ ఇద్దరు జిల్లా మంత్రులకు జెండా ఎగురు వేసే బాధ్యతను మాత్రమే మార్చడం తీవ్ర చర్చలకు తావిచ్చింది. గత నెల 30న మంత్రి ఆనంద్‌సింగ్‌ను విజయనగరకు, శశికళా జొల్లెను కొప్పళ బాధ్యులుగా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెరవెనక ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో కానీ.. 24 గంటల్లోగా ఆ ఆదేశాలు రద్దయ్యాయి. ఇప్పుడు జెండా ఎగురు వేసేందుకు జిల్లా మంత్రులను మార్చడం విడ్డూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హొసపేటె తాలూకా క్రీడామైదానంలో పర్యాటక శాఖ రూ.6కోట్ల ఖర్చుతో దేశంలోనే ఎత్తైన 405 అడుగుల ధ్వజ స్తంభాన్ని నిర్మిస్తోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ స్తంభానికి పంద్రాగస్టును జెండా ఎగుర వేయాలని మంత్రి ఆనంద్‌సింగ్‌ ముఖ్యమంత్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి కొప్పళ జిల్లా బాధ్య మంత్రిగా ఉన్నప్పటికీ విజయనగర జిల్లాలో జెండా ఎగురు వేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ మార్పుపై మంత్రి శశికళా జొల్లె.. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. జెండా ఎగుర వేసేందుకు మంత్రులను మార్చిన అంశంపై మంత్రి శశికళా జొల్లె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆమెను ఒక్కమాట కూడా అడగకుండా మార్చారని సన్నిహితులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని