logo

కరావళిలో కల్లోలం

రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో వరుణార్భటం కొనసాగుతోంది. కరావళి ప్రాంతంలో కల్లోల పరిస్థితి భయపెడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడలు కూలి, నీట మునిగి, వరద ప్రవాహాల్లో కొట్టుకు పోయి ఆయా ప్రాంతాల్లో 34 మంది మరణించారు. కొన్ని చోట్ల వర్షం తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం కొనసాగింది. మండ్య, కొడగు జిల్లాల్లో ఈ తీవ్రతకు సామాన్యులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.

Published : 09 Aug 2022 02:25 IST

ఎడతెగని వానతో తీవ్ర నష్టం

వారంలోనే 34 మంది మరణం


శివమొగ్గ: ఉప్పొంగి ప్రవహిస్తున్న తుంగమ్మ

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో వరుణార్భటం కొనసాగుతోంది. కరావళి ప్రాంతంలో కల్లోల పరిస్థితి భయపెడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడలు కూలి, నీట మునిగి, వరద ప్రవాహాల్లో కొట్టుకు పోయి ఆయా ప్రాంతాల్లో 34 మంది మరణించారు. కొన్ని చోట్ల వర్షం తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం కొనసాగింది. మండ్య, కొడగు జిల్లాల్లో ఈ తీవ్రతకు సామాన్యులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. కావేరి పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి నెలకొంది. శ్రీరంగపట్టణ, పాండవపుర తాలూకాల్లో 40 గ్రామాల చుట్టూ నీరు చేరింది. పర్యాటక కేంద్రాలు, చరిత్రతో ముడిపడి ఉన్న కట్టడాలూ మునిగి తేలుతున్నాయి. మైసూరు- శ్రీరంగపట్టణ మధ్య సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన వెల్లెస్సి వంతెన వరద ప్రవాహంతో శిథిలమయ్యే స్థితికి చేరుకుంది. శ్రీరంగపట్టణ తాలూకా మహదేవపురంలో క్యాన్సర్‌తో మరణించిన సులోచన అనే మహిళను శ్మశానవాటికకు తీసుకు వెళ్లేందుకు గొంతులోతు నీటిలోనే పాడెపై తీసుకు వెళ్లవలసి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా కూడ్లు గ్రామంలోనే ఇటువంటి పరిస్థితే ప్రజలకు ఎదురైంది. వయోసహజమైన అనారోగ్యంతో తమ్మయ్య గౌడ (80) మరణించారు. శ్మశానవాటికకు వెళ్లే మార్గంలో నడుము లోతు మడుగు ఏర్పడింది. ఇదే మార్గంలోనే స్థానికులు మృతదేహాన్ని తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రతి వర్షాకాలం తమకు ఇదే సమస్య ఎదురవుతోందని స్థానికులు వాపోయారు. రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా కొండాపుర- బాణగహళ్లి మధ్యలో ఏడాది కిందట నిర్మించిన వంతెన ప్రవాహానికి కుప్పకూలింది. ఈ రెండు గ్రామాల మధ్య ప్రజలు పది కిలోమీటర్ల దూరం ఎక్కువ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

పెరిగిన గాలి తీవ్రత
తీర ప్రాంత జిల్లాల్లో గాలి వేగం ప్రతి గంటకు 65 కిలోమీటర్లకు చేరుకుంది. మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బుధవారం వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం ఉంటుందని తెలిపారు. తీర ప్రాంతం జిల్లాలు ఉత్తర కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, కొడగు జిల్లాల్లో మంగళవారం రాత్రి వరకు ఆరంజ్‌ అలర్ట్‌, ఆ తర్వాత గురువారం వరకు ఎల్లో అలర్ట్‌ ఉంటుందని ప్రకటించారు. కార్వార నౌకాశ్రయానికి వచ్చిన వివిధ నౌకలు అక్కడే లంగరు వేసుకున్నాయి. అలల పోటు ఎక్కువగా ఉండడంతో వాటి ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు. భట్కళ బీచ్‌, మురుడేశ్వర, మావినకుర్వా బీచ్‌లలోకి స్థానికంగా గొబ్రా లేదా మురియ అని పిలిచే చేపలు గంపలు గంపలుగా కొట్టుకు వచ్చాయి. చేపల వేటకు వెళ్లని మత్స్యకారులు వీటినే పట్టుకుని వెళ్లారు. మంగళూరు సమీపంలోని పణంబూరుకు 90 నాటికల్‌ మైళ్ల దూరంలో చేపలవేటకు వెళ్లిన ట్రాల్‌ బోటు నీటిలో మునిగింది. బోటులో ఉన్న 11 మంది మత్స్యకారులను మరో బోటులో వెళ్లి రక్షించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి ఉండడంతోనే ట్రాల్‌ బోటు నీట మునిగిందని దాని యజమాని కృష్ణకుమార్‌ తెలిపారు. బంట్వాళ రైల్వేస్టేషన్‌ సమీపంలో విద్యుదీకరణ పనులు చేస్తున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆనంద్‌ కశ్యప (28) అనే కార్మికుడు నేత్రావతి నదిలో స్నానానికి వెళ్లి కొట్టుకుపోయాడు. సహ కార్మికులు ఇచ్చిన ఫిర్యాదుతో మృతదేహం కోసం బీసీ రోడ్డు పోలీసులు గాలింపు చేపట్టారు.


బెళగావి : బెనకనహళ్లి మార్గాన్ని ముంచెత్తిన వరద

తీవ్రమైన సమస్యలు
కావేరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో సమస్యలు తీవ్రమయ్యాయి. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా పుట్టేగౌడనదొడిత్డ గ్రామంలో మూడు దశాబ్దాల కిందటి వంతెన కూలిపోయింది. కాలువ దాటేందుకు తాళ్లతో చేసుకున్న వంతెనను ఉపయోగించుకుంటున్నారు. హనూరు తాలూకాలో తమిళనాడు సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఈ గ్రామంలో 100 ఇళ్లు ఉండగా, 600 ఎకరాల్లో సేద్యం భూములున్నాయి. పాలాలకు వెళ్లేందుకు స్థానికులకు ఇదే ఆధారం. మేకెదాటు నుంచి హొగెనెక్కల్‌ వరకు కావేరి నది ప్రవాహం తీవ్రంగా ఉంది. జలపాతం నుంచి కిందకు దూకే ప్రవాహ తీవ్రతకు భారతదేశపు నయాగరా ఫాల్స్‌గా గుర్తింపు ఉన్న ఈ జలపాతం కనిపించకుండా పోయింది. నదీ తీరంలో ఆలంబాడి, జంబల్‌పట్టి, ఆతూరు గ్రామాలు ద్వీపాలుగా మారిపోయాయి. హొగనెక్కల్‌, గోపీనాథాలను అనుసంధానం చేసే రహదారులు, వంతెనలు నీట మునిగాయి. ఇక్కడకు వస్తున్న పర్యాటకులను మార్గమధ్యలోనే వెనక్కు తిప్పి పంపిస్తున్నారు.

 


కావేరి పోటుతో కలవరం


కృష్ణరాజసాగర జలాశయం నుంచి భారీగా నీటి విడుదల

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కావేరి పరుగులతో మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర (కేఆర్‌ఎస్‌) జలాశయం కొత్త నీటితో పోటెత్తుతోంది. విపరీతమైన ఇన్‌ఫ్లో కారణంగా జలాశయ తలుపులన్నీ తెరిచేసి 1,00,569 క్యూసెక్కుల నీటిని దిగువన తమిళనాడుకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. జలాశయానికి నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ దిగువకు నీటి విడుదల పెంచుతామని వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 124.80 అడుగుల స్థాయిలో కొనసాగిస్తున్నారు. కావేరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీరంగపట్టణలోని రంగనతిట్టు పక్షిధామం నీటిలో మునిగింది. పట్టణానికి చేరువలోని ఆలయాల సమీపానికి వరద తాకుతోంది. జలాశయం దిగువన బృందావన్‌ గార్డెన్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదు. అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగువన హరంగి, కబిని, హేమావతికీ ప్రవాహం పెరుగుతోంది. హరంగి జలాశయానికి 14,920 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు 21,400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కబినీ నుంచి 25 వేల క్యూసెక్కులు, హేమావతి నుంచి 33,670 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.


హేమావతి జలాశయం నుంచి పరుగులు తీస్తున్న గంగమ్మ


తుంగభద్ర జోరు


తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు పరుగులీడుతున్న జలాలు

హొసపేటె, న్యూస్‌టుడే: కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్రకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో సోమవారం జలాశయానికి ఏకంగా 1.08లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయంలోని 30గేట్లను పైకెత్తి 1.05లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీటిని గేట్లద్వారా విడుదల చేయడం ఇది రెండోసారి. 20 రోజుల కిందట ఇదే విధంగా వరద పోటెత్తడంతో 30గేట్లను తీసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో 101.421 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని వచ్చిన వరదను వచ్చినట్లే బయటకు విడుదల చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని