logo
Published : 11 Aug 2022 05:58 IST

జనం.. జలదిగ్బంధం

వరుణార్భాటానికి నలుగురు మృతి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ఉత్తర కర్ణాటక, మళెనాడు ప్రాంతాల్లో వరుణ ప్రతాపం ప్రజలను సంకట స్థితిలో పడేసింది. ఈ వర్షం కారణంగా బుధవారం ఒక్కరోజే నలుగురు మరణించారు. హావేరి జిల్లా శిగ్గావి తాలూకా కున్నూరు గ్రామంలో ఇంటి గోడ కూలడంతో తీవ్రంగా గాయపడిన ముస్తాక్‌ ఎరగుప్పి (20) అనే యువకుడు హుబ్బళ్లి కిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. చిక్కమగళూరు తాలూకా మూడిగెరె తాలూకాలో ఇంటిపై చెట్టు విరిగి పడడంతో చంద్రమ్మ, సరిత అనే మహిళలు మరణించారు. కలబురగి జిల్లాలో భీమా నదీ తీరంలోని దత్తాత్రేయ ఆలయం సమీపంలో గోపాల్‌ రాథోడ్‌ (20) అనే భక్తుడు ప్రవాహంలో కొట్టుకు పోయాడు. మహారాష్ట్ర నుంచి దత్తాత్రేయ ఆలయం వద్దకు వచ్చి నీటిలో కొట్టుకుపోయాడని పోలీసులు వివరించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని కళసా తాలూకాలోని అన్ని విద్యా సంస్థలకూ సెలవు ప్రకటించారు. విజయపుర జిల్లా డోణి నదిలో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ జిల్లా వ్యవహారాల బాధ్య మంత్రి ఉమేశ్‌ కత్తి పునర్వసతి కేంద్రాల్లో ఉంటున్న బాధితులను పరామర్శించారు. దేవరహిప్పరగి తాలూకా సాతిహాళ గ్రామంలో జరిగిన పంటనష్టాన్ని పరిశీలించారు. కలబురగి జిల్లాలో వర్ష తీవ్రత కొనసాగింది. ఉడుపి జిల్లాలో కాలువలో కొట్టుకుపోయిన బాలిక సన్నిధి (6) మృతదేహం బుధవారం సాయంత్రం దొరికింది.
ః దావణగెరె జిల్లాలో వర్షంతో ఇప్పటికే మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు వర్షార్పణం అయ్యాయి. జిల్లాలో 4,813 హెక్టార్లలోని పంట నాశనం అయ్యిందని జిల్లాధికారి శివానంద కాపసి తెలిపారు. ఇప్పటికే పంట నష్టానికి సంబంధించి 11 వేల మంది రైతులు వేసుకున్న దరఖాస్తులను పరిశీలించి రూ.6.11 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాలకు బదిలీ చేశామని చెప్పారు. వర్షంతో 126 తరగతి గదులు కూలిపోయాయని, కొత్తగా 140 గదుల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం పలికిందని ఆయన వివరించారు. గదగలో వర్షంతో 648 ఇళ్లకు హాని కలిగిందని జిల్లాధికారి డాక్టర్‌ బి.సుశీల తెలిపారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధిని వినియోగించుకుని బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పారు.

నిండిన చెరువులు
కొడగు, దక్షిణ కన్నడ, శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్కమగళూరు తదితర జిల్లాల్లో వర్షం తగ్గుముఖం పట్టింది. నదులు, కాలువల్లో నీటి ప్రవాహాలు మాత్రం పూర్తి ప్రమాణంలో కొనసాగుతున్నాయి. అన్ని చోట్లా భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయి. కొన్నిచోట్ల ఎండిపోయిన బావుల్లోకి నీటి ఊట వచ్చింది. హావేరి జిల్లాలో తుంగభద్ర, వరద, కుమధ్వతి, ధర్మ నదులు ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, మొక్కజొన్న, చెరకు, సోయాబీన్‌, అరటి, మిరప, పత్తి పంటలు నాశనం అయ్యాయి. రాణి బెన్నూర ఎమ్మెల్యే అరుణ్‌కుమార పూజార వరద పీడిత ప్రాంతాలను సందర్శించారు. జులై నెలలో సగటుకన్నా 83 శాతం అధిక వర్షం కురవడంతో విపత్తు ఎక్కువ జరిగిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ చెరువులు, జలాశయాలు నిండాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 71 శాతం చెరువులు నిండాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. చక్కని, భారీ వర్షపాతం నమోదైన పాతిక జిల్లాల్లోని 10,500 చిన్న, పెద్ద చెరువుల్లో 7,522 చెరువులు వర్షాకాలం పూర్తికాకముందే భర్తీ అయ్యాయి. కోలారు జిల్లాలో 2500 చెరువులకు 1875 పొంగి పొర్లుతున్నాయి. కోలారమ్మన చెరువు, కణ్ణూరు చెరువులు పాతికేళ్ల తర్వాత మొదటిసారి నిండాయి. మండ్య జిల్లాలో 1024 చెరువులకు 600 మరువ పారుతున్నాయి. కె.ఆర్‌.పేట తాలూఆకా సంతేబాచిళ్లి హోబళిలో నాలుగు చెరువులు నిండిన సంతోషంలో రైతులు ఉండగానే.. వాటి కట్టలు తెగి నీరు ఖాళీ కావడంతో పాటు, పక్కన ఉన్న పొలాలన్నీ దెబ్బతిన్నాయి.

 

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts