logo

గాంధీమార్గమే ఉద్యమ గాండీవం

దేశం కోసం నేనేమి చేయాలనే తపనతో బెంగళూరు వాసి రగిలిపోతునన వేళ.. మహాత్మాగాంధీ నగరంలో అడుగిడి చక్కటి మార్గనిర్దేశనం చేసిన అడుగుజాడలు స్వాతంత్య్ర అమృతమహోత్సవ వేళ- జ్ఞాపకాల దొంతరలుగా కదలాడుతున్నాయి.

Published : 10 Aug 2022 02:40 IST

కన్నడనాట జనం చైతన్య పథం

యశ్వంతపుర రైల్వేస్టేషన్‌లో తొలిసారి అడుగుపెట్టిన గాంధీ.. ఇక్కడే ప్రార్థనలు చేసిన జ్ఞాపకాల పుట

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దేశం కోసం నేనేమి చేయాలనే తపనతో బెంగళూరు వాసి రగిలిపోతునన వేళ.. మహాత్మాగాంధీ నగరంలో అడుగిడి చక్కటి మార్గనిర్దేశనం చేసిన అడుగుజాడలు స్వాతంత్య్ర అమృతమహోత్సవ వేళ- జ్ఞాపకాల దొంతరలుగా కదలాడుతున్నాయి. కర్ణాటక స్వాతంత్య్ర ఉద్యమానికి గట్టి పునాదులు వేసిన ఆయన బోధనలను ఎంచుకుని ఉద్యమపథాన నడిచిన వారెందరో చరిత్ర పుటలకెక్కారు. నాడు బాపూజీతో మాట్లాడేందుకు వేలాది మంది పడిగాపులు కాసేవారు. స్వాతంత్య్రం, స్వేచ్ఛ అవసరాలను బోధించి- శాంతి మార్గలో ఉద్యమించడానికి దారిచూపింది బెంగళూరులోనే. నాటి మైసూరు రాజ్యంలో కాంగ్రెస్‌ పార్టీ పునాదులు వేయడానికి నాలుగుసార్లు బాపూజీ బెంగళూరుకు కదలిచ్చారు. దక్షిణ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగివచ్చాక.. సతీమణి కస్తూరిబాతో కలిసి 1915మే 8న నగరానికి తొలిసారి రైల్లో వచ్చారు. యశ్వంతపుర రైల్వే స్టేషన్‌లో ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి రైల్వే మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నేరుగా ఆనందరావు కూడలిలో ఉన్న బాలబ్రుయి అతిథి గృహానికి చేరుకోగానే వేలాది మంది ప్రజలు ఆయన దర్శనానికి కదలివచ్చారు. ఆ ఒక్కరోజే కనీసం 40 వేల మంది ప్రజలు గుమికూడటం బెంగళూరు చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. బ్రిటిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను గాంధీజీ ప్రస్తావించి ఉద్యమానికి ప్రజలను సన్నద్ధం చేశారు. వ్యక్తి స్వేచ్ఛ, మనుగడ, ఆర్థిక ప్రగతికి స్వాతంత్య్రం సాధించాలని పిలుపునిచ్చా యువతను కదిలించారు. మద్యపానానికి దూరంగా ఉండాలని, అంటరానితనం పాటించరాదంటూ ఉద్బోధించారు.

గాంధీ భవన్‌ ప్రాంగణంలో సద్భావన యాత్ర చిహ్నాలు

* తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయన ప్రస్తుతం గాంధీభవన్‌, హోటల్‌ అశోక్‌ ఉన్న ప్రాంతాలను కలియ తిరిగారు. అక్కడ ఎడతెరిపిలేకుండా సమావేశాలు నిర్వహించారు. ఆయన పర్యటనకు గుర్తుగా.. ప్రస్తుతం హోటల్‌ అశోక్‌ ఉన్న ప్రాంతానికి చేరువలోని ఖాళీ ప్రదేశంలో ఆయన చెట్టు కింద కూర్చొని ప్రజలతో ఎక్కువసేపు చర్చలు కొనసాగించారు. నేడు.. అక్కడే ఓ స్మారకాన్ని నిర్మించి సంరక్షిస్తున్నారు. ఆయన సంచరించిన మరో ప్రదేశంలో గాంధీ భవన్‌ నిర్మించారు. రెండంతస్తుల ఆ భవంతిని తొలి రాష్ట్రపతి డాక్టర్‌ బాబురాజేంద్రప్రసాద్‌ ప్రారంభించడం ప్రస్తావనార్హం. ఆయన స్మృతిపథం.. నేటికీ బెంగళూరు చైతన్యానికి ప్రతీక.

గాంధీకి ఆతిథ్యమిచ్చింది ఈ బాలబ్రుయి అతిథి గృహంలోనే..

మహాత్ముడు నడిచిన నేలపై నిర్మించిన గాంధీభవన్‌


నేటి అశోక్‌ హోటల్‌ ఆవరణలోనే గాంధీ ప్రసంగించడంతో.. అక్కడొక స్మారక నిర్మాణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని