logo

సంక్షిప్త వార్తలు

ఓ బాలిక (15)పై లైంగిక దౌర్జన్యానికి పాల్పడి అరెస్టయిన ఓరలగి శివానంద గౌళేర (60) అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ కార్వారలోని అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి శివాజీ నలవాడె ఆదేశాలు

Updated : 10 Aug 2022 04:35 IST

కామాంధునికి కారాగారవాసం

కార్వార, న్యూస్‌టుడే : ఓ బాలిక (15)పై లైంగిక దౌర్జన్యానికి పాల్పడి అరెస్టయిన ఓరలగి శివానంద గౌళేర (60) అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ కార్వారలోని అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి శివాజీ నలవాడె ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు 2021 సెప్టెంబరు 16న బాలికను తన పొలంలోకి తీసుకు వెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని కేసు దాఖలైంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానానికి అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. బాధితురాలి తరఫున ప్రభుత్వ న్యాయవాది శుభ గాంవ్‌కర్‌ వాదనలు వినిపించారు.


తనయుడి కళ్లెదుటే తండ్రి హత్య

మైసూరు, న్యూస్‌టుడే : తన కుమారుడి (16) కళ్ల ముందే సంపత్‌ కుమార్‌ (60) అనే వ్యాపారి మంగళవారం దారుణహత్యకు గురయ్యాడు. మైసూరు నగర బృందావన్‌ లేఅవుట్కు చెందిన కుమార్‌ ప్రముఖ భూవ్యాపారిగా పేరొందారు. అగర్‌బత్తీల వ్యాపారాన్నీ కొనసాగించారు. ఆయన భార్య గాయత్రి ఉపాధ్యాయురాలు. సోమవారం సాయంత్రం ఇంట్లోకి చొరబడిన నిందితులు ఇనుప కడ్డీలతో ఆయన తల పగులకొట్టి హత్య చేసి పరారయ్యారు. గాయత్రి ఫిర్యాదు మేరకు వి.వి.పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఏనుగుదాడిలో మహిళ దుర్మరణం

రామనగర, న్యూస్‌టుడే : అడవి ఏనుగు దాడి చేయడంతో రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా చెన్నిగన హొసహళ్లిలో చెన్నమ్మ (40) అనే గృహిణి దుర్మరణం పాలైంది. బాధితురాలు గ్రామంలోని సిద్ధప్పాజి దేవాలయంలో అర్చకుడు చెన్నప్ప భార్య. మంగళవారం ఉదయం ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లిన సమయంలో వచ్చిన ఏనుగు ఆమెను తొండంతో కొట్టి చంపింది. ఆ సమయంలో భయంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేలోగా ఏనుగు దాడిచేసి అడవిలోకి వెళ్లిపోయింది. స్థానికుల ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఏనుగు కోసం గాలింపు చేపట్టారు. అక్కూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


భారీగా బంగారు స్వాధీనం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : విదేశాల నుంచి అక్రమంగా విమానంలో బంగారు తీసుకువచ్చిన ఇద్దరు వ్యక్తులను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.90 లక్షల విలువ చేసే 1.7 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. థాయిల్యాండ్‌లోని పుకెట్‌ విమానాశ్రయం నుంచి ఇక్కడి వచ్చిన ఓ యువతి (28) ధరించిన దుస్తుల్లో దాచిన రూ.63 లక్షల విలువ చేసే 1199 గ్రాముల 18 బంగారు బిస్కెట్లను జప్తు చేశారు. బహమాయి దేశం నుంచి వచ్చిన మరో వ్యక్తి వద్ద రూ.27 లక్షల విలువ చేసే 519 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నారు.


ప్రాణం తీసిన ఊయల

మంగళూరు, న్యూస్‌టుడే : ఆడుకుంటున్న సమయంలో ఊయల తాడు మెడకు చుట్టుకుని లిఖిత (11) అనే బాలిక ప్రాణాలొదిలింది. దక్షణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా బాబనకట్టెలో సోమవారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. స్థానిక పాఠశాలలో బాలిక ఆరో తరగతి వియార్థిని. విట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.


కిడ్నాప్‌ కేసులో ఐదుగురి అరెస్టు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రాయదుర్గం కుంటుమారెమ్మ ఆలయ సమీపాన ఈనెల 7న భూస్వామి తిప్పేస్వామి పెద్ద కుమారుడు సిద్ధేశ్వరను కిడ్నాప్‌ చేసిన కేసులో ఐదుగురు నిందితులను పల్లేపల్లిగేట్‌ వద్ద అరెస్టు చేసినట్లు రాయదుర్గం సీఐ శ్రీనివాసులు తెలిపారు. బళ్లారికి చెందిన తిమ్మప్ప, ఉరవకొండ నియోజకవర్గం పాల్తూరు మంజు, నెర్మెట్ల చిదానంద, దివాకర్‌, వన్నూరుస్వామిని అరెస్టు చేసి మంగళవారం అనంతపురం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండుకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును సీజ్‌ చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఆంధ్ర, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వివరించారు.


గుర్తుతెలియని మృతదేహం లభ్యం

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్లాట్‌ఫాం 2, 3 మధ్యలో 207/8-9 కిలోమీటర్‌ మధ్య గుర్తుతెలియని వ్యక్తి(55) మృతిచెందినట్లు స్థానిక గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించి విమ్స్‌కు తరలించారు. మృతుడి సంబంధికులు ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.


మొహర్రం ఆచరణలో యువకుడికి కత్తిపోట్లు

గంగావతి,న్యూస్‌టుడే: మొహర్రం ఆచరణ సమయంలో గొడవ చోటుచేసుకుని యువకుడిని కత్తితో పొడిచిన సంఘటన గంగావతి పట్టణం లింగరాజ్‌ క్యాంప్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. యువరాజ్‌ (22) అనే యువకుడు పీˆర్ల గుండం వద్ద ఉండగా కొందరు వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని గంగావతి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కొప్పళ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీవైఎస్పీ రుద్రేశ్‌ ఉజ్జినకొప్ప తెలిపారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.


యాసిడ్‌ దాడిపై అభియోగపత్రం దాఖలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : సుంకదకట్ట వద్ద ఒక ఉద్యోగిని (23)పై యాసిడ్‌తో దాడి చేసిన నిందితుడు నాగేశ్‌పై పోలీసులు అభియోగపత్రాన్ని 13వ ఏసీఎంఎం న్యాయస్థానంలో మంగళవారం దాఖలు చేశారు. మూడు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 92 మంది సాక్షులు, ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి 164 వాంగ్మూలాలను 770 పుటల ప్రాథమిక అభియోగపత్రంలో నమోదు చేశారు. యాసిడ్‌తో దాడి చేసిన తర్వాత తన సోదరునికి ఫోన్‌ చేసి మాట్లాడిన ఆడియో, ఇతర వాయిస్‌ రికార్డులను పరీక్షించిన ఫోరెన్సిక్‌ ప్రయోగశాల అది నిందితుడిదేనని నిర్ధారించింది. వీటితో పాటు కొన్ని సీసీ టీవీ ఫుటేజ్‌ను న్యాయస్థానానికి అందజేసింది. యాసిడ్‌తో దాడి చేసిన తర్వాత నిందితుడు తమిళనాడు తిరువణ్ణామలైలోని రమణమహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నాడు. నిందితుని రూపురేఖలను గుర్తించి, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని కామాక్షిపాళ్య పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.


‘స్పార్కర్స్‌’ ఉదంతం.. పెరిగిన మృతుల సంఖ్య

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లి తారిహాళ పారిశ్రామికవాడలోని స్పార్కర్స్‌ పరిశ్రమలో జులై 23న సంభవించిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిలో చికిత్స పొందుతూ మొదటి రోజే నలుగురు, తర్వాత మరొకరు చనిపోయారు. చికిత్స పొందుతూ తారిహాళకు చెందిన చెన్నవ్వ మంజునాథ అరివాళ (42) సోమవారం రాత్రి మరణించారు. మరో ఇద్దరికి కిమ్స్‌లో చికిత్సను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో పరిశ్రమ యజమాని అబ్దుల్‌ ఖాదిర్‌ షేక్‌, మేనేజరు మంజునాథను ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ఇద్దరు వాటాదారులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. హుబ్బళ్లి గ్రామీణ ఠాణా పోలీసులు వారి కోసం గాలింపు తీవ్రం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు