logo
Published : 11 Aug 2022 05:58 IST

అమృత ఘడియలు..అపురూప నేతలు

‘75 ఏళ్ల’ మాజీ ముఖ్యమంత్రులు

పథకాలు.. ‘సిద్ధు’భాగ్యం

ఈనాడు, బెంగళూరు

సిద్ధరామయ్య

ఇటీవలే 75వ జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న సిద్ధరామయ్య అమృత మహోత్స కాలంలో రాష్ట్రానికి వినూత్న పథకాలు అందించారు. రాష్ట్రానికి ఏకకాలంలో సుదీర్ఘకాలం (5ఏళ్ల నాలుగురోజులు) ముఖ్యమంత్రిగా కొనసాగిన నేతల్లో సిద్ధరామయ్య ఒకరు. రాజకీయ ప్రయాణంలో ఆసక్తికరమైన మజిలీలు ఆయనకు సొంతం. ఏ పార్టీలో అడుగుపెట్టినా తన శైలితో అభిమానులను ఆకట్టుగోలరు. ఆ నిండైన అభిమానమే ఎక్కడికక్కడ శత్రువులను పెంచేలా చేస్తుంటుంది. సరిగ్గా ఇదే కారణంతో 2004లో జేడీఎస్‌ నేత హోదాలోనే హుబ్బళ్లిలో నిర్వహించిన అతిపెద్ద అహింద బహిరంగ సభ దేవేగౌడ కన్నెర్రకు గురి చేసింది. అప్పటికే రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా, జేహెచ్‌ పాటిల్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, 2004-05లోనూ జేడీఎస్‌ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య 2004లో కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించిన ఆయన రాష్ట్రానికి లెక్కకు మిక్కిలి ‘భాగ్య’ పథకాలను అందించారు. అన్న, క్షీర, షూ, షాదీ భాగ్య.. వంటి పథకాలతో పాటు ఇందిరా క్యాంటీన్లను తెరిచి భళా అనిపించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధరామయ్య ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేసిన ఘనత సొంతం చేసుకున్నారు. జనతా కుటుంబం నుంచి వచ్చినా కాంగ్రెస్‌లో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. దావణగెరెలో తాజాగా నిర్వహించిన సిద్ధరామోత్సవం కార్యక్రమానికి హాజరైన లక్షలాది అభిమానులు.. ఆయన బలానికి దర్పణం.

భారతదేశమంతా 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఎందరో మహానుభావుల బలిదానంతో బానిస బతుకుల నుంచి స్వేచ్ఛ పొందిన దేశ ప్రజలు.. ఈ అమృత కాలంలో మరెందరో నేతల పాలన ఫలాలను అందుకుని పునీతులయ్యారు. స్వాతంత్య్రం పొందిన రెండు నెలలకే ఏర్పాటైన మైసూరు రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఆపై రూపుదాల్చిన కర్ణాటకకు 23 మంది ముఖ్యమంత్రులు తమ పాలన దక్షతతో అభివృద్ధి బాటలో నడిపించారు. వీరిలో స్వాతంత్య్రానికి పూర్వమే పుట్టి నేటికీ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నవారు కొందరైతే.. మరికొందరు స్వాతంత్య్రం వచ్చిన ఏడాదిలో పుట్టి వర్తమాన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆ అరుదైన నేతల గురించి అమృత మహోత్సవాల సందర్భంగా తెలుసుకుందామా!

సంస్కరణల సృష్టికర్త.. వీరప్ప
స్వాతంత్య్రం వచ్చే నాటికి ఏడేళ్ల బాలుడైన వీరప్పమొయిలీ.. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించారు. రాజకీయానికి న్యాయవాద, రచనా శక్తిని జోడించిన ఆయన రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా 1992 నుంచి 1994 వరకు పని చేశారు. ముఖ్యమంత్రిగా.. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యా భాగ్యను అందించారు. రాష్ట్రానికి తొలి తుళువ ముఖ్యమంత్రిగా సమాజంలో వెనుకబడిన వర్గాల వారి సంక్షేమానికి కృషి చేశారు. ఇంజినీరింగ్‌, వైద్య కోర్సుల ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహించి సామాజిక న్యాయం, ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసిన వీరప్పమొయిలీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్థాపన, రాష్ట్ర అక్షరాస్య ప్రగతి, విశ్వవిద్యాలయ చదువులు, ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు నిధులు అందేలా చేశారు. నీటిపారుదల, విద్యుత్‌, గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు నిధులు కురిపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జాతీయ రాజకీయాల్లో సత్తా చాటారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో 2013-14 వరకు కార్పొరేట్‌, పెట్రోలియం, న్యాయశాఖల మంత్రిగా కూడా పని చేశారు. రాజకీయాలతో సమాంతరంగా తన రచనా పటిమను సానబెట్టుకునే వీరప్పమొయిలీ సరస్వతి సమ్మాన్‌, కేంద్ర సాహిత్య పురస్కారాలను అందుకున్నారు. రామాయణ మహాన్వేషణ రచనతో ఓ వెలుగు వెలిగారు.

కన్నడ ప్రధాని.. గౌడ
హరదనహళ్లి దొడ్డెగౌడ దేవేగౌడ- హెచ్‌.డి.డి.కి స్వాతంత్య్రం వచ్చేనాటికే 14 ఏళ్లు! ప్రస్తుత 89 ఏళ్ల రాజకీయ కురువృద్ధులు రాష్ట్ర, దేశరాజకీయాలను నేటికీ శాసిస్తున్నారు. కర్ణాటక నుంచి దేశానికి ప్రధాని అయిన ఏకైక నేత. 1996 నుంచి 1997 వరకు 10నెలల పాటు దేశానికి 11వ ప్రధానిగా, 1994 నుంచి 1996 వరకు రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా పని చేసిన దేవేగౌడ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సృష్టించిన అత్యయిక రోజుల్లో జైలు శిక్ష అనుభవించిన నేత ఈయన. తన రాజకీయ ప్రస్థానాన్ని 1953లో కాంగ్రెస్‌ నుంచే ప్రారంభించారు. అదే పార్టీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాల్లో అలుపెరగని పోరాటం చేశారు. జాతీయ రాజకీయ పరిణామాల దృష్ట్యా జనతాపార్టీని జనతాదళ్‌లోనికి విలీనం చేసి.. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా దేవేగౌడ నేటికీ కొనసాగుతున్నారు. ప్రధాని పదవికి పూర్వమే జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. 1994 విధానసభ ఎన్నికల్లో ఆ పార్టీకి 115 స్థానాలు దక్కటంతో 14వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవిలో ఏడాన్నర పాటు కొనసాగారు. అదే సమయానికి దేశప్రధాని పదవి ఓ అదృష్టంలా వరించింది. 1996 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాని వేళ యునైటెడ్‌ ఫ్రంట్‌ స్టీరింగ్‌ కమిటీకీ అధ్యక్షులుగా ఉన్న దేవేగౌడ కాంగ్రెస్‌ మద్దతుతో 1996 జూన్‌ 1న దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవిలో 10 నెలలే పని చేసినా దేశానికి ఆర్థిక గమనాన్ని నిర్దేశించారు. దిల్లీ మెట్రో వంటి కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఏడుసార్లు విధానసభకు, ఐదుసార్లు లోక్‌సభ, ఒకసారి రాజ్యసభకు ఎన్నికైన హెచ్‌డీ దేవేగౌడ నేటికీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు

కమల సంచలనం.. అప్ప
సీనియర్‌ నేత బి.ఎస్‌.యడియూరప్పకు ప్రస్తుతం 79 సంవత్సరాలు! రాష్ట్రానికి అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత ఆయనదే. దక్షిణ భారతంతో భాజపాకు పాదులు వేసిన యడియూరప్ప రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు (5ఏళ్ల 82రోజులు) పని చేసిన ముఖ్యమంత్రుల్లో నాలుగోవారు. ఓసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వల్పకాలానికే ఆ పదవిని వదలివేసిన అరుదైన ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరు. 2007 నుంచి 2019 వరకు నాలుగుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. పాలనలో వైవిధ్యత కంటే పార్టీ, తన పదవిని కాపాడుకోవటంలోనే ఎక్కువగా దృష్టి సారించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. భాజపా అధికారంలోనికి వచ్చేందుకు ‘ఆపరేషన్‌ కమల’ వంటి వినూత్న ప్రక్రియకు ఆద్యుడు. 2008, 2018లో జాతీయ రాజకీయాల్లో ఆ ‘ఆపరేషన్లు’ కలకలం రేపాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ.. అవినీతి ఆరోపణలతో 23 రోజులు జైలులో గడిపారు. 2011లో పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతకు గురయ్యారు. ఆ కారణంగానే భాజపాను వీడి కేజేపీ స్థాపించారు. భాజపాకు యడియూరప్ప అవసరం తప్పదన్నట్లు 2013లో మళ్లీ కమలదళంలో చేరారు. అవినీతి కేసులు, కుటుంబ సభ్యుల జోక్యంతో విపక్షాల నోళ్లకు పని అప్పగించారు. 1970లో ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా చేరి.. ఎమెర్జెన్సీ సమయంలో బళ్లారి, శివమొగ్గ జైళ్లలో శిక్ష అనుభవించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆయా సభల్లో ప్రవేశించారు. గత విధానసభలో ఉత్తమ సభ్యులుగా పురస్కారం అందుకున్న యడియూరప్ప.. వివాదాలను మోస్తూనే రాజకీయాలను నెగ్గుకొచ్చారు.

చక్రం తిప్పిన కృష్ణ
స్వాతంత్య్రం వచ్చేనాటికి 15 ఏళ్ల యువకుడైన ఎస్‌.ఎం.కృష్ణ అప్పటికే దేశాన్ని ఓ ప్రగతి చక్రంగా మార్చాలని కలలు కన్నారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక ఆ కలలను సాకారం చేసుకున్నారు. గత మే నెలలో 90 ఏళ్ల జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ప్రపంచ సమాచార సాంకేతిక పటంలో కర్ణాటకకు ఓ స్థానాన్ని కట్టబెట్టేలా చేశారు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్రానికి 16వ సీఎంగా పని చేసిన వేళ బెంగళూరును ఐటీ దిగ్గజ నగరిగా మార్చేందుకు శ్రమించారు. ప్రభుత్వ పథకాల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని(పీపీపీ) స్వాగతించిన ఆయన.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆ పెట్టుబడుల ఫలాలను భావితరాలు అనుభవించేలా చేశారు. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ప్రవేశించి అక్కడా రాణించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, అంతకు ముందు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, డిజిటల్‌ భూమి పత్రాల సాఫ్ట్‌వేర్‌ (భూమి)కి శ్రీకారం చుట్టారు. జాతీయ రాజకీయాల్లో అనుకోని పరిణామాలతో 2012లో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి భాజపాలో కొనసాగుతున్నారు. పాతమైసూరులో కాంగ్రెస్‌కు గట్టి కోటను నిర్మించిన ఎస్‌.ఎం.కృష్ణ మండ్య రాజకీయాలను కనుసైగలతో శాసించగలరు.

 

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts