logo

ప్రవీణ్‌ కేసు కొలిక్కి

దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బెళ్లారెలో భాజపా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసులో కీలక నిందితులు సియాబుద్దిన్‌ సుళ్య (33), రియాజ్‌ అంకతడ్క (27), బషీర్‌ ఎలిమలె సుబ్రహ్మణ్య (29)ను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 12 Aug 2022 01:18 IST

ప్రవీణ్‌ నెట్టారు

మంగళూరు, న్యూస్‌టుడే : దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బెళ్లారెలో భాజపా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసులో కీలక నిందితులు సియాబుద్దిన్‌ సుళ్య (33), రియాజ్‌ అంకతడ్క (27), బషీర్‌ ఎలిమలె సుబ్రహ్మణ్య (29)ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ మాట్లాడారు. సియాబుద్దీన్‌ కోకోను, రియాజ్‌ కోడి మాంసాన్ని సరఫరా చేసే వారు. బషీర్‌ ఒక హోటల్‌లో ఉద్యోగి. వీరి ముగ్గురికి పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతం తలపాడి వద్ద తలదాచుకున్న వీరిని అరెస్టు చేశామని చెప్పారు. హత్యకు సహకరించిన ఏడుగురితో కలిపి ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరుకుందన్నారు. ప్రవీణ్‌ హత్య తర్వాత వీరు ముగ్గురూ కేరళలోని కాసరగోడు వినబేకల రోడ్డులోని మాలికుద్దీన్‌ మసీదులో తలదాచుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ సంచరించారో విచారణలో గుర్తిస్తామన్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన వారు, హత్య తర్వాత పరారయ్యేందుకు సహకరించిన వారి వివరాలను ఎన్‌ఐఏతో కలిసి దర్యాప్తు చేస్తామని వివరించారు. ఈ కేసులో మొదట అరెస్టయిన షఫీక్‌ తండ్రి ఇబ్రహీం గతంలో ప్రవీణ్‌ నెట్టారు మాంసం దుకాణంలో పని చేసేవాడని తెలిపారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు, వాహనాలను స్వాధీనపరుచుకుని మహజరు నిర్వహించిన అనంతరం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు పూర్తిగా అప్పగిస్తామని చెప్పారు. కేసు దర్యాప్తునకు ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ తదితరులు పూర్తి సహకారాన్ని అందించారని ఆయన తెలిపారు. దర్యాప్తునకు హాసన, మంగళూరు, కార్వార, ఉడుపి పోలీసులు సహకారాన్ని అందించారని చెప్పారు. హంతకులను అరెస్టు చేసిన పోలీసు జట్టుకు నగదు ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. సమావేశంలో దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ రుషికేశ్‌ సోనావాణె, సీఐడి ఎస్పీ అనుచేత్‌, సీనియరు పోలీసుల అధికారి దేవజ్యోతి రే తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని