logo

‘దేశభక్తి పేరిట వ్యాపారం’

‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్ప నటుడు. త్రివర్ణ జెండా, జాతీయ గీతాన్ని అవమానించి ఇప్పుడు హర్‌ఘర్‌ తిరంగ పేరుతో నాటకాలు ఆడుతున్నారు’అని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. క్విట్‌ ఇండియా దినోత్సవంలో భాగంగా మంగళవారం

Published : 10 Aug 2022 02:40 IST

జెండాల విక్రయాలపై కాంగ్రెస్‌ ధ్వజం

అంతర్జాతీయ విమానాశ్రయం టోల్‌గేట్‌ నుంచి పాదయాత్ర

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్ప నటుడు. త్రివర్ణ జెండా, జాతీయ గీతాన్ని అవమానించి ఇప్పుడు హర్‌ఘర్‌ తిరంగ పేరుతో నాటకాలు ఆడుతున్నారు’అని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. క్విట్‌ ఇండియా దినోత్సవంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్‌తో కలిసి ఆయన గాంధీ చిత్ర పటానికి పుష్పార్చన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ జెండాను ఆర్‌ఎస్‌ఎస్‌ సొంత పత్రిక విమర్శించారని, సంఘపరివార్‌ నేతలు సార్వకర్‌, గోల్వాల్కర్‌ ఈ జెండానే వ్యతిరేకించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరంలో సంఘపరివార్‌, హిందూ మహాసభ పాత్ర ఏమీ లేదన్నారు. భాజపా నేతలెవ్వరూ త్యాగాలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఇలాంటి వ్యక్తుల నుంచి దేశభక్తి, జాతీయ జెండాను గౌరవించాలన్న పాఠాలు చెప్పించుకోవాల్సిన ఖర్మ పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర పోషించని భాజపా దేశభక్తిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసత్యాలు ప్రచారం చేయడంలో సిద్ధహస్తులని విమర్శించారు. సంఘపరివార్‌, బజరంగదళ్‌, హిందూమహాసభ తదితర సంస్థలు వర్ణవ్యవస్థను ప్రతిపాదిస్తున్నాయని ఆరోపించారు. అక్షరాలకు దూరంగా ఉన్న శూద్రకులాలు చైతన్యవంతులు కావాలన్నారు. కన్నడనాట బసవేశ్వరుడు వచ్చే వరకు మహిళలకు చదువు లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం పేరుతో భాజపా ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపించారు. హర్‌ఘర్‌ తిరంగ కార్యక్రమం పేరుతో జాతీయ జెండాలను విక్రయిస్తున్నారని తప్పుపట్టారు. వాటిని ప్రజలకు ఉచితంగా అందజేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో విధానపరిషత్తులో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌, పీసీసీ కార్యాధ్యక్షులు రామలింగారెడ్డి, సలీం అహ్మద్‌, ఎంపీ డీకే సురేష్‌, మాజీ మంత్రి కేజే జార్జి తదితరులు పాల్గొన్నారు.

గాంధీ చిత్ర పటానికి పుష్పార్చన కార్యక్రమంలో సిద్ధరామయ్య, డీకేశివకుమార్‌ తదితరులు

జెండాకు వందనం.. వేడుకల సంభ్రమం

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగా మంగళవారం బ్యాటరాయనపుర విధానసభ కాంగ్రెస్‌ కార్యకర్తల ఆధ్వర్యంలో అంతర్జాతీయ విమానాశ్రయం టోల్‌గేట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు కృష్ణభైరేగౌడ నాయకత్వం వహించారు. వేలాది మంది కార్యకర్తలు గాంధీ టోపీలు ధరించి చేతిలో జాతీయ జెండా, మహాత్మాగాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్‌, పటేల్‌, ఇందిరాగాంధీ తదితరుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కృష్ణభైరేగౌడ మాట్లాడుతూ పాదయాత్ర మూడు రోజుల పాటు సాగిస్తామన్నారు. స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియజేసేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందని వివరించారు. నకిలీ దేశభక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను జాగృతం చేస్తామన్నారు. దేశానికి కాంగ్రెస్‌ ఏమి చేసిందనే విషయాలను ప్రజలకు వివరిస్తామని ప్రకటించారు. పాదయాత్రలో కాంగ్రెస్‌ నేతలు శ్రీనివాస్‌, జనార్ధన్‌, గోపాలకృష్ణ, జె.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

బాణసవాడిలో జాతీయ జెండా ప్రాధాన్యంపై కార్యకర్తల ర్యాలీ

* రాజాజినగరలో స్థానిక కార్యకర్తలు 50 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ముందు పతాకాలు చేతపట్టుకుని కార్యకర్తలు బయలుదేరగా.. వెనక భారీ జెండాను ప్రదర్శించారు. బాణసవాడిలో జాతీయ జెండా ప్రాధాన్యం వివరిస్తూ స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని