logo

లతా రజనీపై రెండు కేసుల రద్దు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భార్య లతపై నమోదైన వంచన, అబద్దం చెప్పిన కేసులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఫోర్జరీ కేసు విచారణను కొనసాగించేందుకు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. తమిళ చిత్రం ‘కొచాడియన్‌’ సినిమాకు

Published : 11 Aug 2022 05:58 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భార్య లతపై నమోదైన వంచన, అబద్దం చెప్పిన కేసులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఫోర్జరీ కేసు విచారణను కొనసాగించేందుకు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. తమిళ చిత్రం ‘కొచాడియన్‌’ సినిమాకు రజనీకాంత్‌ కుమార్తె దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి సంబంధించి యాడ్‌ బ్యూరో అడ్వర్‌టైజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌, మెసర్స్‌ మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. మెసర్స్‌ మీడియా ఒన్‌ తరఫున లత లావాదేవీలు నిర్వహించారు. చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తాము నష్టపోయామని యాడ్‌ బ్యూరో అడ్వర్‌టైజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ఆరోపించింది. ఒప్పందం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని ఆ సంస్థ డిమాండ్‌ చేసింది. దీనిపై వార్తలను ప్రచురించకుండా లత 2014 డిసెంబరు 2న వేసుకున్న అర్జీని హైకోర్టు 2016లో తోసిపుచ్చింది. స్టేకు సంబంధించి ఆమె అబద్దాలు చెప్పారని, వంచనకు పాల్పడ్డారని, కొన్ని సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆ సంస్థ ఆరోపించింది. స్టే ఆదేశాల్లో ఉన్న సంతకాన్ని నకలు చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగించి, మిగిలిన రెండు ఆరోపణలపై నమోదైన కేసులను కొట్టి వేస్తూ జస్టిస్‌ ఎం.నాగప్రసన్న ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని