logo

వరద బాధితులకు సాయం

రాష్ట్రంలోని 3,227 లంబాడీ తాండాలు, కురుబర హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆర్‌.అశోక్‌ వెల్లడించారు. వీటిలో 1034 తాండాలు, హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశామని చెప్పారు.

Published : 09 Aug 2022 02:25 IST


విలేకరులతో మాట్లాడుతున్న అశోక్‌

రాష్ట్రంలోని 3,227 లంబాడీ తాండాలు, కురుబర హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆర్‌.అశోక్‌ వెల్లడించారు. వీటిలో 1034 తాండాలు, హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశామని చెప్పారు.

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : భారీ వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ ప్రకటించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. బాధిత కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెర, కొవ్వొత్తులు, అగ్గిపెట్టె తదితరాలు ఉన్న రూ.వెయ్యి విలువ చేసే ‘బాధ్యత కిట్’ అందిస్తున్నామని ప్రకటించారు. విధానసౌధలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్వాసితులు, ఇళ్లలోకి నీరు చేరడంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు తాము ఒంటరి అనే భావన రాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తోందని వివరించారు. చిన్న కుటుంబానికీ కనీసం పది రోజులకు సరిపోయే నిత్యావసరాలు ఈ కిట్లలో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో వరద, భారీ వర్షాలు, ఆస్తి, పంట నష్టాలు నమోదైనట్లు వివరించారు. పంట, ఆస్తి నష్టం అంచనాలను వర్షం తగ్గిన తర్వాత చేపడతామన్నారు. గత ఏడాది పంట, ఇతర నష్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2,445 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న పరిహారంతో పోల్చితే కర్ణాటకలోనే ఎక్కువ మొత్తంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల కిందట కేఆర్‌ఎస్‌ ఆనకట్ట నిర్మాణం కోసం వచ్చిన 700కుపైగా వలస కార్మికులు శ్రీరంగపట్టణ తాలూకాలో ఉంటున్నారని, వారందరికీ ప్రస్తుతం ఉంటున్న స్థలాలకు హక్కు పత్రాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆగస్టు 1-7 మధ్య అతివృష్ఠితో 14 జిల్లాల్లోని 161 గ్రామాలకు చెందిన 21,727 మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. వీరిలో 8,197 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. నిర్వాసితుల కోసం ప్రారంభించిన 75 కేంద్రాల్లో 7,386 మంది ఆశ్రయం పొందుతున్నారని తెల్లడించారు. అతివృష్ఠితో 73 మంది మరణించగా, ఇందులో పిడుగుపడి 15 మంది, చెట్టు కొమ్మలు పడి ఐదుగురు, ఇళ్లు కూలి 19 మంది, ప్రవాహంలో కొట్టుకుపోయి 24 మంది, లోయల్లో పడి 9 మంది, విద్యుదాఘాతంతో ఒకరు మరణించారని చెప్పారు. వర్షాలకు 666 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 2,449 ఇళ్లకు ఎక్కువ హాని, మరో 17,750 ఇళ్లకు హాని కలిగిందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో 204 ఆవులు, 305 గొర్రెలు, మేకలు వర్షానికి మరణించాయి. పంట హానికి సంబంధించి 1,37,029 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,768 కిలోమీటర్ల పొడవైన రహదారులు, 1,152 చిన్న వంతెనలు, 4,561 పాఠశాలలు, 122 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2,249 అంగన్‌వాడి కేంద్రాలు, 17,065 విద్యుత్తు స్తంభాలు, 1,472 ట్రాన్స్‌ఫారాలు, 95 చెరువులు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

* రాష్ట్రంలో పంట నష్టానికి జాతీయ విపత్తుల నిర్వహణ దళం ఇస్తున్న పరిహారాన్ని పెంచుతున్నట్లు మంత్రి అశోక్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రతి హెక్టారుకు రూ.6,800 బదులుగా రూ.13,600 ఇస్తున్నామని చెప్పారు. మాగాణి సాగు పంటలు నష్టమైతే రూ.13,500 బదులుగా రూ.25 వేలు సాయం చేస్తామని తెలిపారు. బహుళ వార్షిక పంటలు నష్టమైతే రూ.18 వేల బదులుగా రూ.28 వేలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని